ప్రశ్నాభాగం
◼ ఏదైనా మతసంస్థ నడిపిస్తున్న ఆసుపత్రిలో యెహోవాసాక్షులు చికిత్స పొందడం సరైనదేనా?
వివిధ మతసంస్థలు రోగులకు వైద్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్యచికిత్సను అందించే ఆసుపత్రులను నడిపిస్తున్నాయి. సాధారణంగా అలాంటివి మహాబబులోను ఉద్దేశాలను నెరవేర్చడానికి స్థాపించబడలేదు. (ప్రక. 18:2, 4) మొదట్లో అవి ఏదో ఒక మతసంస్థకు డబ్బు సమకూర్చడం కోసం స్థాపించబడి ఉండవచ్చు. నేడు కొన్ని ఆసుపత్రులు పేరుకు మాత్రమే మతపరమైనవి. మరికొన్ని ఆసుపత్రుల్లో మతసంబంధ సభ్యులే కొంతమేరకు విధులను నిర్వర్తిస్తుండవచ్చు.
ఒక యెహోవాసాక్షి ఆసుపత్రికి వెళ్లాల్సివస్తే, మతసంస్థలు నడిపించేవాటికి వెళ్లాలా వద్దా అనే విషయంలో ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఒకరి మనస్సాక్షి వెళ్లడానికి అంగీకరించవచ్చు, మరొకరి మనస్సాక్షి అంగీకరించకపోవచ్చు. (1 తిమో. 1:5) ఒకరి నిర్ణయంపై ప్రభావం చూపించగల కొన్ని పరిస్థితులుంటాయి కాబట్టి, ఆ పరిస్థితులేమిటో పరిశీలించడం ప్రాముఖ్యం.
ఉదాహరణకు, మతపరమైన పేరుతోవున్న ఆసుపత్రి మాత్రమే దగ్గర్లో ఉండవచ్చు. వేరే ఆసుపత్రి ఉన్నప్పటికీ మతసంస్థ నడిపేదానిలో మెరుగైన వైద్యం లభిస్తుండవచ్చు. ఆ ఆసుపత్రిలో మాత్రమే కొన్ని చికిత్సలకు అవసరమైన సదుపాయాలు ఉండవచ్చు. లేదా మీకు వైద్యం చేసే డాక్టరుకి ఆ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స చేసే అనుమతి ఉండవచ్చు. కొన్నిసార్లు మతసంస్థ నడిపే ఆసుపత్రి రక్తం విషయంలో క్రైస్తవులుగా మీ అభిప్రాయాన్ని గౌరవించవచ్చు, కానీ కొన్ని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆసుపత్రులు గౌరవించకపోవచ్చు. కాబట్టి, ఏ ఆసుపత్రికి వెళ్ళాలనేది నిర్ణయించుకొనేముందు మీరు పరిశీలించాల్సిన విషయాల్లో క్రిందివి కొన్ని.
మతసంస్థ నడిపించే ఆసుపత్రికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే అక్కడ మీరు చెల్లించే డబ్బు కేవలం మీకు చేయబడే చికిత్సకే ఇస్తున్నారని అనుకోవచ్చు. మతసంస్థలు వైద్య సేవలను ఒక వ్యాపారంగా అందిస్తున్నారనీ, ఆ సేవలకు డబ్బు చెల్లించినంత మాత్రాన నేరుగా అబద్ధమతానికి చందాలు ఇచ్చినట్లు కాదనీ మీరనుకోవచ్చు. అలాంటప్పుడు, మీరు కొన్న మందులకు లేదా వైద్యానికే డబ్బుచెల్లించినట్లు అవుతుంది.
అయితే, క్రైస్తవులుగా మీరు అలాంటి పరిస్థితుల్లో అబద్ధారాధనకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనైనా అస్సలు భాగం వహించకూడదు. అక్కడ పనిచేసే సిబ్బందినీ, సందర్శించేవారినీ “ఫాదర్” లేదా “సిస్టర్” లాంటి మతసంబంధ బిరుదులతో పిలవకూడదు. (మత్త. 23:9) మీరు ఆ విషయాన్ని కేవలం వైద్య సేవలను పొందే ఒక వ్యాపార వ్యవహారంగానే చూడాలి.
ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నప్పుడు మీరు యెహోవాసాక్షులనీ, మిమ్మల్ని చూడడానికి స్థానిక సంఘపెద్దలు వస్తారనీ చెప్పవచ్చు. వారు రావడం వల్ల మీరక్కడ ఉన్నంతకాలం మీకు అవసరమయ్యే ఆధ్యాత్మిక మద్దతు లభిస్తుంది.—1 థెస్స. 5:14.
మతసంస్థలు వృద్ధుల కోసం నడిపిస్తున్న వృద్ధాశ్రమాల వంటి చోట్ల ఉంటున్న వృద్ధ సహోదర సహోదరీల ఆధ్యాత్మిక అవసరాల పట్ల విశ్వాసులైన కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు, సంఘంలోని ఇతరులు శ్రద్ధ చూపించాలి. అలా కృషి చేయడం వల్ల వృద్ధులు ప్రోత్సహించబడతారు. అంతేకాక ఆ స్థలాల్లో జరిగే మత కార్యకలాపాలు, ఉత్సవాలు లేదా అలాంటి ఏ ఇతర కార్యకలాపాల్లోనైనా పొరపాటున వారిని పాల్గొనేలా చేసే ప్రమాదముండదు.
ఈ విషయాలను మనసులో ఉంచుకొని పరిస్థితులను బట్టి ఏ ఆసుపత్రికి వెళ్ళాలో మీరే నిర్ణయించుకోవాలి.—గల. 6:5.