నిష్క్రియులుగా ఉన్నవారిని మరచిపోవద్దు
1. నిష్క్రియులుగా మారిన వారిని ప్రోత్సహించడానికి మనం ఎందుకు ప్రయత్నించాలి?
1 నిష్క్రియులుగా మారినవారెవరైనా మీకు తెలుసా? బహుశా అతను సంఘంతో సహవసించడం మానేసి, సత్యానికి దూరమైవుంటాడు. ఇంటింటి పరిచర్యలో ఉండగా మీకు అలాంటి వ్యక్తి తారసపడివుండవచ్చు. ఆ వ్యక్తి ఇంకా మన ఆధ్యాత్మిక సహోదరుడే అని మనం మనసులో ఉంచుకోవాలి. ఆయనపట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడమేకాక, ఆయన సంఘంవైపుకు, ‘మన ఆత్మల కాపరి, అధ్యక్షుడునైన ఆయనవైపుకు’ తిరిగి వచ్చేలా సహాయం చేయాలనుకుంటాం.—1 పేతు. 2:25.
2. నిష్క్రియులను మనమెలా ప్రోత్సహించవచ్చు?
2 శ్రద్ధ చూపించండి: నిష్క్రియులుగా మారిన వారిని మనం మర్చిపోలేదనే హామీనివ్వడానికి వారితో కాసేపు ఫోనులో మాట్లాడవచ్చు లేదా వారిని సందర్శించవచ్చు. మనం వారితో ఏమి మాట్లాడవచ్చు? మనం వారిని గుర్తుచేసుకుంటుంటామని తెలియజేయడం ద్వారా వారిని ప్రోత్సహించవచ్చు. వారితో ఆహ్లాదకరంగానూ, ప్రోత్సాహకరంగానూ సంభాషించండి. (ఫిలి. 4:8) ఇటీవల కూటంలో మనకు నచ్చిన అంశాన్ని ప్రస్తావించవచ్చు. వారిని తర్వాతి కూటానికో లేదా రాబోయే సమావేశానికో ఆహ్వానించి, వారి కోసం సీటు రిజర్వు చేస్తామని లేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పవచ్చు.
3. ఒక సహోదరి ఎలా తిరిగి క్రియాశీల వ్యక్తి అయ్యింది?
3 ఇరవైకన్నా ఎక్కువ సంవత్సరాలుగా నిష్క్రియురాలిగా ఉన్న సహోదరి ఒక ప్రచారకురాలికి క్షేత్రంలో తారసపడింది. ఆమె బైబిలు అధ్యయనానికి అంగీకరించకపోయినా ఆమెను కలిసిన సహోదరి ఆమెను క్రమంగా సందర్శిస్తూ, వెళ్ళిన ప్రతీసారి క్రొత్త పత్రికలను ఇచ్చేది. జిల్లా సమావేశం అయిపోయిన తర్వాత, దానిలోని కొన్ని ముఖ్యాంశాలను ఆ ప్రచారకురాలు నిష్క్రియురాలైన సహోదరితో చర్చించింది. చివరకు ఆమె క్రియాశీల వ్యక్తి అయ్యింది.
4. కూటాలకు హాజరవడం ద్వారా సంఘ సహవాసాన్ని పునఃప్రారంభించిన వ్యక్తితో మనమెలా వ్యవహరించాలి?
4 ఎవరైనా తిరిగివచ్చినప్పుడు: నిష్క్రియుడైన ఒక సహోదరుడు కూటాలకు రావడం ప్రారంభిస్తే ఆయనతో మనమెలా వ్యవహరించాలి? యేసు శిష్యులు ఆయనను తాత్కాలికంగా విడిచిపెట్టిన తర్వాత ఆయన వారితో ఎలా వ్యవహరించాడు? ఆయన వారిని ప్రేమపూర్వకంగా తన “సహోదరులు” అని సంబోధించి, వారిని నమ్మాడు. ఆయన వారికి ప్రాముఖ్యమైన నియామకాన్ని కూడా ఇచ్చాడు. (మత్త. 28:10, 18, 19) ఆ తర్వాత కొంతకాలానికి వారు, సువార్తను “మానక” ప్రకటించడంలో నిమగ్నమయ్యారు.—అపొ. 5:42.
5. నిష్క్రియులుగా ఉన్న వ్యక్తుల గురించి పెద్దలకు తెలియజేయవలసిన సందర్భాలను చెప్పండి.
5 నిష్క్రియులుగా మారిన వారికి బైబిలు అధ్యయనం ప్రతిపాదించేముందు లేదా చాలాకాలంగా నిష్క్రియునిగావున్న సహోదరుణ్ణి మనతోపాటు పరిచర్యలో భాగం వహించమని ఆహ్వానించేముందు పెద్దలను నిర్దేశం కోసం అడగాలి. ఒకవేళ క్షేత్రంలో మనం నిష్క్రియుడైన ప్రచారకుణ్ణి కలిస్తే, ఆ విషయాన్ని మనం పెద్దలకు తెలియజేయాలి, అప్పుడు వారు ఆయనకు అవసరమైన సహాయాన్ని అందించగలుగుతారు.
6. నిష్క్రియులుగా ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనకు ఎలాంటి ఆనందం లభిస్తుంది?
6 బైబిలు స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా, పరుగును తుదముట్టించిన వారే రక్షణ పొందుతారు. (మత్త. 24:13) కాబట్టి, అభ్యంతరపడినవారిపట్ల లేదా దూరమైపోయినవారిపట్ల శ్రద్ధచూపించండి. అలాంటి వారిపట్ల యథార్థమైన ఆసక్తిని చూపించడం ద్వారా యెహోవా ప్రేమను ఓర్పుతో ప్రతిబింబిస్తే, వారుకూడా మన సహవాసంలో పవిత్రసేవను పునఃప్రారంభించడాన్ని చూసే ఆనందం మనకుంటుంది.—లూకా 15:4-10.