మానకుండా ప్రకటించండి
1 కొన్నిసార్లు మనం మన ప్రాంతంలో పదేపదే, సమగ్రంగా ప్రకటించినప్పటికీ ప్రతిస్పందన అంతగా లభించడంలేదని మనకు అనిపించవచ్చు. అయినా ప్రకటిస్తూనే ఉండడానికి మనకు బలమైన కారణాలున్నాయి.—మత్త. 28:19, 20.
2 ఒక సాక్ష్యంగా పనిచేస్తుంది: “యుగసమాప్తికి” సంబంధించిన సంయుక్త సూచనలో రాజ్య ప్రకటనా పని ఒక ముఖ్య భాగంగా ఉంటుందని, ‘సకల జనములకు సాక్ష్యంగా’ ఆ పని జరుగుతుందని యేసు ప్రవచించాడు. (మత్త. 24:3, 14) మనం రాజ్యసువార్త ప్రకటించడాన్ని ప్రజలు గమనించినప్పుడు, అది ఒక శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. మన సందేశాన్ని ప్రజలు వినకపోయినప్పటికీ, వారిలో కొంతమంది మనమా ప్రాంతం నుండి వచ్చేసిన తర్వాత కూడా మన పని గురించి గంటలకొద్దీ లేదా రోజుల తరబడి మాట్లాడుకోవచ్చు. మనం పరిచర్య చేయడానికి గల కారణాలేమిటో తెలుసుకుంటే పరిచర్యలో పట్టుదలతో కొనసాగగలుగుతాం. మనం సాక్ష్యమివ్వడంద్వారా, రాబోయే నాశనాన్ని గురించిన హెచ్చరికా సందేశాన్ని ప్రకటించడంద్వారా బైబిలు ప్రవచన నెరవేర్పులో భాగంవహించి, యెహోవాకు సంతోషాన్ని కలిగిస్తాం.—2 థెస్స. 1:6-9.
3 పట్టుదల అవసరం: ప్రజలు ఎన్నో కార్యకలాపాల్లో నిమగ్నమైవుంటారు, అవి వారి సమయాన్ని హరించివేస్తాయి కాబట్టి వారి ఆసక్తిని పెంపొందింపజేయడానికి మనకెంతో పట్టుదల అవసరం. సాక్షులు ఒక స్త్రీని సంవత్సరంపాటు ప్రతీవారం వెళ్ళి కలిసిన తర్వాతే ఆమె వారిని బైబిలు చర్చకోసం తన ఇంట్లోకి ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. ఆమె విన్నదాన్ని ఎంతో ఇష్టపడి బైబిలు అధ్యయనానికి అంగీకరించి, కూటాలకు రావడం మొదలుపెట్టింది. కొంతకాలానికి బాప్తిస్మం తీసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసింది.
4 ప్రపంచ పరిస్థితులు త్వరితగతిన మారుతూవున్నాయి, అలాగే ప్రజల వైఖరిలో కూడా మార్పులు వస్తున్నాయి. సేదదీర్పునిచ్చే మన నిరీక్షణా సందేశాన్ని ఒకప్పుడు వినడానికి ఇష్టపడని ప్రజలు ఇప్పుడు ఇష్టపడవచ్చు. రాజ్య సందేశానికి కనీసం ఒక్క వ్యక్తి అనుకూలంగా ప్రతిస్పందించినా మన పట్టుదలకు తగిన ప్రతిఫలం లభించినట్లే.
5 ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువమంది, ‘జరుగుతున్న హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపిస్తున్నారు.’ (యెహె. 9:4) మన ప్రకటనా పనికి లభిస్తున్న ప్రతిస్పందన, నీతిని ప్రేమించేవారు రాజ్య సందేశానికి అనుకూలంగా స్పందిస్తున్నారని చూపిస్తోంది. (యెష. 2:2, 3) కాబట్టి, ‘సువర్తమానమును’ ప్రేమపూర్వకంగా, పట్టుదలతో మానకుండా ప్రకటించడంలో కొనసాగుదాం.—యెష. 52:7; అపొ. 5:42.