ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోవాలి!
ఓ కొత్త కరపత్రాన్ని ప్రపంచ నలుమూలలా పంచిపెడతాం
1. దేవుని రాజ్యం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో భూవ్యాప్తంగా ఏ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరగనుంది?
1 ఈ సంవత్సరంతో దేవుని రాజ్యం వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. అందుకే, మనం ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమంతో యెహోవాను ఘనపర్చడం ఎంత సముచితం! మనం ఆగస్టు నెలలో, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కొత్త కరపత్రాన్ని ప్రపంచమంతా పంచిపెడతాం. జవాబుల కోసం బైబిల్ని చూడమని అది ప్రజలను ప్రోత్సహిస్తుంది. అంతేకాదు, jw.org వెబ్సైట్ వాళ్లకు ఎలా సహాయపడుతుందో కూడా ఆ కరపత్రం వివరిస్తుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. ఒకవేళ ఇంటివాళ్లకు ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలియకపోతే, చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35) కరపత్రాన్ని లేదా సముచితమైన మరో కరపత్రాన్ని అందించండి.
2. మీరు ఆగస్టు నెలలో “గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము” ఎలా చెల్లించవచ్చు?
2 గొప్ప శబ్దంతో స్తుతి: తమ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్న ప్రచారకుల కోసం ఆగస్టు నెలలో ఓ ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఆ నెలలో, సహాయ పయినీరుగా 30 గంటలు చేసే వెసులుబాటు బాప్తిస్మం పొందిన ప్రచారకులకు ఉంది. ఆగస్టు నెలలో ఐదు శుక్రవారాలు, ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు ఉన్నాయి కాబట్టి, ఉద్యోగానికి లేదా స్కూల్కు వెళ్లే ప్రచారకులు సహాయ పయినీరు సేవ చేయడం వీలౌతుంది. మీ బైబిలు విద్యార్థి లేదా మీ పిల్లలు ప్రచారకులు అవ్వాలని కోరుకుంటుంటే, వెంటనే పెద్దల సభ సమన్వయకర్తతో మాట్లాడండి. ప్రాముఖ్యమైన ఈ నెలలో మనతో కలిసి ప్రకటించడం వాళ్లకు ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో! చాలామంది క్రమ పయినీర్లు, సంవత్సరంలో చేయాల్సిన గంటలు పూర్తిచేసేసి ఆగస్టు నెలలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అయినా, ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనేలా వాళ్లు కూడా కావాల్సిన సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో “గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము” చెల్లించడానికి తాము ఏమి చేయవచ్చో కుటుంబాలు తమ కుటుంబ ఆరాధనలో ఇప్పుడే చర్చించుకోవాలి.—ఎజ్రా 3:11; సామె. 15:22.
3. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం విషయంలో మనమేమి ఆశిస్తున్నాం?
3 మనం ఇంతకుముందు ఇలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోవాలన్నది మన ఆశ. ఆగస్టు నెలలో మన గంటలను, ప్రచారకుల సంఖ్యను, సహాయ పయినీర్ల సంఖ్యను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లగలమా? 2014 సేవా సంవత్సరం ముగుస్తుండగా, ఇంతకు ముందెప్పుడూ జరగనంత గొప్ప స్థాయిలో ఆగస్టు నెలలో సాక్ష్యం ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా తన సేవకులు చేసే ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదించును గాక!—మత్త. 24:14.