యేసు ఉంచిన మాదిరిని అనుకరించండి
1. యేసు ఏ మాదిరినుంచాడు?
1 శిష్యులను చేసే పనిలో మనం భాగం వహిస్తున్నప్పుడు, మనల్ని గమనించేవారిపై మన మాదిరి గొప్ప ప్రభావాన్ని చూపించగలదని మనం గుర్తుంచుకోవాలి. యేసు, మాటల ద్వారా క్రియల ద్వారా బోధించాడు. ఆయనను గమనించినవారు ఆయన కనబర్చిన ఉత్సాహం, ప్రజలపట్ల ఆయనకున్న ప్రేమను, తన తండ్రి నామాన్ని పవిత్రపర్చడంపైనే ఆయన దృష్టినిలపడాన్ని, తండ్రి చిత్తాన్ని పూర్తిచేయాలన్న ఆయన దృఢసంకల్పాన్ని చూడగలిగారు.—1 పేతు. 2:21.
2. పరిచర్యలో మనతోపాటు పనిచేస్తున్నవారిపై మన మాదిరి ఏయే విధాలుగా ప్రభావం చూపుతుంది?
2 ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు: యేసు మాదిరి ఇతరులపై ప్రభావం చూపించినట్లే, మనతోపాటు పనిచేసే వారిపై కూడా మన మాదిరి ప్రభావం చూపుతుంది. కొత్తవారు, అంతగా అనుభవంలేని ప్రచారకులు మనం పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూసి, తాము ప్రకటనా పనిని ఎలా చేస్తున్నామనేది ఆలోచిస్తారు. మన ఆనందాన్ని, ఇతరులపట్ల మనం చూపించే నిజమైన శ్రద్ధను గమనించినప్పుడు వారు కూడా తమ పరిచర్యలో అలాంటి లక్షణాలు ప్రదర్శించడం ప్రాముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకుంటారు. లేఖనాలను ఉపయోగించడంలో, పునర్దర్శనాలు చేసి, బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో మనం చూపించే శ్రద్ధను వారు గమనించినప్పుడు వారు కూడా అలా చేయడానికి పురికొల్పబడతారు.
3. బైబిలు విద్యార్థులకు మన మాదిరి ఎలా బోధిస్తుంది, వారేమి నేర్చుకోవచ్చు?
3 బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నప్పుడు: మన బైబిలు విద్యార్థులు మన ప్రవర్తనను ప్రత్యేకంగా గమనిస్తారు. ఉదాహరణకు, అధ్యయనానికి సిద్ధపడాల్సిన ప్రాముఖ్యత, లేఖనాలను చూడడం, కీలకాంశాలను అండర్లైన్ చేసుకోవడం వంటివాటి గురించి మనం వారికి వివరించినా, మనమలా సిద్ధపడుతున్నామా లేదా అనేది వారు గమనిస్తారు. (రోమా. 2:21) వారికి చెప్పిన సమయానికి మనం ఖచ్చితంగా వెళ్తే వారు బైబిలు అధ్యయనానికి ఇతర పనులను అడ్డురానివ్వరు. పరిచర్యపట్ల మనం చూపించే స్వయంత్యాగపూరిత స్వభావాన్ని, మన దృఢవిశ్వాసాన్ని కూడా వారు నిస్సందేహంగా గమనిస్తారు. యేసు మాదిరిని సన్నిహితంగా అనుసరించేవారి విద్యార్థులు తరచూ ఉత్సాహవంతులైన, ఫలవంతమైన సువార్తికులుగా తయారవుతారనడంలో ఆశ్చర్యంలేదు.
4. మనం సంఘ కూటాలకు హాజరౌతున్నప్పుడు, మన మాదిరి ద్వారా ఏమి బోధిస్తాం?
4 సంఘ కూటాలకు హాజరౌతున్నప్పుడు: క్రైస్తవ సంఘంలో ఉన్నవారందరు సంఘ కూటాల్లో చూపించే మాదిరి ద్వారా బోధించడంలో భాగం వహిస్తారు. కూటాలకు హాజరవడం ప్రారంభించిన ఆసక్తిగలవారు సంఘంలో తాము గమనించే మంచి మాదిరి నుండి ప్రయోజనం పొందుతారు. స్నేహపూర్వక సహోదరత్వాన్ని, క్రైస్తవ ఐక్యతను, నిరాడంబరమైన వస్త్రధారణను, కనబడే తీరును వారు గమనిస్తారు. (కీర్త. 133:1) సంఘ కూటాలకు మానకుండా హాజరవడంలో మనముంచే మాదిరిని, కూటాల్లో మన విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తపర్చడాన్ని కూడా వారు గమనిస్తారు. మన కూటాల్లో ఒకదానికి హాజరైన ఓ సందర్శకుడు, చిన్న పాప ఉదాహరించబడిన వచనాన్ని తన బైబిల్లో ఎంత త్వరగా తీయగలిగిందో, చదవబడుతున్న దాన్ని ఎంత శ్రద్ధగా అనుసరించిందో గమనించాడు. ఆ పాప మాదిరి బైబిలు అధ్యయనం కోసం అడిగేందుకు ఆయనను పురికొల్పింది.
5. మన మాదిరికున్న ప్రాముఖ్యతను మనమెందుకు తక్కువ అంచనా వేసుకోకూడదు?
5 ఇతరుల మంచి మాదిరిని అనుసరించమని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. (ఫిలి. 3:17; హెబ్రీ. 13:7) కాబట్టి, యేసు మాదిరిని మనం సన్నిహితంగా అనుసరిస్తే, ఇతరులు దాన్ని గమనించడమే కాక అది వారిపై సానుకూల ప్రభావం కూడా చూపించగలదని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గుర్తిస్తూ మనం 1 తిమోతి 4:16లోని మాటలను మనసులో ఉంచుకుందాం: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము.”