ప్రపంచవ్యాప్తంగా ఆనందమయ స్తుతికర్తలయ్యేందుకు వేర్పర్చబడ్డాం
“యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.”—కీర్తన 113:1.
1, 2. (ఎ) కీర్తన 113:1-3 వచనాలకు అనుగుణ్యంగా, ఉత్సాహంతో కూడిన మన స్తుతిని పొందేందుకు ఎవరు అర్హులు? (బి) ఏ ప్రశ్నను అడగడం సహేతుకం?
యెహోవా దేవుడు భూమ్యాకాశముల మహా సృష్టికర్త, నిత్యుడైన మన విశ్వ సర్వాధిపతి. ఉత్సాహంతో కూడిన మన స్తుతిని పొందేందుకు ఆయన సంపూర్ణ అర్హతగలవాడు. అందుకే కీర్తన 113:1-3 మనకు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నాముము స్తుతి నొందదగినది.”
2 దేవుని సాక్షులుగా, మనం ఇది చేసేందుకు ఆనందిస్తాము. నేడు మనం ఆలపిస్తున్న ఈ ఆనందమయ స్తుతి గీతాన్ని యెహోవా దేవుడు త్వరలోనే భూవ్యాప్తంగా ఆలపించబడేలా చేస్తాడనేది ఎంత ఉత్తేజకరమైన విషయమో కదా! (కీర్తన 22:27) ఈ గొప్ప ప్రపంచవ్యాప్త గానాలాపనలో మీ స్వరం వినిపిస్తుందా? అలాగైతే, ఈ అనైక్య, ఆనందరహిత ప్రపంచంనుండి వేరు చేయబడటం మనకు ఎంత ఆనందాన్ని కలిగించాలో కదా!
3. (ఎ) యెహోవా ప్రజలను ఏది విశిష్టమైన, అసమానమైన వారిగా చేస్తుంది? (బి) మనం ఏ యే విధాలుగా వేరుపరచబడి ఉన్నాము?
3 మనం యెహోవాను ఐక్యంగా స్తుతించడం మనలను విశిష్టమైన, అసమానమైన వారిగా చేస్తుంది. మనందరి మాటలూ మరియు బోధనా పని ఒకేలా ఉంటాయి మరియు యెహోవా యొక్క ‘మహా దయాళుత్వమును’ ప్రకటించేందుకు ఒకే విధమైన పద్ధతులను ఉపయోగిస్తాము. (కీర్తన 145:7) అవును, యెహోవా సమర్పిత ప్రజలుగా మనం మన దేవుడైన యెహోవా సేవ నిమిత్తం ప్రత్యేకపర్చబడి ఉన్నాము. తన సమర్పిత ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న జనాంగాల నుండి వేరుగా ఉండాలని మరియు వారి ఆచారాల చేత కళంకితం కాకుండా ఉండాలని దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 34:12-16) వారలా చేసేందుకు ఆయన తన ప్రజలకు నియమాలను ఇచ్చాడు. అదే విధంగా, నేడు యెహోవా మనకు తన పరిశుద్ధ వాక్యమైన బైబిలును ఇచ్చాడు. ఈ లోకంనుండి మనల్ని మనం ఎలా వేరుగా ఉంచుకోవాలో అందులోని ఉపదేశాలు మనకు చూపిస్తాయి. (2 కొరింథీయులు 6:18; 2 తిమోతి 3:16, 17) మహాబబులోను నందలి సన్యాసులు మరియు సన్యాసినుల వలె మనం సన్యాసుల మఠాల్లోనూ సన్యాసినుల మఠాల్లోనూ వేరుగా ఉండడం ద్వారా ప్రత్యేకపర్చబడడం లేదు. యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ, మనం యెహోవా బహిరంగ స్తుతికర్తలం.
యెహోవా ముఖ్య స్తుతికర్తను అనుకరించండి
4. యెహోవాను స్తుతించడంలో యేసు ఎలా మాదిరినుంచాడు?
4 యెహోవాను స్తుతించాలనే తన సంకల్పం నుండి యేసు ఎన్నడూ వైదొలగలేదు. ఇది ఆయనను లోకంనుండి ప్రత్యేకపరచింది. సమాజ మందిరంలోనూ యెరూషలేము నందలి దేవాలయంలోనూ ఆయన దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపర్చాడు. కొండ శిఖరం మీదైనా లేక సముద్ర తీరానైనా, ప్రజలు ఎక్కడ సమకూడితే అక్కడ యేసు యెహోవాను గురించిన సత్యాలను బహిరంగంగా ప్రకటించాడు. ఆయనిలా స్పష్టం చేశాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, . . . నిన్ను [“బహిరంగముగా,” NW] స్తుతించుచున్నాను.” (మత్తయి 11:25) పొంతి పిలాతు ఎదుట న్యాయవిచారణకు వచ్చినప్పుడు కూడా యేసు ఇలా పలికాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:37) యేసు తన పని యొక్క ప్రాముఖ్యతను గుణగ్రహించాడు. యేసు ఎక్కడ ఉన్నప్పటికీ, యెహోవా గురించి సాక్ష్యమిచ్చాడు మరియు ఆయనను బహిరంగంగా స్తుతించాడు.
5. కీర్తన 22:22 ఎవరికి అన్వయిస్తుంది, మన దృక్పథం ఏమై ఉండాలి?
5 కీర్తన 22:22 నందు, యెహోవా ముఖ్య స్తుతికర్తను గురించిన ఈ ప్రవచనార్థక వ్యాఖ్యానాన్ని మనం కనుగొంటాము: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.” మరియు హెబ్రీయులు 2:11, 12 నందు, అపొస్తలుడైన పౌలు ఈ వచనాలను ప్రభువైన యేసుకు మరియు పరలోక మహిమ కొరకు యెహోవా దేవుడు ప్రత్యేకపరచిన వారికి అన్వయించాడు. ఆయనవలె, యెహోవా నామాన్ని సంఘంలో స్తుతించేందుకు వారు సిగ్గుపడరు. మన సంఘ కూటాలకు హాజరయ్యేటప్పుడు మనం కూడా అదే విధమైన మానసిక దృక్పథాన్ని కలిగి ఉంటామా? కూటాల్లో మనం శ్రద్ధగా అవధానమివ్వడం ద్వారా, వ్యాఖ్యానించడం ద్వారా, పాటలు పాడటం ద్వారా ఉత్సాహంగా భాగంవహించడం యెహోవాను ఘనపరుస్తుంది. అయితే మన ఆనందభరితమైన స్తుతి అక్కడితో సమాప్తమౌతుందా?
6. యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞనిచ్చాడు, వెలుగును ప్రేమించే వారు దేవున్ని ఎలా ఘనపరుస్తారు?
6 మత్తయి 5:14-16 ప్రకారం, ఇతరులు కూడా యెహోవాను స్తుతించగలిగేలా తన అనుచరులు తమ వెలుగును ప్రకాశించనివ్వాలని ప్రభువైన యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఆయనిలా చెప్పాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు . . . మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” వెలుగును ప్రేమించేవారు దేవునికి ఘనతను తెస్తారు. వారు మంచితనమూ మానవత్వమూ గల మాటల ద్వారా క్రియల ద్వారా మాత్రమే అలా చేస్తారా? లేదు, బదులుగా వారు యెహోవాను ఐక్యంగా ఘనపర్చడం ద్వారా అలా చేస్తారు. అవును, వెలుగును ప్రేమించేవారు తమనుతాము దేవునికి సమర్పించుకుని ఆయన ఆనందమయ స్తుతికర్తలౌతారు. మీరు ఈ సంతోషకరమైన చర్య గైకొన్నారా?
యెహోవాను స్తుతించడం ద్వారా ఆనందం
7. యెహోవా స్తుతికర్తలు ఎందుకు ఆనందంగా ఉన్నారు, సా.శ. 33 పెంతెకొస్తు దినాన ఎలాంటి ఆనందం వారి స్వంతమైంది?
7 యెహోవా స్తుతికర్తలు ఎందుకంత ఆనందంగా ఉంటారు? ఎందుకంటే ఆనందమనేది దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఫలము. గలతీయులు 5:22 నందలి వరుస క్రమంలో, అది సరిగ్గా ప్రేమ తర్వాత ఉంది. మొదటి శతాబ్దంలో యేసు శిష్యులు యెహోవా ఆత్మ యొక్క ఈ ఫలాన్ని ప్రదర్శించారు. అంతెందుకు, సా.శ. 33 పెంతెకొస్తు నాడు, యేసు శిష్యుల్లో 120 మంది మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు, వారందరూ యెహోవాను వేర్వేరు భాషల్లో స్తుతించనారంభించారు. అనేక దేశాలనుండి యెరూషలేముకు వచ్చిన భక్తిగల యూదులు ‘కలవరపడి విభ్రాంతినొందారు.’ ఆశ్చర్యంతో వారిలా అన్నారు: “మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నా”ము. (అపొస్తలుల కార్యములు 2:1-11) యెహోవాను ఇలా బహుభాషల్లో అద్భుతంగా స్తుతించడం వల్ల కలిగిన ఫలితమేమిటి? దాదాపు 3,000 మంది యూదులూ యూదా మత ప్రవిష్టులూ మెస్సీయను గురించిన రాజ్య సువార్తను అంగీకరించారు. వారు బాప్తిస్మం తీసుకుని, పరిశుద్ధాత్మను పొంది యెహోవా అనందమయ స్తుతికర్తలుగా ఆతురతగా తమ స్వరాలను జత కలిపారు. (అపొస్తలుల కార్యములు 2:37-42) అదెంతటి దీవెనయై ఉండినదో కదా!
8. పెంతెకొస్తు తర్వాత, తమ ఆనందాన్ని అధికం చేసుకునేందుకు క్రైస్తవులు ఏమి చేశారు?
8 ఆ నివేదిక ఇలా కొనసాగుతుంది: “వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.” (అపొస్తలుల కార్యములు 2:46, 47) వారు సహవసించి, కలిసి ఆహారం తీసుకోవడమే వారికి గొప్ప ఆనందాన్ని తీసుకువచ్చిందా? లేదు, వారు యెహోవా దేవున్ని ప్రతిదినము స్తుతించడమే వారికి ముఖ్యంగా ఆనందాన్ని తెచ్చింది. తాము తెలిపిన రక్షణ సందేశానికి వేలాదిమంది ప్రతిస్పందించడం వారికి అత్యంత ఆనందాన్ని తీసుకువచ్చింది. నేడు మన విషయంలో కూడా అదే జరుగుతుంది.
అన్ని దేశాల్లో ఆనందమయ స్తుతికర్తలు
9. (ఎ) తన సువార్తను వినే అవకాశాన్ని దేవుడు అన్ని దేశాల ప్రజలకు ఎప్పుడు మరియు ఎలా ఇవ్వడం ప్రారంభించాడు? (బి) కొర్నేలి మరియు ఆయన సహవాసులు బాప్తిస్మం తీసుకోకముందే పరిశుద్ధాత్మ వారిపై ఎందుకు కుమ్మరింపబడింది?
9 వెలుగును ప్రకాశించే తన సేవకుల పని కేవలం ఒక దేశానికే పరిమితం కావాలని యెహోవా ఇష్టపడలేదు. అందుకే, సా.శ. 36 మొదలుకొని తన సువార్తను వినే అవకాశాన్ని ఆయన అన్ని దేశాల ప్రజలకూ ఇచ్చాడు. దేవుని నడిపింపుతో, పేతురు కైసరయలోని అన్యుడైన సైనికాధికారి ఇంటికి వెళ్లాడు. అక్కడ కొర్నేలి తన సన్నిహిత స్నేహితులతో మరియు కుటుంబంతో సమావేశమై ఉండడం ఆయనకు కనిపించింది. వారు పేతురు మాటలను శ్రద్ధగా విని తమ హృదయాల్లో యేసునందు విశ్వాసముంచారు. మనకెలా తెలుసు? ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ అన్యులైన ఆ విశ్వాసులపైకి వచ్చింది. సాధారణంగా, దేవుని ఆత్మ వరము ఎవరైనా బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే వారిపై కుమ్మరించబడేది, అయితే ఆ సందర్భంలో యెహోవా తాను ఈ యూదేతరులను అంగీకరిస్తున్నానని వారి బాప్తిస్మానికి ముందే సూచించాడు. ఒకవేళ యెహోవా అలా చేసి ఉండకపోతే, దేవుడు ఇప్పుడు అన్యులను తన సేవకులుగా అంగీకరిస్తున్నాడనే విషయమూ మరియు వారు నీటి బాప్తిస్మానికి అర్హులనే విషయమూ పేతురుకు ధృవీకరించబడి ఉండేది కాదు.—అపొస్తలుల కార్యములు 10:34, 35, 47, 48.
10. అన్ని దేశాలకు చెందిన ప్రజలూ యెహోవాను స్తుతిస్తారని ప్రాచీన కాలాలనుండీ ముందే ఎలా చెప్పబడింది?
10 అన్ని దేశాల ప్రజలూ తనను స్తుతిస్తారని యెహోవా ప్రాచీన కాలంనుండే చెప్పాడు. ప్రతి ప్రాంతంలోనూ తనకు ఆనందమయ స్తుతికర్తలు ఉంటారు. దీన్ని నిరూపించేందుకు, అపొస్తలుడైన పౌలు హెబ్రీ లేఖనాలలో నుండి ప్రవచనాలను ఉదాహరించాడు. రోమ్నందలి అంతర్జాతీయ క్రైస్తవ సంఘానికి ఆయనిలా చెప్పాడు: “క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై—ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని [కీర్తన 18:49 నందు] వ్రాయబడియున్నది. మరియు [ద్వితీయోపదేశకాండము 32:43 నందు] అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు మరియు [కీర్తన 117:1 నందు] సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.”(ఇటాలిక్కులు మావి.)—రోమీయులు 15:7-11.
11. అన్ని దేశాలకు చెందిన ప్రజలూ తన సత్యాలను నేర్చుకునేందుకు దేవుడు వారికెలా సహాయం చేశాడు, దాని ఫలితమేమిటి?
11 అన్ని దేశాల ప్రజలపై పరిపాలించేందుకు దేవునిచేత నియమించబడిన వాడైన యేసుక్రీస్తుపై తమ నిరీక్షణను నిలపకపోతే ప్రజలు యెహోవాను ఐక్యంగా స్తుతించలేరు. నిత్యజీవానికి నడిపించే తన సత్యాలను వారు గుణగ్రహించడానికి వారికి సహాయపడేందుకు, దేవుడు ఒక అంతర్జాతీయ బోధనా కార్యక్రమాన్ని స్థాపించాడు. ఆయన తన నమ్మకమైన దాసుని తరగతి ద్వారా నడిపింపునిస్తున్నాడు. (మత్తయి 24:45-47) దాని ఫలితం? 230 కంటే ఎక్కువ దేశాల్లో 50 లక్షలకంటే ఎక్కువమంది ఆనందమయ స్తుతికర్తల స్వరాలు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతున్నాయి. అదే చేయడానికి ఇంకా లక్షలమంది ఆసక్తిని చూపిస్తున్నారు. 1996 జ్ఞాపకార్థ దినానికి ఎంతమంది హాజరయ్యారో చూడండి: 1,29,21,933 మంది. అద్భుతం!
ఆనందమయ స్తుతికర్తల గొప్ప సమూహాన్ని గురించి ముందే చెప్పబడింది
12. అపొస్తలుడైన యోహాను ఏ ఉత్తేజకరమైన దర్శనాన్ని చూశాడు మరియు దానంతటి సజీవ వాస్తవం ఏమిటి?
12 అపొస్తలుడైన యోహాను తన దర్శనంలో, అన్ని దేశాలనుండీ వచ్చిన “గొప్పసమూహము”ను చూశాడు. (ప్రకటన 7:9) దేవుని అభిషిక్త శేషంతోపాటూ ఈ గొప్పసమూహం పాడుతున్న స్తుతుల ముఖ్యాంశం ఏమిటి? యోహాను మనకిలా చెబుతున్నాడు: ‘సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము.’ (ప్రకటన 7:10) ఇది ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ధైర్యంగా ప్రకటించబడుతుంది. లాక్షణికంగా చెప్పాలంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని, విశ్వ సర్వాధిపతిగా మనం దేవున్ని ఐక్యంగా స్తుతిస్తున్నాము. మనం ఆయనకు, గొఱ్ఱెపిల్ల అయిన యేసుక్రీస్తు అగు ఆయన కుమారునికి మన రక్షణ విషయమై భూమ్యాకాశముల ఎదుట ‘స్తోత్రము’ చెల్లించుచున్నాము. ఓహ్, గొప్పసమూహం యొక్క ఈ మహత్తరమైన దర్శనాన్ని చూసి అపొస్తలుడైన యోహాను ఎంత ఉత్తేజాన్ని అనుభవించి ఉంటాడో! యోహాను చూసిన దాని సజీవ వాస్తవాన్ని చూడగలుగుతున్నందుకు, చివరికి అందులో ఒక భాగం కాగలుగుతున్నందుకు మనకు నేడు ఎంత ఉత్తేజంగా ఉందో కదా!
13. యెహోవా ప్రజలను లోకంనుండి ఏది వేర్పరుస్తుంది?
13 యెహోవా సేవకులుగా, మనం ఆయన నామాన్ని సగర్వంగా ధరిస్తాము. (యెషయా 43:10, 12) మనం యెహోవాసాక్షులం అయివుండటమే మనలను ఈ లోకంనుండి వేరు చేస్తుంది. దేవుని విశేషమైన నామాన్ని ధరించడం మరియు ఆయన దైవిక పనిని మన జీవిత సంకల్పంగా కలిగి ఉండటం ఎంత ఆనందకరమైన విషయమో కదా! రాజ్యం ద్వారా తన పరిశుద్ధ నామాన్ని పవిత్రపర్చాలనీ మరియు తన విశ్వ సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చాలనీ యెహోవా కలిగివున్న గొప్ప సంకల్పం మన జీవితాలకు అర్థాన్ని చేకూరుస్తుంది. తన నామం మరియు రాజ్యం గురించిన తన దైవిక సంకల్పంలో మనం ఒక స్థానాన్ని కలిగి ఉండేందుకు ఆయన మనకు సహాయం చేశాడు. దీనిని ఆయన మూడు విధాల్లో చేశాడు.
సత్యం అప్పగించబడింది
14, 15. (ఎ) తన నామానికీ రాజ్యానికీ సంబంధించిన తన దైవిక సంకల్పంలో మనం స్థానాన్ని కలిగి ఉండేందుకు దేవుడు సహాయం చేసిన మార్గాల్లో ఒకటి ఏమిటి? (బి) సా.శ. 1914లో స్థాపించబడిన రాజ్యం సా.శ.పూ. 607లో కూలద్రోయబడిన దానినుండి ఎలా వేరుగా ఉంది?
14 మొదటిగా, యెహోవా తన ప్రజలకు సత్యాన్ని అప్పగించాడు. ఆయన రాజ్యం 1914లో పరిపాలన ప్రారంభించిందనేది అత్యంత సంతోషకరమైన ప్రకటన. (ప్రకటన 12:10) ఈ పరలోక ప్రభుత్వం యెరూషలేములో ఉండిన రాజ్యం నుండి భిన్నమైనది. దానిలో దావీదు వంశానికి చెందిన రాజులు సింహాసనాసీనులై పరిపాలించే వారు. ఆ రాజ్యం కూలద్రోయబడింది. సా.శ.పూ. 607 మొదలుకొని యెరూషలేము అన్య ప్రపంచ శక్తుల పరిపాలనకు సంపూర్ణంగా లోపర్చబడింది. 1914లో యెహోవా స్థాపించిన క్రొత్త రాజ్యం యెహోవాకు తప్ప మరింకెవరికీ ఎన్నడూ లోపర్చబడదు మరియు అది ఎన్నటికీ నాశనం చేయబడదు. (దానియేలు 2:44) అంతేకాకుండా, దాని పరిపాలనాధికారం వేరుగా ఉంటుంది. ఎలా? ప్రకటన 11:15 ఇలా సమాధానమిస్తుంది: “పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు—ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు”ను. (ఇటాలిక్కులు మావి.)
15 “మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము”నైన ప్రభుత్వం పూర్తి మానవజాతి అంతటిపై అధికారాన్ని నిర్వహిస్తుంది. యెహోవా యొక్క మెస్సీయ కుమారుడు, యేసు యొక్క 1,44,000 మంది సహోదరులు—వీరిలో అనేకులు ఇప్పటికే పరలోక మహిమకు పునరుత్థానం చేయబడ్డారు—ఇమిడివున్న యెహోవా సర్వాధిపత్యపు ఈ క్రొత్త వ్యక్తీకరణ విద్యార్థులు చర్చించేందుకు ఆసక్తి చూపించే తత్త్వాధార విషయం కాదు, అంటే కేవలం సైద్ధాంతిక సంబంధ విషయం మాత్రమే కాదు. ఈ పరలోక రాజ్యం నిజమైన ఒక ప్రభుత్వం. దాని పరిపాలన వల్ల కలిగే పరిపూర్ణతతో నిత్యం జీవించగల ఆనందమయ ఉత్తరాపేక్ష మనకుంది. అది మనం ఆనందంతో కొనసాగేందుకు మనకు తగినన్ని కారణాలను ఇస్తుంది. యెహోవా వాక్యమందలి అలాంటి సత్యాలు మనకు అప్పగింపబడటం మనం దాని గురించి ఎల్లప్పుడూ మంచిగా మాట్లాడేందుకు మనలను పురికొల్పుతుంది. (కీర్తన 56:10) దేవుని మెస్సీయ రాజ్యం ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికీ చెప్పడం ద్వారా మీరు దీనిని క్రమంగా చేస్తున్నారా?
పరిశుద్ధాత్మ ద్వారా, ప్రపంచవ్యాప్త సహోదరత్వం ద్వారా సహాయం పొందడం
16, 17. తన దైవిక సంకల్పంలో మనం స్థానాన్ని కలిగి ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేసిన రెండవ మార్గమేమిటి, మూడవ మార్గమేమిటి?
16 తన దైవిక సంకల్పంలో ఒక స్థానాన్ని కలిగి ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేసిన రెండవ మార్గం ఆయన తన పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారానే. మన జీవితాల్లో దాని చక్కని ఫలాలను ఉత్పన్నం చేసేందుకు మరియు ఆయన అంగీకారాన్ని పొందేందుకు అది మనకు సహాయం చేస్తుంది. (గలతీయులు 5:22, 23) అంతేకాకుండా, పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము . . . దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.” (1 కొరింథీయులు 2:12) యెహోవా ఆత్మకు ప్రతిస్పందించడం ద్వారా, వాగ్దానాలను, చట్టాలను, సూత్రాలను మరియు మరితరమైన వాటిని అంటే ఆయన దయతో ఇచ్చిన ప్రస్తుత మంచి విషయాలను మనం అర్థం చేసుకోగలము.—మత్తయి 13:11 పోల్చండి.
17 దేవుడు మనకు సహాయం చేస్తున్న మూడవ మార్గం విషయానికొస్తే, మనకు మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం మరియు ఆరాధన కొరకు యెహోవా చేసిన ఆనందభరితమైన సంస్థాపర ఏర్పాటు ఉన్నాయి. “సహోదరులను ప్రేమించుడి” అని అపొస్తలుడైన పేతురు మనలను ప్రోత్సహించినప్పుడు ఆయన దాని గురించే మాట్లాడాడు. (1 పేతురు 2:17) “సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి” అని కీర్తన 100:2 ఆజ్ఞాపిస్తున్న విధంగా, మనం ఆనంద హృదయంతో యెహోవా సేవ చేసేందుకు మన ప్రేమపూర్వక, సహోదర సహోదరీలుగల అంతర్జాతీయ కుటుంబం మనకు సహాయం చేస్తుంది. 4వ వచనం ఇంకా ఇలా చెబుతుంది: “కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి.” కాబట్టి మనం బహిరంగంగా ప్రకటిస్తున్నప్పుడైనా సరే లేక మన కూటాలకు హాజరౌతున్నప్పుడైనా సరే ఆనందాన్ని అనుభవించగలము. యెహోవా యొక్క ఆత్మీయ దేవాలయంలోని అందమైన ఆవరణలో మనం ఎంత గొప్ప శాంతి సమాధానాలను కనుగొనగలిగామో కదా!
యెహోవాను ఆనందంతో స్తుతించండి!
18. హింస లేక ఇతర సమస్యలు మనలను చుట్టుముట్టినప్పటికీ మనం యెహోవాను స్తుతించడంలో ఎలా ఆనందాన్ని పొందగలము?
18 ఎలాంటి కష్టతరమైన పరిస్థితులూ, హింస లేక ఇతర సమస్యలూ మనలను చుట్టుముట్టినప్పటికీ, మనం యెహోవా ఆరాధనాలయంలో ఉన్నామని ఆనందిద్దాము. (యెషయా 2:2, 3) ఆనందం అనేది హృదయానికి చెందిన లక్షణమని జ్ఞాపకం ఉంచుకోండి. మన తొలి క్రైస్తవ సహోదర సహోదరీలు అనేక కష్ట పరిస్థితులనూ నష్టాలనూ అనుభవించినప్పటికీ వారు యెహోవా ఆనందమయ స్తుతికర్తలయ్యారు. (హెబ్రీయులు 10:34) నేడు మన తోటి విశ్వాసులు వారిలాగే ఉన్నారు.—మత్తయి 5:10-12.
19. (ఎ) యెహోవాను స్తుతించేందుకు పదే పదే ఇవ్వబడిన ఏ ఆదేశాలు మనలను పురికొల్పుతాయి? (బి) మన నిరంతర జీవితాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి, మన తీర్మానం ఏమిటి?
19 యెహోవాను సేవించే మనమంతా ఆయనను స్తుతించాలనే బైబిలు ఆదేశాలకు విధేయులమవ్వడంలో ఆనందిస్తాము. ప్రకటన గ్రంథంలో దేవునికి చెల్లించబడిన స్తుతులకు మధ్య మధ్యలో “ప్రభువును స్తుతించుడి” అనే వాక్యం పదే పదే ఉపయోగించబడింది. (ప్రకటన 19:1-6) కీర్తన 150వ అధ్యాయంలోని ఆరు వచనాల్లో, యెహోవాను స్తుతించాలని 13 సార్లు మనకు చెప్పబడింది. యెహోవా స్తుతులను ఆనందమయంగా పాడటంలో సర్వసృష్టీ కలవాలనే విశ్వవ్యాప్త విజ్ఞప్తి ఇది. ఈ గొప్ప హలెల్లూయ స్తుతి గీతంలో మన స్వరాలను కలపడంపై మన నిత్యజీవం ఆధారపడి ఉంది! అవును, యెహోవాకు అనితర స్తుతులు చెల్లించే ప్రజలు మాత్రమే నిత్యం జీవిస్తారు. కాబట్టి, అంతం సమీపిస్తుండగా ఆయన యథార్థమైన ప్రపంచవ్యాప్త సంఘానికి మనం ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలని తీర్మానించుకున్నాము. తర్వాత, “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి” అని చెబుతున్న కీర్తన 150 యొక్క చివరిమాటల సంపూర్ణ నెరవేర్పును చూసేందుకు మనం నిరీక్షించవచ్చు.
మీరెలా సమాధానమిస్తారు?
◻ యెహోవా ప్రజలను విశిష్టమైన అసమానమైన వారిగా చేసేదేది?
◻ యెహోవా సేవకులు ఎందుకంత ఆనందంగా ఉంటారు?
◻ లోకంనుండి మనలను ఏది వేరుగా ఉంచుతుంది?
◻ తన దైవిక సంకల్పంలో మనం స్థానాన్ని కలిగి ఉండేందుకు ఏ మూడు మార్గాల్లో దేవుడు మనకు సహాయం చేశాడు?
[17వ పేజీలోని చిత్రం]
యేసు తానెక్కడ ఉండినప్పటికీ యెహోవాను గురించి సాక్ష్యమిచ్చాడు మరియు ఆయనను బహిరంగంగా స్తుతించాడు