“నావల్ల కాదు” అనుకోకండి —అయోగ్యులమనే భావనను అధిగమించండి
1. కొంతమంది బైబిలు అధ్యయనం గురించి చెప్పడానికి ఎందుకు వెనుకాడతారు?
1 బైబిలు అధ్యయనం సరిగా నిర్వహించే సామర్థ్యం మీకు లేదనుకుంటూ ఆసక్తిగల వాళ్లకు బైబిలు అధ్యయనం గురించి చెప్పడానికి మీరు వెనుకాడుతున్నారా? మోషే, యిర్మీయా వంటి నమ్మకమైన పూర్వకాల సేవకులు కొన్నిసార్లు తమకు అప్పగించబడిన పనిని చేయడానికి తాము అనర్హులమని అనుకున్నారు. (నిర్గ. 3:10, 11; 4:10; యిర్మీ. 1:4-6) చాలామందికి అలాగే అనిపిస్తుంది. అలాంటి భావనలను ఎలా అధిగమించవచ్చు?
2. బైబిలు అధ్యయనాలు నిర్వహించే పని వేరేవాళ్లకు విడిచిపెట్టి కేవలం ఇంటింటి పరిచర్యతో మనం ఎందుకు తృప్తిపడకూడదు?
2 మనకు సాధ్యం కానిది చేయమని యెహోవా ఎన్నడూ అడగడని మనం గుర్తుంచుకోవాలి. (కీర్త. 103:14) కాబట్టి, మనకు అప్పగించబడిన పనిని అంటే ‘శిష్యులను చేసే,’ ‘వారికి బోధించే’ పనిని చేయడం మనకు అసాధ్యమేమీ కాదు. (మత్త. 28:19, 20) యెహోవా అనుభవజ్ఞులకు లేదా నిపుణులకు మాత్రమే ఆ పని అప్పగించలేదు. (1 కొరిం. 1:26, 27) కాబట్టి, బైబిలు అధ్యయనాలు నిర్వహించే పని వేరేవాళ్లకు విడిచిపెట్టి కేవలం ఇంటింటి పరిచర్యతో మనం తృప్తిపడకూడదు.
3. బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి యెహోవా మనల్ని ఎలా అర్హులను చేశాడు?
3 యెహోవాయే మనల్ని అర్హులను చేస్తాడు: శిష్యుల్ని చేసేందుకు కావాల్సిన అర్హతను యెహోవాయే మనకు ఇస్తాడు. (2 కొరిం. 3:5) ఈ లోకంలో బాగా చదువుకున్నవాళ్ళకు కూడా తెలియని బైబిలు సత్యాలను ఆయనే తన సంస్థ ద్వారా మనకు బోధించాడు. (1 కొరిం. 2:7, 8) గొప్ప బోధకుడైన యేసు బోధనా పద్ధతుల నుండి మనం నేర్చుకోవడానికి ఆయన వాటిని బైబిల్లో వ్రాయించి ఉంచాడు, సంఘం ద్వారా మనకు తర్ఫీదు ఇస్తూనే ఉన్నాడు. అంతేగాక, బైబిలును బోధించడానికి కావలసిన అధ్యయన సమాచారాన్ని కూడా యెహోవా మనకు ఇచ్చాడు. సుళువుగా అర్థం చేసుకునే విధంగా, తర్కబద్ధంగా సత్యాన్ని తెలియజేసే బైబిలు బోధిస్తోంది పుస్తకం వంటి ఉపకరణాలను ఆయన మనకిచ్చాడు. కాబట్టి బైబిలు అధ్యయనం నిర్వహించడం మనం అనుకున్నంత కష్టమేమీకాదు.
4. యెహోవా మనకు సహాయం చేస్తాడని మనమెందుకు నమ్మవచ్చు?
4 మోషే, యిర్మీయా తమకు అప్పగించబడిన పనిని యెహోవా సహాయంతో పూర్తి చేయగలిగారు. (నిర్గ. 4:11, 12; యిర్మీ. 1:7, 8) మనం కూడా యెహోవా సహాయాన్ని కోరవచ్చు. మనం ఎవరితోనైనా బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నామంటే, వాళ్లకు యెహోవా గురించిన సత్యాన్ని బోధిస్తున్నట్లే, అది ఆయన దృష్టికి ఇష్టమైన పని. (1 యోహా. 3:22) కాబట్టి, పరిచర్యలో ఎంతో ఆనందదాయకమైన, ప్రతిఫలదాయకమైన పనిని అంటే బైబిలు అధ్యయనం నిర్వహించడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి.