యెహోవాసాక్షుల పరిపాలక సభ
యెహోవాను ప్రేమిస్తున్న మీకు,
‘మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది’ అని యేసు అన్నాడు. (యోహాను 8:31, 32) ఆ మాటలెంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో కదా! అవును, సత్యం మచ్చుకైనా కనిపించని ఈ అపాయకరమైన ‘అంత్యదినాల్లో’ సత్యం తెలుసుకోవడం సాధ్యమే. (2 తిమోతి 3:1) మీరు దేవుని వాక్యంలోని సత్యాన్ని మొదటిసారి గ్రహించినప్పుడు మీరెంత ఆనందించారో గుర్తుచేసుకోండి!
అయితే సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, దాని గురించి క్రమంగా ఇతరులకు చెప్పడమెంత ప్రాముఖ్యమో, ఆ సత్యానికి అనుగుణంగా ప్రవర్తించడం కూడా అంతే ప్రాముఖ్యం. అలా చేయాలంటే మనం దేవుని ప్రేమలో నిలిచివుండాలి. దేవుని ప్రేమలో నిలిచివుండడమంటే అర్థమేమిటి? యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి చెప్పిన మాటల్లో ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఆయన నమ్మకస్థులైన తన అపొస్తలులతో మాట్లాడుతూ, “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని చెప్పాడు.—యోహాను 15:10.
యేసు తన తండ్రి ఆజ్ఞలకు లోబడుతూ దేవుని ప్రేమలో నిలిచివున్నానని చెప్పడాన్ని గమనించండి. మనం కూడా అలాగే చేయాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే, మనం ప్రతీరోజు సత్యానికి అనుగుణంగా ప్రవర్తించాలి. పై మాటలు చెప్పిన రోజునే, “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు” అని కూడా యేసు చెప్పాడు.—యోహాను 13:17.
మీరు ప్రతీరోజు సత్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, ‘నిత్యజీవార్థమైన దేవుని ప్రేమలో నిలిచి ఉండేందుకు’ ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.—యూదా 20, 21.
యెహోవాసాక్షుల పరిపాలక సభ