ప్రకటనాపనిలో అంతకంతకూ నైపుణ్యవంతులవండి
1 మన పరలోక తండ్రి తన సేవకులు సత్యంలో అభివృద్ధి చెందడాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. అలా అభివృద్ధి చెందాలంటే పరిణతిగల, సమర్థవంతమైన సువార్తికులుగా తయారవడం అవసరం. తన అభివృద్ధి అందరికి కనబడేలా చదవడంలో, బోధించడంలో సాధకం చేయాలని పౌలు పైవిచారణకర్తయైన తిమోతిని ప్రోత్సహించాడు. (1 తిమో. 4:13-15) అనుభవంగల ప్రచారకులతో సహా మనమందరం పరిచర్యలో మరింత నైపుణ్యవంతులయ్యేందుకు కృషిచేయాలి.
2 లక్ష్యాలు పెట్టుకోండి: నైపుణ్యవంతులవ్వాలంటే లక్ష్యాలు పెట్టుకోవాలి. మనం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు? సూచనార్థక ఖడ్గమైన బైబిలును ఉపయోగించడంలో మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రయత్నించవచ్చు. (ఎఫె. 6:17) పరిచర్యకు సంబంధించిన పద్ధతులను అంటే వీధి సాక్ష్యమివ్వడం, టెలిఫోన్ సాక్ష్యమివ్వడం, బిజినెస్ క్షేత్రంలో పనిచేయడం వంటివాటిని మనం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మరింత చక్కగా పునర్దర్శనాలు చేయడానికి కృషిచేయవచ్చు. బైబిలు అధ్యయనాలను ప్రారంభించి వాటిని కొనసాగించడంలో మన సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా ఒక చక్కని లక్ష్యం.
3 ఏర్పాట్లు: సంఘకూటాలు, ప్రాముఖ్యంగా దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల, సేవాకూటం వంటివి మనలను నైపుణ్యవంతులైన ప్రచారకులుగా తీర్చిదిద్దడానికి రూపొందించబడ్డాయి. కూటాలకు సిద్ధపడడానికి, హాజరవడానికి, అక్కడివ్వబడిన సలహాలను పాటించడానికి మనమెంతగా కృషి చేస్తే అన్ని ప్రయోజనాలను పొందుతాం.—2 కొరిం. 9:6.
4 నైపుణ్యం సాధించడానికి మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. (సామె. 27:17) పరిచర్య చేస్తున్నప్పుడు మనతోపాటున్న వ్యక్తి మాట్లాడుతుండగా జాగ్రత్తగా వినడం ద్వారా మనం నైపుణ్యం సాధించవచ్చు. అంతేకాక మన పుస్తక అధ్యయన పైవిచారణకర్త, మనం సహాయం పొందడానికి ఏర్పాట్లు చేయవచ్చు. మనం చక్కని ప్రచారకులుగా తయారై, పరిచర్యలో మరింత ఆనందాన్ని పొందడానికి అనుభవజ్ఞులైన పయినీర్ల, ఇతర ప్రచారకుల సహాయం ఎంత ఆశీర్వాదకరమో కదా! మన పుస్తక అధ్యయన గుంపులో ఎవరైనా కొత్త ప్రచారకులున్నారా? మనతో క్షేత్రసేవకు రమ్మని వారిని మనమే ఎందుకు అడగకూడదు?
5 క్రైస్తవ పరిచర్య నేడు జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని. యెహోవాకు “స్తుతియాగము” చేస్తూనే, సాధ్యమైనంత సమర్థవంతంగా పరిచర్యను నెరవేర్చేందుకు కృషిచేద్దాం. (హెబ్రీ. 13:15) పరిచర్యలో నైపుణ్యం సాధించడానికి మనం కృషిచేస్తే “సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను” తయారౌతాము.—2 తిమో. 2:15.