ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
1. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధపడడం ఎందుకు జ్ఞానయుక్తం?
1 ప్రతీ సంవత్సరం, మన సహోదర సహోదరీలతో సహా లక్షలాదిమంది భూకంపాలు, సునామీలు, భారీవర్షాలు, తుపానులు, సుడిగాలులు, వరదల బారినపడుతున్నారు. ప్రకృతి విపత్తులు హఠాత్తుగా సంభవించడమే కాక మనలో ఎవరినైనా ప్రభావితం చేయగలవు కాబట్టి, వాటికోసం ముందుగానే సిద్ధపడడం జ్ఞానయుక్తం.—సామె. 21:5.
2. పెద్దలకు మన ప్రస్తుత అడ్రసు, ఫోను నంబరు(లు) ఎందుకివ్వాలి?
2 విపత్తు సంభవించడానికి ముందు: కొన్ని సమయాల్లో అధికారులు పొంచివున్న విపత్తు గురించి ముందుగానే హెచ్చరించగలుగుతారు. అలాంటి హెచ్చరికలను లక్ష్యపెట్టడం చాలా ప్రాముఖ్యం. (సామె. 22:3) అలాంటి పరిస్థితుల్లో, పెద్దలు సంఘంలోని వారందరూ అవసరమైన ఏర్పాట్లు చేసుకొనేలా సహాయం చేయడానికి, వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. విపత్తు సంభవించిన తర్వాత కూడా, సంఘంతో సహవసిస్తున్న వారి యోగక్షేమాల గురించి, వారికి ఎలాంటి సహాయం అవసరమో తెలుసుకోవడానికి పెద్దలు వారినందరినీ సంప్రదించడానికి కృషి చేస్తారు. సంప్రదించడానికి పెద్దలదగ్గర సరైన సమాచారం లేకపోతే అమూల్యమైన సమయం వృథాకాగలదు. అందుకే ప్రచారకులు తమ ప్రస్తుత అడ్రసు, ఫోను నంబరు(లు) కార్యదర్శికి, పుస్తక అధ్యయన పైవిచారణకర్తకు ఇవ్వడం ప్రాముఖ్యం.
3. ఒకవేళ మనం విపత్తు సంభవించగల ప్రాంతంలో నివసిస్తుంటే, మనమెలా పెద్దలతో సహకరించవచ్చు?
3 ఒకవేళ సంఘం విపత్తు సంభవించగల ప్రాంతంలో ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి ఆ ప్రాంతంలో నివసించని తమ బంధువుల పేరు, ఫోను నంబరు ఇవ్వమని పెద్దలు ప్రచారకులను అడగవచ్చు. అలా చేయడంవల్ల ప్రమాదస్థలం నుండి వెళ్ళిపోయినవారి గురించి వాకబు చేసేందుకు పెద్దలకు సహాయకరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సంఘం ఏమి చేయాలో సూచించే అంటే, అత్యవసర పరిస్థితుల్లో దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువుల చిన్న పట్టిక, ప్రమాదస్థలాన్ని ఖాళీ చేయించే ఏర్పాట్లు, ప్రత్యేకావసరాలు ఉన్నవారికి సహాయమందించే ఏర్పాట్లు ఇమిడివున్న ఒక ప్రణాళిక తయారుచేసుకోవడానికి పెద్దలు ఇష్టపడవచ్చు. ఇలాంటి ప్రేమపూర్వక ఏర్పాట్లకు మనం సహకరించడం ప్రాముఖ్యం.—హెబ్రీ. 13:17.
4. మనం నివసించే ప్రాంతంలో విపత్తు సంభవిస్తే మనమేమి చేయాలి?
4 విపత్తు సంభవించిన తర్వాత: మీ ప్రాంతంలో విపత్తు సంభవిస్తే మీరేమి చేయాలి? మీ కుటుంబ సభ్యుల ముఖ్యమైన భౌతికావసరాలపట్ల శ్రద్ధ తీసుకోండి. మీకు సాధ్యమైతే, ఇతర బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించండి. వీలైనంత త్వరగా మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్తనుగానీ లేదా మరో పెద్దనుగానీ సంప్రదించడానికి ప్రయత్నించండి. మీరు సురక్షితంగా ఉండి, మీకు సహాయం అవసరం లేకపోయినా అలా చేయాలి. ఒకవేళ మీకు సహాయం అవసరమైతే, మీకు సహాయం చేయడానికి మీ సహోదరులు తీవ్రంగా కృషి చేస్తున్నారనే హామీతో ఉండండి. (1 కొరిం. 13:4, 7) యెహోవాకు మీ పరిస్థితి తెలుసనే విషయాన్ని గుర్తుంచుకోండి, మిమ్మల్ని సంరక్షించేందుకు ఆయనమీద ఆధారపడండి. (కీర్త. 37:39; 62:8) ఇతరులకు ఆధ్యాత్మిక, భావోద్రేక సహాయాన్ని అందించే అవకాశాలకోసం కనిపెట్టుకుని ఉండండి. (2 కొరిం. 1:3, 4) వీలైనంత త్వరగా మీ దైవపరిపాలనా కార్యకలాపాలను పునఃప్రారంభించండి.—మత్త. 6:33.
5. విపత్తుల గురించిన భయం క్రైస్తవులమైన మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
5 విపత్తుల గురించిన భయం లోకానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నా, మనమైతే మన భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని నమ్మవచ్చు. త్వరలోనే, విపత్తులన్నీ గతించిన విషయాలుగా ఉంటాయి. (ప్రక. 21:4) ఈలోగా, మనం ఇతరులకు సువార్తను ప్రకటించడంలో ఉత్సాహంగా కొనసాగుతూ, సమస్యలు, కష్టాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు.