ఆసక్తికరమైన సరికొత్త పద్ధతిలో బహిరంగ సాక్ష్యం
1. సంఘ క్షేత్రంలో, ఎక్కువమంది నడిచి వెళ్లే ప్రాంతాలు ఉంటే ఏమి చేయమని ప్రోత్సహిస్తున్నారు?
1 మీ సంఘ క్షేత్రంలో, ఎక్కువమంది నడిచి వెళ్లే ప్రాంతాలు ఉన్నాయా? అయితే టేబుళ్లు, కార్టులు ఉపయోగించి బహిరంగ సాక్ష్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోమని ప్రోత్సహిస్తున్నాం. కార్టు ఉపయోగిస్తున్నప్పుడు, కనీసం ఒక్క ప్రచారకుడైనా దాని దగ్గర నిలబడిగానీ కూర్చొనిగానీ ఉంటాడు. అయితే, టేబులు దగ్గర మాత్రం ఇద్దరు ప్రచారకులు ఉండాలి. ప్రజలు ఇబ్బందిపడకుండా అక్కడికి వచ్చేలా వాళ్లు ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, ప్రచారకుడు ఇలా మొదలుపెట్టవచ్చు: “ఈ అంశం గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో మీరెప్పుడైనా ఆలోచించారా?” ఒకరిద్దరు ప్రచారకులు వాళ్ల కనుచూపుమేరలో ఉండి అనియత సాక్ష్యం ఇవ్వవచ్చు.
2. టేబులు మీద సాహిత్యాన్ని పెట్టి బహిరంగ సాక్ష్యం ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలను చూపించే ఒక అనుభవం చెప్పండి.
2 ఈ పద్ధతి వల్ల ఎన్నో బైబిలు అధ్యయనాలు మొదలయ్యాయి. ఒక కళాశాల విద్యార్థిని యెహోవాసాక్షుల మీద ఒక వ్యాసం రాయాలని అనుకుంది. కానీ రాజ్యమందిరం ఎక్కడుందో కనుక్కోలేకపోయింది. ఆ తర్వాతి వారం, వాళ్ల కళాశాల ప్రాంగణంలో సాక్షులు టేబులు ఉపయోగించి ప్రకటించడాన్ని చూసింది. వాళ్లు ఆమెతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు. ఇప్పుడామె బాప్తిస్మం తీసుకుని, ఆ పద్ధతిలోనే బహిరంగ సాక్ష్యం ఇస్తుంది.
3. ఈ పద్ధతిలో సాక్ష్యం ఇవ్వడం గురించి కొంతమంది ప్రచారకులు ఎలా భావిస్తున్నారు?
3 ఈ పద్ధతిలో బహిరంగ సాక్ష్యం ఇచ్చి ఆనందాన్ని పొందిన ఒక సహోదరి ఇలా చెప్పింది: “కొంతమంది, తాజా పత్రికలు తీసుకోవడానికి అక్కడికి వస్తారు. మరికొంతమందికి అసలు యెహోవాసాక్షులే తెలీదు. ఈ పద్ధతి వల్ల చాలామందికి సువార్త చేరుతుందని నేను చెప్పగలను.” మరో సహోదరి ఇలా చెప్పింది: “ఈ కొత్త పద్ధతి చాలా బావుంటుంది, ఎందుకంటే ప్రజలే మీ దగ్గరకు వస్తారు. ఒకవేళ వాళ్లకు మరీ ఎక్కువ ఆసక్తి లేకపోయినా, ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది.”
4. ప్రతీవారం అదే చోట, అదే రోజుల్లో, అదే సమయంలో కార్టులు, టేబుళ్లు పెట్టడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
4 ప్రతీవారం అదే చోట, అదే రోజుల్లో, అదే సమయంలో కార్టులు, టేబుళ్లు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వాటిని చూసీచూసీ ప్రజలు అలవాటు పడతారు, చొరవ తీసుకుని మన దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతారు లేదా సాహిత్యం తీసుకుంటారు. ఈ పద్ధతిలో ‘దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే’ ఎంతో సంతోషం, ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. దీనికోసం మీ సంఘం ఏర్పాట్లు చేసిందా? అయితే, బహుశా మీరు కూడా అందులో పాల్గొనవచ్చు.—లూకా 9:60.