సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చే పత్రికను ఉపయోగించండి
1. కావలికోట పత్రిక ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
1 కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే పత్రిక రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసే పనిలో ఇంకా కీలకపాత్ర పోషిస్తూనే ఉంది. (మత్త. 24:14; 28:19, 20) వివిధ రీతుల్లో ప్రకటనా పని చేస్తున్నప్పుడు మన కాలానికి తగిన ఈ పత్రికను క్రమంగా అందించడానికి మనం సంతోషిస్తాం.
2. కావలికోట పత్రికలో ఎలాంటి మార్పులు చేయబడ్డాయి, ఏ ఉద్దేశంతో చేయబడ్డాయి?
2 గత సంవత్సరాల్లో ఆ పత్రిక సైజులో, అందులోని సమాచారంలోనేకాక దానిని అందించే పద్ధతుల్లో వచ్చిన మార్పులను మనం చూస్తూనే ఉన్నాం. ఈ పత్రిక మరింత ఆకర్షణీయంగా, ప్రయోజనకరంగా ఉండాలనే ఈ మార్పులు చేయబడ్డాయి. ‘మనుష్యులందరు రక్షణపొందేలా, సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము గలవారయ్యేలా’ ఈ రాజ్య సందేశం వారి హృదయాలను చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేయబడ్డాయి.—1 తిమో. 2:4.
3. మనం పరిచర్యలో పత్రికను ఎలా అందించాలి?
3 త్రైమాసిక పత్రికయైన తేజరిల్లు! పత్రికను వివిధరకాల ఉపోద్ఘాతాలను ఉపయోగించి అందించడంలో మనం అనుభవం సాధించాం. మనమిప్పుడు పరిచర్యలో కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది యొక్క త్రైమాసిక ప్రతిని అందించే విషయంలో అలాగే చేద్దాం. మన రాజ్య పరిచర్యలోని చివరి పేజీలో ప్రతీ సంచిక గురించిన నమూనా అందింపు ఇవ్వబడుతుంది. సాధారణంగా పత్రికలోని మొదటి ఆర్టికల్‌ల కోసం నమూనా అందింపు ఇవ్వబడుతుంది, అయితే కొన్నిసార్లు అనేకులు ఇష్టపడే ఇతర ఆర్టికల్‌లకు కూడా ఇవ్వబడతాయి. సంబంధిత ఆర్టికల్‌లను చక్కగా చదివినప్పుడే మనం ప్రచురించబడిన అందింపును సమర్థవంతంగా ఉపయోగించి, మన క్షేత్రానికి అనుగుణంగా వాటిని మన సొంత మాటల్లో చెప్పగలుగుతాం.
4. మన రాజ్య పరిచర్యలోని నమూనా అందింపేకాక వేరే అందింపులను ఉపయోగించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉండవచ్చు?
4 మన రాజ్య పరిచర్యలోని ప్రతీ సంచిక కోసం ఇవ్వబడిన అందింపులే కాక, వాటికి పూర్తి భిన్నంగా ఉండే వేరే అందింపులను కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే, సంచికలోని మరో ఆర్టికల్ మీ ప్రాంతంలో చాలామందికి ఆసక్తికరంగా అనిపించవచ్చు. లేదా మీకు బాగా నచ్చిన ఒక ఆర్టికల్‌ను మరింత సమర్థవంతంగా అందించగలరని మీకు అనిపించవచ్చు.
5. మీరు ఇవ్వాలనుకునే పత్రిక కోసం ఒక అందింపు సిద్ధం చేసుకునే ముందు ఏమిచేయాలి?
5 అందింపు కోసం సిద్ధపడడం: ముందుగా మీరు మాట్లాడాలనుకుంటున్న ఆర్టికల్‌ను బాగా చదవండి. అయితే పత్రికను పరిచర్యలో ఉపయోగించే ముందు దానిలోని ప్రతీ ఆర్టికల్‌ను చదవడం మీకు కుదరకపోవచ్చు. మీకు నచ్చిన ఆర్టికల్ గురించి మీకు నిజంగా తెలిసిన విషయాన్నే మాట్లాడండి, సంభాషిస్తున్నప్పుడు ఉత్సాహం కనబరచండి. మీరందించబోయే సమాచారాన్ని బాగా తెలుసుకున్నప్పుడే మీరలా చేయగలుగుతారు.
6. పరిచర్యలో ఏమి మాట్లాడాలో మనమే స్వయంగా ఎలా సిద్ధపడవచ్చు?
6 రెండవదిగా, మీరు పత్రిక గురించి ఏమి చెప్పాలో సిద్ధపడుతున్నప్పుడు, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడేలా సిద్ధపడండి. సంభాషణను ప్రారంభించడానికి ఆర్టికల్తో నేరుగా సంబంధమున్న ఆసక్తి రేకెత్తించే ఒక ప్రశ్నను అడగవచ్చు. దేవుని వాక్యానికి హృదయాలను చేరుకునే శక్తివుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. (హెబ్రీ. 4:12) మీరు పరిచయంచేసే విషయానికి తగిన లేఖనాన్ని ఎన్నుకోండి. ఆర్టికల్‌లో పేర్కొనబడిన లేదా ఉల్లేఖించబడిన లేఖనాన్ని ఎన్నుకోవడం మంచిది. ఆ లేఖనాన్ని ఆర్టికల్తో ఎలా ముడిపెట్టాలో ఆలోచించండి.
7. మన అందింపులను ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చు?
7 ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి: ఒక అందింపు నిజంగా సమర్థవంతంగా ఉండాలంటే దాన్ని ఉపయోగించాలి. శనివారాల్లో సంఘంతో కలిసి సాక్ష్యమిచ్చే పనిలో పాల్గొనండి. గతంలో ఇతర సాహిత్యాన్ని తీసుకున్నవారికి కూడా పత్రికను ఇవ్వండి. మీ బైబిలు విద్యార్థులకు ఎప్పటికప్పుడు పత్రికను ఇస్తూవుండండి, పునర్దర్శనం చేయడానికి వెళ్లినప్పుడు కలిసే ఇతరులకు కూడా పత్రికను ఇవ్వండి. బజారుకు వెళ్లినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా డాక్టరు దగ్గర మీ వంతు కోసం వేచివున్నప్పుడు మీరు కలిసే ప్రజలతో మాట్లాడి వారికి పత్రికను ఇవ్వవచ్చు. నెలంతా మీ అందింపులను ఉపయోగిస్తూ వాటిని మెరుగుపర్చుకుంటూ ఉండండి.
8. కావలికోట పత్రిక ఏ యే విధాలుగా విశేషమైనది?
8 కావలికోట పత్రిక విశేషమైనది. అది యెహోవాను విశ్వసర్వాధిపతిగా ఘనపరుస్తోంది. (అపొ. 4:24) ఆ పత్రిక దేవుని రాజ్య సువార్తతో ప్రజలకు ఊరటనిస్తూ, యేసుక్రీస్తుపట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోమని ప్రోత్సహిస్తోంది. (మత్త. 24:14; అపొ. 10:43) అంతేకాక, లోక సంఘటనలు బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తున్నాయి కాబట్టి ఈ పత్రిక లోకపరిస్థితుల గురించి మనల్ని అప్రమత్తం చేస్తుంది. (మత్త. 25:13) అవకాశం దొరికినప్పుడల్లా ఈ పత్రికను అందించేలా సిద్ధపడడంద్వారా మీ క్షేత్రంలోని ప్రజలు దాని నుండి ప్రయోజనం పొందేందుకు సహాయం చేయండి.
9. మనం పునర్దర్శనం కోసం ఎలా పునాదివేయవచ్చు?
9 మీరు ఒకరికి పత్రికను ఇచ్చినప్పుడు లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడినప్పుడు, వారిని పునర్దర్శించి మరింత చర్చించేందుకు వీలుగా ఒక ప్రశ్న అడగడానికో లేదా ఆలోచన రేకెత్తించే ఒక విషయాన్ని చెప్పడానికో సిద్ధంగా ఉండండి. మనం సత్యపు విత్తనాల్ని ఉత్సాహంగా నాటితే, తన గురించి తెలుసుకోవాలని, తనను సేవించాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారి హృదయాలను యెహోవా తెరుస్తాడనే నమ్మకంతో మనముండవచ్చు.—1 కొరిం. 3:6.