వెనకాడకండి!
1. మనం ఏ విధంగా ‘మేలు చేయడంలో వెనుకతియ్యము’?
1 దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో చురుగ్గా పాల్గొనడం ద్వారా మనకు నియమించబడిన క్షేత్రాల్లోని ప్రజలకు ‘మేలు చేయడంలో మనం వెనుకతియ్యము.’ (సామె. 3:27) దేవుని పరిపాలనలో మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేయడం కన్నా మానవులకు తెలియజేసే మెరుగైన సందేశమేదీ లేదు. మీరు అనియత సాక్ష్యం ద్వారా లేక సాహిత్యాలు ఇవ్వడం ద్వారా మీరు విస్తృతంగా రాజ్య నిరీక్షణను పంచుకుంటున్నా, మీరింకా బైబిలు అధ్యయనమేదీ నిర్వహించకపోతున్నట్లయితే ఒక బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాలనే లక్ష్యాన్ని మీరు ఎందుకు పెట్టుకోకూడదు?
2. బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించకుండా ఏవి మనల్ని అడ్డుకోవచ్చు?
2 కొన్నిసార్లు, బైబిలు అధ్యయం గురించిన మన ఆలోచనా విధానమే వాటిని నిర్వహించలేకపోవడానికి పెద్ద అడ్డంకులుగా ఉండవచ్చు. కొందరు, తమ సామర్థ్యంపై నమ్మకం లేకపోవడం లేక తీరిక దొరకని కారణంగా బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి వెనుకాడతారు. బైబిలు అధ్యయనాన్ని నిర్వహించడానికి వెనుకాడకుండా ఉండడానికి ఈ క్రింది సలహాలు మీకు సహాయపడవచ్చు.—మత్త. 28:19; అపొ. 20:20.
3. బైబిలును బోధించడానికి మనమెందుకు అర్హులం?
3 సామర్థ్యంపై నమ్మకం లేకపోవడం: మీరు తక్కువ చదువుకోవడంవల్ల లేదా మరితర కారణాలవల్ల బైబిలు అధ్యయనాన్ని నిర్వహించగల మీ సామర్థ్యంపై మీకు నమ్మకం లేకపోవచ్చు. మొదటి శతాబ్దంలోని సమర్థవంతులైన క్రైస్తవ పరిచారకులు కూడా ‘విద్యలేని పామరులే.’ సత్యాన్ని ఇతరులకు బోధించడానికి వారికేది సహాయం చేసింది? “వారు యేసుతోకూడ ఉం[డేవారు].” (అపొ. 4:13) వారు గొప్ప బోధకుడైన యేసు నుండి నేర్చుకున్నారు. ఆయన బోధలు, బోధనా పద్ధతులు, లేఖనాల్లో మనకోసం భద్రపర్చబడ్డాయి. మీరు తక్కువ చదువుకున్నవారైనా, సాటిలేని ఆధ్యాత్మిక విద్యను మీరు పొందుతున్నారు.—యెష. 50:4; 2 కొరిం. 3:5.
4. ఆమోసు ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
4 యెహోవా కొన్నిసార్లు, తప్పు చేసిన పరిపాలకులను లేదా ఉన్నతస్థాయి అధికారులను గద్దించడానికి ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. కొందరు ఆమోసులాగే సామాన్య నేపథ్యంగలవారే. ఆమోసు ఇలా అంగీకరించాడు: “నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తయొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.” (ఆమో. 7:14) అయినప్పటికీ, దూడ ఆరాధకుడు, యాజకుడునైన అమజ్యాకు యెహోవా తీర్పు సందేశాన్ని తెలియజేయడానికి ఆమోసు వెనకాడలేదు. (ఆమో. 7:16, 17) మనం దేవుని పని చేస్తున్నామనీ, ఆయన మనకప్పగించిన పనిని నెరవేర్చడానికి ఆయన మనల్ని అర్హుల్ని చేస్తాడనీ మనమెన్నటికీ మర్చిపోకూడదు.—2 తిమో. 3:16, 17
5. మనకెంత తీరికలేని పనులున్నా బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి మనమెందుకు ప్రయత్నించాలి?
5 తీరిక దొరకకపోవడం: తీరిక దొరకనంతగా మీకెన్ని పనులున్నా, క్రమంగా పరిచర్యలో పాల్గొనేందుకు మీరు ఇప్పటికే సమయాన్ని కేటాయిస్తూ ఉండవచ్చు. పరిచర్యకు సంబంధించిన రంగాల్లో ఎంతో ఆనందాన్నిచ్చే వాటిలో బైబిలు అధ్యయనం నిర్వహించడం ఒకటి. దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకురావడాన్ని చూడడం ఒక చక్కటి ఆధిక్యత. (హెబ్రీ. 4:12) “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” పొందేలా ఎవరికైనా సహాయం చేయడానికి మనం చేసే త్యాగాలనుబట్టి యెహోవా సంతోషిస్తాడు. (1 తిమో. 2:4) ఎవరైనా మునుపటి ప్రవర్తన విషయంలో మారుమనస్సు పొంది ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం చూసినప్పుడు దేవదూతలు సహితం సంతోషిస్తారు.—లూకా 15:10.
6. దేవుని చిత్తాన్ని చేయడంలో మనమెలాంటి గౌరవప్రదమైన పాత్ర పోషిస్తున్నాం?
6 దేవుడు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమో. 2:4) బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి వెనకాడకుండా, దేవుని చిత్తానుసారంగా పనిచేయడంలో మనమెంతటి గౌరవప్రదమైన పాత్ర పోషిస్తున్నామో కదా!