కూటాలు యౌవనులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి
1 “యౌవనులు తమ జీవితంలో చాలా కష్టతరమైన కాలాలను అనుభవిస్తారని నేను అనుకుంటుంటాను. వ్యభిచారం చేసే, మత్తుపదార్థాలు సేవించే, త్రాగే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాము” అని ఒక టీనేజ్ అమ్మాయి అంటుంది. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? అలాగైతే ఈ చెడు ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఏమి సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీకు విశ్వాసం అవసరం, యెహోవా మార్గాల నిజత్వపు రుజువుల పట్ల దృఢ నమ్మకం అవసరం ఎందుకంటే “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీ. 11:6) మీరు సంఘకూటాలకు హాజరవడం, మీ క్రైస్తవ విశ్వాసాన్ని, చెడును చేయకూడదనే మీ నిశ్చయాన్ని బలపర్చుకునేందుకు సహాయం చేస్తాయి.
2 కూటాలు మీకు ఎంతో ప్రయోజనం చేకూర్చగలవు: మీ సన్నిహిత స్నేహితులతో కమ్మని భోజనాన్ని ఆరగిస్తూ ఆనందించేలా చేసేదేమిటి? ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన సహచరుల మధ్యన మంచి బలవర్థకమైన ఆహారాన్ని ఆస్వాదించడమే కాదా? మన కూటాలు కూడా అదే ఆహ్లాదకరమైన అనుభూతిని ఆధ్యాత్మిక భావంలో ఇవ్వగలవు.
3 కూటాల్లో చర్చించబడే విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుదిన జీవిత సమస్యలతో వ్యవహరించే విషయాల నుండి అద్భుతమైన బైబిలు ప్రవచనాల అధ్యయనం వరకూ ఆ కూటాల్లో చర్చించబడతాయి. శ్రేష్ఠమైన జీవితాన్ని ఎలా అనుభవించాలో, మీకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో బోధించే ఆచరణాత్మక ఉపదేశం అక్కడ ఇవ్వబడుతుంది. కూటాల్లో మనకు లభించే సహవాసులు ఎల్లవేళలా చాలా మంచి సహవాసులు, అక్కడుండే ఆధ్యాత్మిక వాతావరణం ఆహ్లాదకరంగా, సురక్షితంగా ఉంటుంది. (కీర్తన 133:1) “నేను రోజంతా స్కూల్లో గడిపి ఎంతో అలసిపోతాను. ఎడారిలోని నీటి చెలమవలే మరునాడు స్కూలుకు వెళ్లగలిగేలా కూటాలు నాకు ఎంతో సేదదీర్పునిస్తాయి” అని ఒక యౌవస్థురాలు చెప్పడంలో ఆశ్చర్యంలేదు. “యెహోవాను ప్రేమించే వారితో చేసే సన్నిహిత సహవాసం యెహోవాకు దగ్గరగా ఉండేలా నాకు సహాయపడుతుందని నేను కనుగొన్నాను” అని మరొక యౌవనస్థురాలు చెప్పింది.
4 దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో మీరు సభ్యులై ఉండడం ద్వారా, బైబిలు సమాచారాన్ని సేకరించి దాన్ని ఒక ప్రసంగంలా తయారుచేసి, రాజ్యమందిరంలోని ప్రేక్షకుల ముందు దాన్ని సంభాషణా రూపంలో ఎలా ఇవ్వాలో మీరు తెలుసుకుంటారు. దేవుని వాక్యంలోని, జీవాన్ని రక్షించే సత్యాలను నైపుణ్యవంతంగా బోధించేలా తర్ఫీదు పొందడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఊహించండి ! అంతటి విలువైన శిక్షణను యౌవనులు ఎక్కడ నుండి పొందగలరు?
5 కూటాల నుండి ఎలా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు: కూటాల నుండి ప్రయోజనం పొందడానికి మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి సిద్ధపడడం, పాల్గొనడం, ఆచరణలో పెట్టడం.
6 కూటాలకు సిద్ధపడండి: కూటాలకు క్రమంగా సిద్ధపడేందుకు సమయాన్ని ప్రణాళిక వేసుకోండి. ప్రతి కూటంలోనూ చర్చించబోయే విషయాన్ని ముందుగానే సిద్ధపడేందుకు మీరు కేటాయించుకున్న సమయాన్ని స్కూల్వర్క్, ఉద్యోగం, వినోదం వంటి వాటి కోసం వెచ్చించకండి. అలా చేయడం, మీరు ఎప్పుడూ అలాగే కూటాలకు సిద్ధపడడానికి సహాయం చేస్తుంది. మొదటిగా, దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రణాళిక వేయబడిన వారంలో చదవవలసిన బైబిలు భాగాన్ని క్రమంగా చదవండి. అక్కడ ఇవ్వబడిన అధ్యాయాలను చదివి ధ్యానించేందుకు రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. సంఘ పుస్తక పఠనానికి కావలికోట పఠనానికి సిద్ధపడేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. కొంతమంది ఆ కూటాలకు కనీసం ఒకటి లేదా రెండు రోజుల ముందు సిద్ధపడతారు. సాధ్యమైనంత మేరకు, ప్రతి వారం సేవా కూటంలోని భాగాలకు కూడా అదేవిధంగా సిద్ధపడండి.
7 వాటిలో పాల్గొనండి: యేసు 12 ఏండ్ల వయస్సువాడైనప్పుడు, వింటూ, ప్రశ్నలడుగుతూ, సమాధానాలు చెప్తూ దేవాలయంలో ఉన్నాడని బైబిలు చెప్తుంది. (లూకా 2:46, 47) మరొక మాటలో చెప్పాలంటే ఆయన అందులో నిమగ్నమైపోయాడు. అలాగే మీరు కూడా కూటాల్లో పాల్గొనడానికి కృషి చేస్తే మీరు వాటి నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు.—సామెతలు 15:23
8 కూటాల్లో ఏమి బోధించబడుతుందో దానిపై శ్రద్ధ నిలపడం అవసరం. కొన్నిసార్లు ప్రసంగం ఇవ్వడం కన్నా వినడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? మరొకరు మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఆ విధంగా పరిపరివిధాల పోకుండా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? నోట్స్ వ్రాసుకోవడం ద్వారా. మరోసారి చూసుకోవడానికి వీలుగా ప్రాముఖ్యమైన విషయాల్ని క్లుప్తంగా వ్రాసుకోండి. నోట్స్ వ్రాసుకోవడం, కార్యక్రమంపై మనస్సు నిలిపేలా మీకు సహాయపడుతుంది. ప్రసంగీకుడు చదివే లేఖనాలను, ఆయనతో పాటు బైబిలు తెరిచి చూడడం కూడా సహాయకరంగా ఉంటుంది.
9 అంతేగాక, కూటాల్లో ప్రశ్నా జవాబుల చర్చ జరిగేటప్పుడు కూడా మీరు దానిలో పాల్గొనాలనే లక్ష్యం పెట్టుకోండి. సామెతలు 15:28, “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును” అని చెప్తుంది గనుక, మీరు చెప్పాలనుకుంటున్న దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు దాని నుండి మరింత ప్రయోజనాన్ని పొందుతారు.
10 మీరు ఏమి నేర్చుకుంటున్నారో దాన్ని ఆచరణలో పెట్టండి: చివరి మెట్టు ఏమిటంటే మీరు నేర్చుకున్నది మీలో “కార్యసిద్ధి” కలుగజేసేలా చూసుకోవడం. (1 థెస్స. 2:13) మీరు ప్రతి కూటంలోనూ నేర్చుకునే చక్కని విషయాలను అన్వయించుకుంటుండగా, మీరు యెహోవా దేవునికి మరింత దగ్గరవుతారు. మీరు సత్యమును మీ సొంతం చేసుకుని, ‘దానిని అనుసరించి నడుచుకొంటుండగా’ ఆయన మీకు వాస్తవమైన వ్యక్తి అవుతాడు, మీరు గొప్ప ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు.—3 యోహాను 4.
11 యౌవన సహోదర సహోదరీల్లారా, మీరు కూటాలకు క్రమంగా సిద్ధపడి, వాటిలో పాల్గొంటూ మీరు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెడితే మీరు కూటాలను పూర్తిగా ఆనందించగల్గుతారు. అదే సమయంలో వాటి నుండి మీరు పూర్తి ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అప్పుడు మీ విశ్వాసము బలపడుతుంది, అలాగే మీ పరలోక తండ్రియైన యెహోవా పట్ల సత్యవంతులుగా ఉండాలన్న మీ తీర్మానం కూడా బలపడుతుంది.—కీర్తన 145:18.