ప్రశ్నాభాగం
▪ ఒక జంట రాజ్యమందిరంలో పెళ్ళి చేసుకోవాలనుకుంటే, వాళ్ళు పెద్దలతో ఏ విషయాలు మాట్లాడాలి?
బైబిలు సూత్రాల ప్రకారం జరిగే పెళ్ళిళ్ళు యెహోవాకు ఘనతను తీసుకొస్తాయి. రాజ్యమందిరంలో జరిగే కార్యక్రమాలను చూసి చుట్టూవున్నవాళ్ళు మనం ఏదైనా ఎంత చక్కగా నిర్వహిస్తామో గమనిస్తారు కాబట్టి ప్రత్యేకించి అక్కడ జరిగే పెళ్ళిళ్ళు యెహోవాకు ఘనతను తీసుకువస్తాయి. ‘సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలి’ కాబట్టి, పెళ్ళి చేసుకోబోయే జంట రాజ్యమందిరంలో పెళ్ళి చేసుకుంటామని అడిగినప్పుడు స్థానిక పెద్దలు ఆ పెళ్ళికి సంబంధించిన కొన్ని విషయాలు వాళ్ళతో చర్చించడం మంచిది.—1 కొరిం. 14:39, 40.
ఆ జంట, రాజ్యమందిరాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతి కావాలని అక్కడ కూటాలు జరుపుకునే సంఘ సేవా కమిటీకి రాసివ్వాలి. రాజ్యమందిరాన్ని ఏ తేదీన, ఏ సమయానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో తెలియజేస్తూ ఎంతో ముందుగానే అలా రాసివ్వాలి. పెళ్ళి కోసమని పెద్దలు కూటాల సమయాల్లో ఎలాంటి మార్పులు చేయరని వాళ్ళు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా, పెళ్ళి చేసుకునే వాళ్ళిద్దరికీ బైబిలు సూత్రాలకు, యెహోవా నీతి ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తున్నారనే మంచి పేరుండాలి.
గౌరవనీయుడైన మన దేవునికి, పెళ్ళి ఏర్పాట్లవల్ల అపకీర్తి రాకూడదంటే, పెళ్ళిలో ఏమేమి చేయాలో నిర్ణయించుకోకముందే ఆ జంట సేవా కమిటీతో వాటి గురించి మాట్లాడాలి. పెళ్ళి చేసుకుంటున్న ఆ జంటపై పెద్దలు తమ స్వంత అభిప్రాయాల్ని రుద్దరు గానీ, వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లలో ఏదైనా అభ్యంతరకరంగా ఉంటే మార్పులు చేయాలి. కింగ్డమ్ మెలొడీస్ నుండి తీసుకున్న సంగీతం గానీ మన పాటల పుస్తకంలోని సంగీతం గానీ ఉపయోగించవచ్చు. రాజ్యమందిరాన్ని అలంకరించాలన్నా, కుర్చీలు వేసే విధానంలో మార్పులు చేయాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి. ఫోటోలు, వీడియో తీసేటప్పుడు ఆ సందర్భానికున్న గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. సంఘానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లకు ఆటంకం కానంతవరకు రాజ్యమందిరంలో రిహార్సల్ చేసుకోవడానికి పెద్దలు అనుమతించవచ్చు. చట్టరీత్యా అవసరం కాబట్టి, వివాహ ప్రకటనను రాజ్యమందిరంలోని సమాచార బోర్డుపై పెట్టాలి. కానీ ఆహ్వాన పత్రికలను అక్కడ పెట్టకూడదు. అయితే రాజ్యమందిరంలో జరగబోయే పెళ్ళి గురించి సంఘానికి తెలియజేయడానికి పెద్దలు, సేవాకూటంలో చిన్న ప్రకటన చేయవచ్చు. రాజ్యమందిరంలో జరిగే వివాహ ప్రసంగానికి అందరూ హాజరవ్వవచ్చు; కానీ ఆ తర్వాత జరిగే ‘పెళ్ళి విందుకు’ ఆహ్వానితులు మాత్రమే వెళ్ళాలి. (యోహా. 2:2, NW) ఆ సమయంలో రాజ్యమందిరం వేరే ఏ కార్యక్రమానికీ ఉపయోగించడం వీలుకాదని ఆ రాజ్యమందిరంలో కూటాలు జరుపుకునే ఇతర సంఘాలకు కూడా ముందుగానే చెప్పాలి.
పెళ్ళి బృందంలో అందరూ బాప్తిస్మం తీసుకున్నవారే ఉండాలని నియమమేమీ లేనప్పటికీ, బైబిలు సూత్రాలకు పూర్తి విరుద్ధమైన జీవితాలను గడుపుతున్నవారినీ లేదా హాజరైనవారికి అభ్యంతరకరంగా ఉండే ప్రవర్తనగలవారినీ పెళ్ళి బృందంలో చేర్చడం సబబు కాదు. వీలైనంతవరకూ సంఘపెద్దే పెళ్ళి జరిపించాలి. పెద్దలు దేవుని వాక్యాన్ని బోధించడానికి అర్హులు, కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో పాటించవలసిన లేఖన సూత్రాలపై శ్రద్ధ నిలిపేలా బోధించడానికి వారే ఎంతో అర్హులు.—1 తిమో. 3:2, 3.
ఏదైనా ఒక పెళ్ళి, దాన్ని జరిపించే పెద్దకు కూడా మంచి పేరు గానీ, చెడ్డ పేరు గానీ తీసుకురావచ్చు కాబట్టి ఆయనకూ ఆ పెళ్ళి ఏర్పాట్ల గురించి ముందుగా చెప్పాలి. పెళ్ళి నిశ్చయమైన తరువాత కూడా వాళ్ళిద్దరూ పవిత్రతను కాపాడుకున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన వాళ్ళను కలిసి మాట్లాడతాడు, ఆ జంట కూడా దాపరికం లేకుండా నిజాయితీగా వాస్తవాన్ని చెప్పడం మంచిది. పెళ్ళి కొడుకుకు గానీ పెళ్ళి కూతురుకు గానీ ఇంతకుముందు పెళ్ళై ఉంటే, మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి వారు లేఖనాల ప్రకారం, అలాగే చట్టపరంగా స్వతంత్రులని రుజువు చూపించాలి. (మత్త. 19:9) దానికోసం, విడాకులు మంజూరైనట్లు తెలిపే పత్రాన్ని ఆ పెద్దకు చూపించాలి.
ఆ జంట దాపరికం లేకుండా పెద్దలతో అన్ని విషయాలూ మాట్లాడి, వాళ్ళతో పూర్తిగా సహకరిస్తే ఆ పెళ్ళిలో అందరూ సంతోషిస్తారు.—సామె. 15:22; హెబ్రీ. 13:17.