ప్రతీరోజు యెహోవాను స్తుతించండి
1. దేవుని సేవకులు ఏమి చేయాలని ప్రోత్సహించబడుతున్నారు, ఎందుకు?
1 రాజైన దావీదు, ‘అనుదినము,’ చివరికి నిత్యమూ యెహోవాను స్తుతించాలనే దృఢనిశ్చయాన్ని వ్యక్తం చేశాడు. (కీర్త. 145:2, 7, 21) ప్రతీరోజు యెహోవాను స్తుతించడానికి మనకు కూడా మంచి కారణమే ఉంది.—కీర్త. 37:10; 145:14, 18; 2 పేతు. 3:13.
2. కుటుంబాలు యెహోవాను ప్రతీరోజు ఎలా స్తుతించవచ్చు?
2 ఇంట్లో: దినవచనాన్ని పరిశీలిస్తున్నప్పుడు, కుటుంబ ఆరాధన జరుపుకుంటున్నప్పుడు, సంఘ కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు యెహోవా గురించి, బైబిలు గురించి మాట్లాడుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహకరమైన సమాచారం మనకు అందుబాటులో ఉంది. చాలా కుటుంబాలు రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబమంతా కలిసి భోజనం చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకుంటారు. అది, కుటుంబమంతా ఏ తొందర లేకుండా చక్కగా సంభాషించుకోవడానికి, యెహోవాను స్తుతించడానికి అవకాశాలనిస్తుంది. తల్లిదండ్రులు చేసే అలాంటి సంభాషణలు, తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి దోహదపడతాయి.—ఎఫె. 6:4; ద్వితీ. 6:5-7.
3. సహోదరులతో కలిసి యెహోవాను స్తుతించే ఏ అవకాశాలు మనకు లభిస్తాయి?
3 సహోదరులతో కలిసి: ప్రకటనాపనిలో లేదా సంఘ కూటాల్లో మనం మన సహోదరులతో కలిసి యెహోవాను స్తుతించే గొప్ప అవకాశాలు లభిస్తాయి. (సామె. 15:30; ఫిలి. 4:8; హెబ్రీ. 13:15) మనమందరం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి, ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా మంచితనంపట్ల మనకున్న మెప్పుదలను సులువుగా మన మాటల్లో వ్యక్తం చేయగలుగుతాం.—కీర్త. 106:1.
4. బహిరంగ పరిచర్యలోనే కాక ఇంకా ఏయే విధాలుగా యెహోవాను స్తుతించవచ్చు?
4 అవిశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు: మనం ప్రతీరోజు సువార్త ప్రకటనాపనిలో పాల్గొనడానికి మన పరిస్థితులు అనుమతించకపోయినా, యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి తోటి ఉద్యోగులతో, తోటి విద్యార్థులతో, ఇతరులతో మాట్లాడినప్పుడు యథార్థ హృదయంగల వాళ్లలో నిరీక్షణను నింపగలుగుతాం. (కీర్త. 27:14; 1 పేతు. 3:15) ఒక సహోదరి తోటి ప్రయాణికురాలితో మాట్లాడినప్పుడు, ఆమె తాను విన్నదాన్నిబట్టి ఎంతో ఓదార్పును, ప్రోత్సాహాన్ని పొంది ఆమెను మళ్లీ కలవడానికి వీలుగా తన అడ్రస్సు, ఫోను నంబరు మన సహోదరికి ఇచ్చింది. పెరుగుతున్న కష్టాలతో, అంతకంతకూ చెడిపోతున్న పరిస్థితులతో ప్రజలు బాధపడుతుండగా యెహోవా ప్రజలు, వినేవారికి “సువర్తమానము” ప్రకటించడంలో కొనసాగుతారు. ఇది ఇతరులకు నిరీక్షణను ఇవ్వడమేకాక, వాళ్లు యెహోవాను స్తుతించేలా చేస్తుంది.—యెష. 52:7; రోమా. 15:11.
5. మనం ఎందుకు యెహోవాను స్తుతించాలనుకుంటాం, అది దేనికి నడిపిస్తుంది?
5 యెహోవా తన సేవకులు ప్రతీరోజు తనను స్తుతించడం విని ఎంతో సంతోషిస్తాడు. మన చుట్టూవున్న సృష్టి యెహోవాను స్తుతిస్తుండగా, మనం కూడా ఇంట్లో, సంఘంలో, అలాగే యెహోవాను స్తుతించడానికి ఇంకా మనతో కలవని అవిశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు ప్రతీరోజు యెహోవాను స్తుతిద్దాం.—కీర్త. 19:1-4.