“నావల్ల కాదు” అనుకోకండి —బిజీగా ఉన్నా సమయం కేటాయించండి
1. బైబిలు అధ్యయనం గురించి చెప్పడానికి కొంతమంది ఎందుకు వెనుకాడతారు?
1 కొంతమంది తాము బిజీగా ఉన్నందువల్ల బైబిలు అధ్యయనం గురించి చెప్పడానికి వెనుకాడతారు. బైబిలు విద్యార్థి గురించి శ్రద్ధ తీసుకోవాలంటే సమయం కావాలి. అధ్యయనం కోసం సిద్ధపడడానికి, అధ్యయనం నిర్వహించడానికి, అడ్డంకులను అధిగమించేలా సహాయం చేయడానికి సమయం కావాలి. థెస్సలొనీకలో ఉన్నవాళ్లు యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడానికి తాను తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డానని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 థెస్స. 2:7, 8) బిజీగా ఉన్నా మనం ఎలా బైబిలు అధ్యయనం నిర్వహించవచ్చు?
2. యెహోవా మీద ప్రేమ ఉంటే మనం మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాం?
2 ఆరాధనకు సమయం అవసరం: యెహోవాను ఆరాధించాలంటే సమయం అవసరమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు, కూటాలకు వెళ్లాలన్నా, పరిచర్యలో పాల్గొనాలన్నా, బైబిలు చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా కొంత సమయం వెచ్చించాలి. పెళ్లైనవాళ్లు ఎంత బిజీగా ఉన్నా తమ జీవిత భాగస్వామితో గడపడానికి సంతోషంగా సమయం కేటాయిస్తారు. మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనను ఆరాధించడానికి ఇంకెంత సంతోషంగా సమయాన్ని కేటాయించాలో కదా! (ఎఫె. 5:15-17; 1 యోహా. 5:3) యేసు చెప్పినదాని ప్రకారం, శిష్యుల్ని చేసే పని మన ఆరాధనలో ముఖ్యమైన భాగం. (మత్త. 28:19, 20) మనం ఈ విషయాన్ని గ్రహిస్తే, బైబిలు అధ్యయనం నిర్వహించే బాధ్యతను చేపట్టడానికి వెనుకాడం.
3. వివిధ పరిస్థితుల వల్ల మనకు పరిచర్య చేయడానికి తగినంత సమయం దొరకకపోతే బైబిలు అధ్యయనం నిర్వహించే విషయంలో మనం ఏమి చేయవచ్చు?
3 ఉద్యోగం వల్ల, దీర్ఘకాలిక వ్యాధి వల్ల, దైవపరిపాలనా నియామకాల వల్ల మనకు తగినంత సమయం దొరకకపోతే ఏమి చేయవచ్చు? అప్పుడప్పుడు కొంతకాలంపాటు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చే కొంతమంది ప్రచారకులు ఫోను ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా బైబిలు అధ్యయనం నిర్వహిస్తారు. దీర్ఘకాలిక వ్యాధి వల్ల ఇల్లు కదల్లేని వాళ్లు విద్యార్థినే తమ ఇంటికి పిలిపించుకుని అధ్యయనం నిర్వహించారు. మరి కొంతమంది తమకు వీలుకానప్పుడు నమ్మకమైన వేరే ప్రచారకులు వెళ్లి బైబిలు అధ్యయనం నిర్వహించేలా ఏర్పాటు చేసుకున్నారు.
4. బైబిలు అధ్యయనం నిర్వహించేపనిలో పాల్గొంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?
4 సత్యం తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేసేందుకు తన సమయాన్ని, శక్తిని వెచ్చించడం ద్వారా పౌలు ఎంతో సంతోషాన్ని పొందాడు. (అపొ. 20:35) థెస్సలొనీకలో ఆయన పడిన శ్రమకు వచ్చిన ఫలితాన్నిబట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా ప్రేరేపించబడ్డాడు. (1 థెస్స. 1:2) “నావల్ల కాదు” అనుకోకుండా, బిజీగా ఉన్నా బైబిలు అధ్యయనం చేయడానికి సమయం కేటాయిస్తే పరిచర్యలో మనకు ఎంతో సంతోషం, సంతృప్తి లభిస్తాయి.