మీ క్షేత్ర సేవా గుంపు నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?
1. మన క్షేత్ర సేవా గుంపు ద్వారా, సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటుతో కలిగిన ఏ ప్రయోజనాలు ఇప్పటికీ మనం పొందవచ్చు?
1 సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటుతో కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు పొందలేకపోతున్నామని బాధపడుతున్నారా? తక్కువమందితో గుంపు ఎంతో అనువుగా ఉండేది. దానివల్ల విశ్వాసాన్ని బలపర్చే స్నేహాలు పెంచుకోవడం వీలైంది. (సామె. 18:24) పుస్తక అధ్యయన పర్యవేక్షకుడికి మనలో ఒక్కొక్కరి గురించి బాగా తెలిసేది కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు వ్యక్తిగత ప్రోత్సాహం ఇచ్చేవాడు. (సామె. 27:23; 1 పేతు. 5:2, 3) మన క్షేత్ర సేవా గుంపు ద్వారా ఇప్పటికీ ఈ ప్రయోజనాలు పొందవచ్చు.
2. విశ్వాసాన్ని బలపర్చే స్నేహాలు పెంచుకోవడానికి మన క్షేత్ర సేవా గుంపులో మనం ఎలా చొరవ తీసుకోవచ్చు?
2 చొరవ తీసుకోండి: క్షేత్ర సేవా గుంపులో కూడా సాధారణంగా సంఘ పుస్తక అధ్యయన గుంపులో ఉన్నంతమందే ఉంటారు. పరిచర్యలో ఇతరులతో “ఒక్క భావంతో” పనిచేస్తున్నప్పుడు మన మధ్య అనుబంధం ఏర్పడుతుంది. (ఫిలి. 1:27) మీ గుంపులో మీరు ఎంతమందితో పనిచేశారు? ఈ విషయంలో ‘మీ హృదయాలను విశాలపర్చుకోగలరా?’ (2 కొరిం. 6:13) మన గుంపులో ఎవరినైనా ఒకర్ని మన కుటుంబ ఆరాధనకు లేదా భోజనానికి ఆహ్వానించవచ్చు. కొన్ని సంఘాల్లో, క్షేత్ర సేవా గుంపులు మరో సంఘం నుండి వచ్చి బహిరంగ ప్రసంగమిచ్చే ప్రసంగీకునికి వంతుల వారీగా ఆతిథ్యమిస్తాయి. తమ వంతు వచ్చినప్పుడు ఆ గుంపు వాళ్లు, ఆ ప్రసంగీకుని కోసం భోజనం సిద్ధం చేసి, ఆయన భోజనానికి ఉన్నా, ఉండకపోయినా, అంతా కలిసి భోంచేసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు.
3. మన క్షేత్ర సేవా గుంపు, కాపరి సందర్శనాన్ని ఏయే రకాలుగా పొందే అవకాశం ఉంది?
3 ఇప్పుడు సంఘాలు వారానికి రెండుసార్లు మాత్రమే కలుసుకుంటున్నా, ప్రచారకులకు ఇంతకుముందులా కాపరి సందర్శనం అందదని కాదు. ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహించడానికి, పరిచర్యలో శిక్షణనివ్వడానికి ప్రతీ గుంపులో గుంపు పర్యవేక్షకుడు ఉంటాడు. మీ గుంపు పర్యవేక్షకుడు మీతో కలిసి పరిచర్య చేయడం గురించి ఇప్పటివరకు ఏమీ చెప్పకపోతే, ఆయనతో పని చేస్తానని మీరే వెళ్లి ఆయనను అడగవచ్చు. సేవా పర్యవేక్షకుడు ప్రతీ నెల ఒక వారాంతం ఒక్కో గుంపుతో కలిసి పరిచర్య చేస్తాడు. క్షేత్ర సేవా గుంపులు కొన్నే ఉండే చిన్న సంఘాల్లో ఆయన ఒక్కో గుంపును సంవత్సరానికి రెండుసార్లు సందర్శించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆయన మీ గుంపుతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు పరిచర్యలో పాల్గొనడానికి మీ పనుల్ని సర్దుబాటు చేసుకుంటున్నారా?
4. (ఎ) క్షేత్ర సేవా కూటాల ఏర్పాటు ఎలా జరుగుతుంది? (బి) క్షేత్ర సేవా కూటం జరుపుకోవడానికి మన ఇంటిని అందుబాటులో ఉంచడం గురించి ఎందుకు ఆలోచించాలి?
4 వారాంతాల్లో ప్రతీ గుంపు క్షేత్ర సేవ కోసం విడిగా కలుసుకుంటే ప్రయోజనాలు అనేకం. పరిచర్య కోసం వివిధ ప్రాంతాల్లో దాదాపు ఒకే సమయానికి కూడుకుంటే ప్రచారకులు సేవా కూటానికి, బహుశా పరిచర్య చేసే ప్రాంతానికి వెళ్లడం సులువౌతుంది. ప్రచారకులను ఇద్దరిద్దరిని నియమించి జాప్యం చేయకుండా పరిచర్య చేసే ప్రాంతానికి పంపించడం వీలౌతుంది. గుంపు పర్యవేక్షకుడు తన పర్యవేక్షణ కింద ఉన్నవారి గురించి వ్యక్తిగత శ్రద్ధ కూడా తీసుకోగలుగుతాడు. పరిస్థితులను బట్టి రెండుమూడు గుంపులను కలపడం అవసరమైతే అలా చేయవచ్చు. నెలలో మొదటి శనివారం లేదా కావలికోట అధ్యయనం తర్వాత సంఘమంతా సేవకోసం ఒక దగ్గర సమకూడితే క్షేత్ర సేవా కూటం ముగింపు ప్రార్థనకు ముందు, గుంపు పర్యవేక్షకులు కొన్ని నిమిషాలపాటు తమతమ గుంపులతో కలిసి కూర్చుని సేవా ఏర్పాట్లు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.—“మీ ఇంటిని అందుబాటులో ఉంచగలరా?” అనే బాక్సు చూడండి.
5. సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటు ఇప్పుడు లేకపోయినా మనం ఏ ప్రయోజనం పొందుతామనే ధీమాతో ఉండవచ్చు?
5 సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటు ఇప్పుడు లేకపోయినా, యెహోవా తన చిత్తం చేయడానికి మనకు కావల్సిన దానినంతటినీ సమకూరుస్తున్నాడు. (హెబ్రీ. 13:20, 21) యెహోవా పర్యవేక్షణ కింద మనకు ఏదీ కొదువ ఉండదు. (కీర్త. 23:1) మన క్షేత్ర సేవా గుంపు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందవచ్చు. మనమే చొరవ తీసుకుని, ‘సమృద్ధిగా విత్తితే, సమృద్ధిగా పంటకోస్తాం.’—2 కొరిం. 9:6.
[6వ పేజీలోని బాక్సు]
మీ ఇంటిని అందుబాటులో ఉంచగలరా?
వారాంతాల్లో కలుసుకోవడానికి సరిపడా ఇళ్లు అందుబాటులో లేనందువల్ల కొన్ని సంఘాల్లోని ఒకటిరెండు క్షేత్ర సేవా గుంపులు కలిసి సేవచేస్తాయి. క్షేత్ర సేవా కూటాలు సంఘ ఏర్పాటులో భాగం కాబట్టి వాటిని జరుపుకోవడానికి మన ఇంటిని అందుబాటులో ఉంచడం నిజంగా మనకు దొరికే ఒక గొప్ప అవకాశం. మీ ఇంటిని అందుబాటులో ఉంచగలరా? మీది చిన్న ఇల్లు అని వెనకాడకండి. పెద్దలు మీ ఇల్లు ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని అలాగే సంఘ పుస్తక అధ్యయనానికి స్థలాలను ఎంచుకునేటప్పుడు పరిశీలనలోకి తీసుకున్న ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మీ ఇంటిని అందుబాటులో ఉంచాలనుకుంటే ఆ విషయాన్ని గుంపు పర్యవేక్షకునికి తెలియజేయండి.