ప్రకటనా పని చేసేందుకు కొత్తవారికి శిక్షణ ఇవ్వండి
1. మీరు మొట్ట మొదటిసారి ఇంటింటి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది?
1 మీరు మొట్ట మొదటిసారి ఇంటింటి పరిచర్యకు వెళ్ళిన సంగతి మీకు గుర్తుందా? మీరు చాలా కంగారుపడి ఉంటారు. మీకు బైబిలు అధ్యయనం చేస్తున్నవారితో లేదా మరో ప్రచారకునితో కలిసి పనిచేసినప్పుడు, వారు చేసిన సహాయాన్ని బట్టి మీరెంతో సంతోషించి ఉంటారు. ఇప్పుడు మీరు పరిచారకునిగా అనుభవం సంపాదించుకున్నారు, కాబట్టి ప్రకటనా పనిలో కొత్తవారికి శిక్షణ ఇవ్వగల స్థానంలో ఉన్నారు.
2. కొత్త ప్రచారకులు ఏమి నేర్చుకోవాలి?
2 ఇంటివారితో సంభాషణ ఎలా మొదలుపెట్టాలి, వారితో మాట్లాడుతున్నప్పుడు బైబిలు ఎలా ఉపయోగించాలి, పునర్దర్శనాలు ఎలా చేయాలి, బైబిలు అధ్యయనాలు ఆరంభించి, వాటినెలా నిర్వహించాలి వంటి విషయాలను కొత్త ప్రచారకులు నేర్చుకోవాలి. అలాగే వారు వీధి సాక్ష్యమివ్వడం, వ్యాపార స్థలాల్లో ప్రజలతో మాట్లాడడం లాంటి వివిధ పరిస్థితుల్లో కూడా ఎలా ప్రకటించాలో నేర్చుకోవాలి. సువార్త ప్రకటించేటప్పుడు గృహస్థుల సున్నితమైన మతాభిప్రాయాలను గౌరవిస్తూ యుక్తిగా, జాగ్రత్తగా వ్యవహరించడం గురించి కూడా వారు నేర్చుకోవాలి. (కొలొ. 4:6) ఈ విషయాలన్నింటిలో మీ మాదిరి, సలహాల ద్వారా వారు అభివృద్ధి సాధించడానికి మీరు సహాయం చేయవచ్చు.
3. మన మాదిరి ద్వారా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?
3 మాదిరి ద్వారా బోధించండి: ఎలా ప్రకటించాలో యేసు తన శిష్యులకు ప్రదర్శించి చూపించాడు. (లూకా 8:1; 1 పేతు. 2:21) కొత్త ప్రచారకులతో కలిసి ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు, వారు అనుకరించగల బహుశా మన ప్రచురణల్లోని నమూనాను ఉపయోగిస్తూ సులభంగా చెప్పగల మాటల్ని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత, ఆ ప్రచారకుడు మీరు ఎలా మాట్లాడుతున్నారో గమనించేలా మొదటి రెండు ఇళ్ళల్లో మీరే మాట్లాడండి. మరో ఇంటికి వెళ్తుండగా మీరు మాట్లాడింది ఎలావుందని ఆ ప్రచారకుణ్ణి అడగండి. ఇలా ఇతరులతో కలిసి పనిచేయడం ఎంత ప్రయోజనకరమో గ్రహించడానికే కాక, ఆయన మాట్లాడిన తర్వాత మీరిచ్చే సలహాలను అంగీకరించడం కూడా ఆయనకు సులభంగా ఉంటుంది.
4. కొత్త ప్రచారకులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విన్న తర్వాత వారికెలా సహాయం చేయవచ్చు?
4 సలహాలు ఇవ్వండి: ఎలా ప్రకటించాలనే దాని గురించి యేసు తన శిష్యులకు సూచనలు కూడా ఇచ్చాడు. (మత్త. 10:5-14) అదే రీతిలో మీరు కూడా గృహస్థులతో ఎలా మాట్లాడాలో కొత్త ప్రచారకులకు సూచనలు ఇవ్వవచ్చు. అంతేగాక వారు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వారు మాట్లాడిన దానిలో సరిదిద్దుకోవాల్సిన అంశాలను మీరు గమనించి ఉండవచ్చు, అంతమాత్రాన వెంటనే వారిని సరిదిద్దకుండా, వారు మాట్లాడినదానిలో ప్రత్యేకంగా ఏది మీకు నచ్చిందో దానిని చెప్పండి. వారు ఒకవేళ తర్వాతి ఇంట్లో బాగా మాట్లాడతారేమో గమనించండి. మొదటిసారి బహుశా కంగారులో సరిగా మాట్లాడలేకపోయారేమో. ప్రచారకులందరికీ ఒకే రకమైన సామర్థ్యాలు ఉండవనీ, సరిదిద్దడానికి రకరకాల విధానాలు ఉంటాయనీ గుర్తుపెట్టుకోండి.—1 కొరిం. 12:4-7.
5. సలహాలు ఇవ్వడానికి చొరవ తీసుకుంటున్నప్పుడు మనమేమి చెప్పవచ్చు?
5 కొన్నిసార్లు కొత్త ప్రచారకులు మిమ్మల్ని సలహాలు అడగవచ్చు. ఒకవేళ అలా అడగకపోతే, మీరే చొరవ తీసుకొని సహాయం చేయండి. యుక్తిగా వారికి ఎలా సహాయం చేయవచ్చు? అనుభవజ్ఞులైన ప్రచారకులు, “నేను మీకో విషయం చెప్పనా?” అని గానీ, లేదా “మీరు మాట్లాడింది మీకెలా అనిపించింది?” అని గానీ అడగవచ్చు. మరోలా ఎలా చెప్పవచ్చంటే, “నేను కొత్తగా ప్రచారకుడిని అయినప్పుడు, నాకు ఇది చాలా కష్టమనిపించింది . . . కానీ ఇదిగో ఇది నాకు చాలా సహాయం చేసింది. . . .” కొన్నిసార్లు, బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్నపుస్తకంలోని అంశాలను గానీ, మన రాజ్య పరిచర్యలోని అంశాలను గానీ కలిసి చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది. వారిని గాభరా పెట్టకుండా ఉండేందుకు, వారి సంభాషణకు సంబంధించి కేవలం ఒకే అంశంపై సలహాలు ఇవ్వండి.
6. పరిచర్య పనిలో ‘ఇనుముచేత ఇనుము పదునవుతుంది’ అని ఎలా చెప్పవచ్చు?
6 ఇనుముతో ఇనుము పదునవుతుంది: బోధించే పనిని శ్రద్ధగా చేస్తూ, అభివృద్ధి సాధిస్తూ ఉండాలని సువార్త పనిలో అనుభవజ్ఞుడైన తిమోతికి పౌలు సలహా ఇచ్చాడు. (1 తిమో. 4:13, 15) మీరు ఎన్నో సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం ఎప్పటికీ ఆపకూడదు. పరిచర్యలో మీకన్నా తక్కువ అనుభవం గల ప్రచారకుల నుండి నేర్చుకోవడమే కాక సువార్త ప్రకటనా పనిలో నైపుణ్యం గలవారిగా ఎదిగేందుకు ప్రత్యేకంగా కొత్తవారికి దయాపూర్వకంగా సహాయం చేసేందుకు సంసిద్ధంగా ఉండండి.—సామె. 27:17.