విమోచన క్రయధనాన్ని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవడం
1 ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయులై, మార్చి 22, 2008, శనివారం రోజు సూర్యాస్తమయం తర్వాత యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ కోసం సమకూడతారు. (లూకా 22:19; 1 కొరిం. 11:23-26) 1,975 సంవత్సరాల క్రితం అదే రోజున (నీసాను 14న) సాధించబడినవాటన్నిపట్ల మనకు కృతజ్ఞత ఉండడంవల్లే మనం అలా సమకూడతాం. యేసు హింసాకొయ్యపై వేదనను అనుభవిస్తూ మరణిస్తున్నప్పుడు కూడా సంపూర్ణ యథార్థతను చూపించడం ద్వారా తన తండ్రి నామాన్ని ఘనపరచి, సాతాను నిందలకు తిరుగులేని జవాబునిచ్చాడు.—యోబు 1:11; సామె. 27:11.
2 యేసు చిందించిన రక్తం కొత్త నిబంధనను స్థిరపరచింది. ఆ కొత్త నిబంధన, అపరిపూర్ణులైన మానవులు దేవుని కుమారులుగా దత్తత తీసుకోబడడాన్ని సాధ్యంచేసింది, అందువల్ల వారికి పరలోక రాజ్యంలో పరిపాలించే ఉత్తరాపేక్ష లభించింది. (యిర్మీ. 31:31-34; మార్కు 14:24) అంతేకాక, యేసే స్వయంగా నీకొదేముకు వివరించినట్లు, దేవుడు తానెంతగానో ప్రేమించిన కుమారుణ్ణి బలిగా ఇచ్చినప్పుడు మానవులపట్ల ఆయనకు ఎంత ప్రేమవుందో స్పష్టంగా వ్యక్తమయ్యింది.—యోహా. 3:16.
3 ఇతరులను ఆహ్వానించండి: ఈ మన రాజ్య పరిచర్యలోని మధ్యపేజీల్లో, పరిచయస్థుల పేర్లన్నీ రాసిపెట్టుకుని, పేరు పేరున ప్రతీఒక్కరిని ఆహ్వానించమనే సూచన ఇవ్వబడింది. మరి మీరు రాసుకున్నారా? వారందరినీ ఆహ్వానించడం ప్రారంభించారా? జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజలను ఆహ్వానించడానికి మార్చి 1 నుండి ఆరంభమయ్యే ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? దానికి హాజరయ్యేవారు అక్కడ లేఖనాధారిత సమాచారాన్ని వింటారు, అది వారిలో విమోచన క్రయధనం మీద విశ్వాసాన్ని పెంచుతుంది. చివరకు ఆ విశ్వాసమే వారిని నిత్యజీవానికి నడిపిస్తుంది.—రోమా. 10:17.
4 ప్రత్యేక ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించడానికి ముందు రాగలిగేవారు వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలి. సాధారణంగా జ్ఞాపకార్థ ఆచరణకు ఎక్కువమంది హాజరౌతారు కాబట్టి కొత్తవారిపట్ల, అప్పుడప్పుడు కూటాలకు హాజరయ్యేవారిపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
5 హృదయాలను సిద్ధంచేసుకోండి: మార్చి 17వ తారీఖు నుండి ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2008, మరియు 2008—క్యాలెండర్లో (ఆంగ్లం) జ్ఞాపకార్థ ఆచరణ కోసం ప్రత్యేక బైబిలు పఠన పట్టిక ఇవ్వబడుతుంది. యేసు భూజీవితపు చివరి రోజుల్లో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలను గురించి ధ్యానించడం, జ్ఞాపకార్థ ఆచరణకు మీ హృదయాలను సిద్ధంచేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈ బైబిలు వృత్తాంతాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే, విమోచన క్రయధనం చెల్లించడంలో యెహోవా, ఆయన కుమారుడు చూపిన ప్రేమపట్ల మీ కృతజ్ఞత ఇంకా ఎక్కువవుతుంది.—కీర్త. 143:5.
6 జ్ఞాపకార్థ ఆచరణ సమీపిస్తుండగా ప్రాముఖ్యమైన ఈ సందర్భానికి మనం జాగ్రత్తగా సిద్ధపడడంతోపాటు, ఇతరులూ అలా సిద్ధపడేలా సహాయంచేద్దాం. మనం కృతజ్ఞతాభావంతో విమోచన క్రయధనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాతో, ఆయన కుమారునితో మనకున్న సంబంధం బలపడుతుంది. (2 కొరిం. 5:14, 15) ఇతరులపట్ల స్వయంత్యాగపూరితమైన ప్రేమను చూపించే విషయంలో వారిద్దరిని అనుకరించేలా ఆ కృతజ్ఞత మనల్ని ప్రేరేపిస్తుంది.—1 యోహా. 4:11.
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. మనం విమోచన క్రయధనాన్ని కృతజ్ఞతతో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?
3. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేవారు ఎలా ప్రయోజనం పొందుతారు?
4. జ్ఞాపకార్థ ఆచరణకు మనం ముందే ఎందుకు రావాలి?
5. ఈ సందర్భం కోసం మీరు మీ హృదయాలను ఎలా సిద్ధంచేసుకోవచ్చు?
6. విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మనకెలాంటి ప్రయోజనాలు చేకూరతాయి?