బైబిలు నుండి చదవడం, పత్రికలను ఇవ్వడం ఎప్పుడు సముచితం?
బైబిలు లక్షలాదిమంది జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది. అది దేవుని వాక్యం కాబట్టి మనం చెప్పేదానికన్నా బైబిలు చెప్పేదే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. (హెబ్రీ. 4:12) మనం తెలియజేసే సందేశం దేవుని వాక్యంలోనిదే గానీ మన సొంతగా చెప్పేది కాదని ప్రజలు గ్రహించాలని కోరుకుంటాం. కొంతమంది క్రైస్తవులను గౌరవించకపోయినా బైబిలును గౌరవిస్తారు. కాబట్టి వినడానికి సుముఖంగా ఉన్నవారికి మనం నేరుగా బైబిలు నుండి చదివి వినిపించాలి.
మనం సాక్ష్యమిస్తున్న క్షేత్రంలో బైబిలు సందేశాన్ని వ్యతిరేకించేవారు, ప్రకటనాపనికి అడ్డుపడుతున్నవారు ఉంటే అప్పుడేమిటి? బైబిలు సందేశాన్ని వినే ఆసక్తి గృహస్థునికి ఉందో లేదో తెలుసుకోకుండానే బైబిలు తెరచి మాట్లాడితే వారు మనం చెప్పేది వినకపోవచ్చు. (మత్త. 10:11) మన చేతిలో బైబిలు చూసిన మరుక్షణం ఆ వ్యక్తి మనలను అపార్థం చేసుకుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం అపొస్తలుడైన పౌలు మాదిరిని అనుసరించవచ్చు. ఏథెన్సులోని అరేయొపగు దగ్గర గ్రీసు దేశస్థులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందుగానే లేఖనాలతో సంభాషణ ప్రారంభించలేదు. బదులుగా వారికి తెలిసిన, వారు ఏకీభవిస్తున్న విషయాలతో సంభాషణ ఆరంభించి, సృష్టికర్త గురించి ఆయన ఉద్దేశాల గురించి వారు ఆలోచించే రీతిలో తర్కించాడు.—అపొ. 17:22-31.
అలాగే గృహస్థులకు ఆసక్తికరంగా ఉండే విషయాలతో సంభాషణను ప్రారంభించడానికి ప్రయత్నించండి. తర్వాత నేర్పుగా రాజ్యసందేశం వైపు వారి దృష్టి మళ్ళించండి. మీ సందేశం ఆధ్యాత్మికమైనదని సూచించే ‘దేవుడు,’ ‘సృష్టికర్త’ లేదా ఇతర పదాలను మొదటిసారిగా ఉపయోగించినప్పుడు గృహస్థుల ప్రతిస్పందన ఏమిటో గమనించండి. ఆధ్యాత్మిక విషయాలను చర్చించడానికి వారికి ఆసక్తి ఉన్నట్లనిపిస్తే, మీరు చర్చిస్తున్న అంశానికి సంబంధించిన బైబిలు వచనాన్ని చూపించవచ్చా అని అడగవచ్చు. “బైబిలు” అన్న మాట వినగానే ప్రతికూలంగా మాట్లాడే అవకాశం ఉందని మీకనిపిస్తే, “పరిశుద్ధ లేఖనాలు” అని గానీ “ఒక ప్రాచీన పుస్తకం” అని గానీ మీరు చెప్పవచ్చు. లేదా ఒక లేఖనాన్ని మీ సొంత మాటల్లో చెప్పవచ్చు. యుక్తిగా మాట్లాడడంలో గృహస్థులకు ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో దయాపూర్వకంగా గ్రహించడం కూడా ఇమిడివుంది. (యోహా. 16:12) మరోవైపు ఆ వ్యక్తికి బైబిలు అంటే గౌరవం ఉండి, వినడానికి సుముఖంగా ఉంటే, బైబిల్లోనుండి చదవడానికి వెనకాడకూడదు.—యోహా. 10:27.
ప్రచురణలను చూపించి, వాటిని ఇచ్చే విషయమేమిటి? మన బైబిలు ఆధారిత ప్రచురణలు ఆసక్తిని రేకెత్తించడానికీ రాజ్యాన్ని గురించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికీ ఎంతో కాలంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నాయి. వీటిని ఇచ్చేటప్పుడు కూడా మనం వివేచనను ఉపయోగించాలి, ఎందుకంటే ప్రచురణలు అందిస్తూ మతమార్పిడి చేస్తున్నామని కొంతమంది అనవచ్చు. మన ప్రచురణల విలువ తెలిసి, వాటినుండి ప్రయోజనం పొందాలనుకునేవాళ్ళకే మనం వాటిని ఇవ్వాలనుకుంటాం. కాబట్టి మనం పరిచర్యలో బైబిలును, ప్రచురణలను చక్కగా ఉపయోగించాలంటే గృహస్థుని మనోవైఖరిని గ్రహించడం అవసరం.—సామె. 1:5, 7బి.