మీ కుటుంబం తప్పించుకోవడానికి సిద్ధమవుతోందా?
1 నెరవేరిన బైబిలు ప్రవచనం, ఈ దుష్టలోకం అతిత్వరలోనే అంతం కానుందని స్పష్టంగా రుజువుచేస్తోంది. జలప్రళయానికి ముందటి కాలంలో ఉన్నలాంటి కష్టభరితమైన పరిస్థితుల్లోనే నేడు మనం జీవిస్తున్నాం. (మత్త. 24:37-39) నోవహు ‘దేవునితో కూడ నడిచాడు’ కాబట్టి ఆయన ఆ ప్రాచీనలోక నాశనం నుండి తప్పించబడ్డాడు. (ఆది. 6:9) నోవహు కుటుంబం కూడా తప్పించబడింది కాబట్టి ఆయన తన కుటుంబానికి యెహోవా మార్గాలను తప్పక బోధించివుంటాడని చెప్పవచ్చు. ఒక కుటుంబంగా మనం ఈ ప్రస్తుత దుష్టలోక అంతాన్ని తప్పించుకోవడానికి నోవహును అనుకరిస్తూ ఏ విధంగా సిద్ధపడవచ్చు?
2 నీతిని ప్రకటించాడు: నోవహు దాదాపు 40, 50 సంవత్సరాలపాటు పట్టుదలతో ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతు. 2:5) చుట్టుప్రక్కలవారు ఆయన చేసిన ప్రకటనా పనిని, భౌతిక శరీరాలను దాల్చిన తిరుగుబాటుదారులైన దేవదూతల ప్రభావంవల్లనో కాదో మనకు తెలియదుగానీ ఎగతాళి మాత్రం చేశారు. ప్రజలు తరచూ మన పరిచర్యపట్ల ఉదాసీన వైఖరిని చూపిస్తూ, మనం చేసే పనిని ఎగతాళి చేస్తూ, ఈ విధానాంతం దగ్గరపడిందని నిరూపిస్తున్నారు. (2 పేతు. 3:3, 4) అయితే, నోవహు కాలంలోని ప్రజల్లాకాక, అనేకమంది మన ప్రయత్నాలకు అనుకూలంగా స్పందిస్తూ యెహోవాను ఆరాధించడానికి ‘ప్రవాహంలా’ తరలివస్తున్నారు. (యెష. 2:2) మనం మన పనిని పట్టుదలతో చేస్తేనే ‘మనలను, మన బోధ వినేవారిని’ రక్షించుకుంటాము. (1 తిమో. 4:16) తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యవసరంగా చేయవలసిన ప్రకటనా పని గురించి మాటద్వారా, మాదిరిద్వారా బోధించడం నిజంగా ఎంత ప్రాముఖ్యమో కదా!—2 తిమో. 4:2.
3 ఆయన ‘అలాగే చేశాడు’: నోవహు, ఆయన కుటుంబ సభ్యులు యెహోవా ఇచ్చిన ఆదేశాలను జాగ్రత్తగా పాటించడంవల్ల తప్పించబడ్డారు. (ఆది. 6:22) బైబిలు, నమ్మకమైన దాసుడు ఇస్తున్న నిర్దేశాలకు ‘సులభముగా లోబడడం’ అంటే విధేయత చూపించడానికి సిద్ధంగా ఉండడం నేడు మనకు కూడా ఎంతో ప్రాముఖ్యం. (యాకో. 3:17) ఒక కుటుంబంలోని పిల్లలు, తమ తండ్రి యెహోవా సంస్థ ఇచ్చిన సలహాలను ఎలా పాటించాడో గుర్తుచేసుకుంటున్నారు. ఉదాహరణకు, ఆయన ప్రతీవారం కుటుంబ అధ్యయనం చేశాడు, ఇవ్వబడిన సూచనలకు అనుగుణంగా ఆయన ప్రతీ వారాంతంలో తన కుటుంబాన్ని పరిచర్యకు తీసుకువెళ్ళాడు. ప్రతీవారం ఆయన పిల్లల్లో ఒకరితో పరిచర్య చేసేందుకు కృషి చేశాడు. ‘అలా చేయడంలో’ ఆయన చూపించిన కృతనిశ్చయత ఆయన పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఆయన ఆరుగురు పిల్లలూ పెరిగి పెద్దవారై, యథార్థంగా యెహోవా సేవ చేస్తున్నారు.
4 ఈ విధానాంతం హఠాత్తుగా వస్తుంది. (లూకా 12:40) నోవహును అనుసరించడంద్వారా, రక్షించబడడానికి విశ్వాసాన్ని కలిగివుండడం ద్వారా మనం, మన కుటుంబం తప్పక సిద్ధంగా ఉంటాము!—హెబ్రీ. 11:7.