‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి’
1. త్వరలో జరిగే సమావేశాల్లో మనం మంచి ప్రవర్తన కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం?
1 సమావేశాలప్పుడు ప్రజల దృష్టి మన మీద పడుతుంది. కాబట్టి, మన ప్రవర్తన మనం ఆరాధించే దేవునికి తగినట్లు ఉండేలా చూసుకోవడం ప్రాముఖ్యం. (లేవీ. 20:26) మన చక్కని ప్రవర్తన, బట్టలు, కనబడేతీరు మనం క్రీస్తు నిజమైన అనుచరులమని స్పష్టంగా చూపించాలి. త్వరలో జరిగే ప్రాదేశిక, అంతర్జాతీయ సమావేశాల్లో మనం ‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగివుంటూ’ మన పరలోక తండ్రికి ఎలా మహిమ తీసుకురావచ్చు?—1 పేతు. 2:12.
2. సమావేశం జరిగే రోజుల్లో, మనం క్రైస్తవుల్లా నడుచుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
2 క్రైస్తవుల్లా నడుచుకోండి: మనం ఒకరిమీద ఒకరం చూపించుకునే ప్రేమ, అలాగే ‘సంఘానికి వెలుపటి వారితో’ మనం వ్యవహరించే విధానం లోకంలోని ప్రజలకూ మనకూ మధ్య తేడాను స్పష్టంగా చూపించాలి. (కొలొ. 3:9, 10; 4:5; 2 తిమో. 3:1-5) హోటల్, రెస్టారెంట్లలో పనిచేసే వాళ్లతో మనం దయగా, ఓర్పుగా ఉండాలి; సమస్యలు తలెత్తినప్పుడు కూడా. మనం చూపించే మంచి మర్యాదల్లో, మనకు సేవలందించే వాళ్లకు టిప్ ఇవ్వడం ఒకటి.
3. తల్లిదండ్రులు ఏమేమి గుర్తుంచుకోవాలి? ఎందుకు?
3 సమావేశ స్థలంలో, రెస్టారెంట్లలో, లాడ్జిలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. (సామె. 29:15) ఒక హోటల్ మేనేజరు ఒక జంటతో ఇలా అంది: “మీ యెహోవాసాక్షులంటే మాకు చాలా ఇష్టం. మీ కుటుంబాల, పిల్లల ప్రవర్తన చాలా చక్కగా, గౌరవపూర్వకంగా ఉంటుంది. మావాళ్లందరూ మీ గురించే మాట్లాడుకున్నారు, ప్రతీ వారాంతం మీరు ఇక్కడే ఉండాలని మా కోరిక.”
4. సమావేశ నగరంలో ఉన్నప్పుడు, కనబడే తీరు విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
4 అణకువ ఉట్టిపడే బట్టలు వేసుకోండి: సమావేశం జరిగే రోజుల్లో మన బట్టలు అణకువ ఉట్టిపడేలా, తగిన విధంగా ఉండాలి. మితిమీరిన లోకపు పోకడలను మనం అనుకరించకూడదు. (1 తిమో. 2:9) హోటల్లో దిగుతున్నప్పుడు, ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు అలాగే సమావేశానికి ముందు, తర్వాత వేసుకునే బట్టలు కూడా అమర్యాదకరంగా ఉండకూడదు. అప్పుడే ఎలాంటి సంకోచం లేకుండా బ్యాడ్జి పెట్టుకోగలుగుతాం, అవకాశం ఉన్నప్పుడు సిగ్గుపడకుండా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. రానున్న సమావేశాల్లో మన కనబడేతీరు, మంచి ప్రవర్తన ప్రాణాలు రక్షించే బైబిలు సందేశం గురించి తెలుసుకోవాలనే కోరికను యథార్థహృదయుల్లో కలిగిస్తుంది, యెహోవాకు సంతోషాన్ని తీసుకొస్తుంది.—జెఫ. 3:17.