క్షేత్రసేవా కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందండి
1. క్షేత్రసేవా కూటాలు మనకెలా సహాయం చేయగలవు?
1 పరిచర్యకు వెళ్ళే ముందు ఏర్పాటు చేయబడే సమర్థవంతమైన క్షేత్రసేవా కూటాలు నిజమైన ప్రోత్సాహాన్ని, ఆచరణాత్మక ఉపదేశాన్ని అందిస్తాయి. పరస్పర మద్దతు కోసం, శిక్షణ కోసం ఇతర ప్రచారకులతో కలిసి పనిచేసేలా ఆ కూటాలు మనకు దోహదపడతాయి. (సామె. 27:17; ప్రసం. 4:9, 10) ఈ కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి మనమేమి చేయాలి?
2. నిర్వహించే వ్యక్తి ఏయే విషయాలను చర్చించవచ్చు?
2 నిర్వాహకుడు: ఈ కూటాల్లో చర్చించబడే నిర్దిష్ట సమాచారం సాధారణంగా ముందుగా పేర్కొనబడదు. కాబట్టి మీరొకవేళ నిర్వహిస్తున్నట్లయితే ముందుగానే సిద్ధపడాలి. అలవాటుగా దినవచనాన్ని చర్చిద్దామని అనుకోకండి, అయినా, ఒకవేళ ఆ రోజు దినవచనానికి పరిచర్యతో సూటిగా సంబంధమున్నట్లయితే దాన్ని చర్చించవచ్చు. ఆ రోజు సాక్ష్యమిస్తున్నవారికి ఏది ఆచరణాత్మక సహాయం అందజేస్తుందో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ఒక ప్రతిపాదనను చర్చించాలనుకుంటుండవచ్చు లేదా ప్రదర్శించాలని అనుకుంటుండవచ్చు. తర్కించడం (ఆంగ్లం), పరిచర్య పాఠశాల పుస్తకాల నుండి లేదా ఇటీవలి సేవాకూటంలో జరిగిన భాగం నుండి అంశాలను చర్చించవచ్చు. ఇతర సమయాల్లో మీ క్షేత్రంలో తలెత్తగల సమస్యతో ఎలా వ్యవహరించాలో మీరు చర్చించవచ్చు. ముఖ్యంగా చాలామంది ప్రచారకులు పునర్దర్శనాలు చేస్తున్నట్లయితే ఆసక్తిని వృద్ధిచేసి, బైబిలు అధ్యయనాలను ఎలా ప్రారంభించాలనే అంశాల గురించి కూడా చర్చించవచ్చు. ఏమి చర్చించబడుతున్నా ఉత్సాహంగా, ప్రోత్సహించేవారిగా ఉండండి.
3. కూటం ఎంతసేపు ఉండాలి, ఆ సమయంలో ఏమేమి చేయాలి?
3 కొంతమంది ఆలస్యంగా వస్తారని తెలిసినా కూటాన్ని సమయానికి ప్రారంభించండి. గుంపులను నియమించేటప్పుడు వివేచనను ఉపయోగించండి, అవసరమైనవారికి క్షేత్రాన్నివ్వండి. కూటం 10, 15 నిమిషాలకు మించకూడదు, ఒకవేళ సంఘ కూటం తర్వాతైతే దాన్ని ఇంకా తక్కువ సమయంలోపే ముగించాలి. కూటాన్ని మీరు ముగించక ముందే అందరికీ ఎవరితో ఎక్కడికి వెళ్ళాలో తెలిసుండాలి. కూటాన్ని ప్రార్థనతో ముగించాలి.
4. క్షేత్రసేవా కూటాల నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి అందరికీ ఏమి సహాయం చేస్తుంది?
4 మీరు సహాయం చేయవచ్చు: సంఘకూటాలకు వస్తున్నట్లే, సమయానికి రావడంవల్ల యెహోవాకు గౌరవాన్ని, ఇతరులపట్ల శ్రద్ధను మనం చూపిస్తాం. చర్చలో పాల్గొనండి. మీరు ఎవరితో పనిచేయాలనే విషయాన్ని నిర్వాహకునికి వదిలేయవచ్చు లేదా ఎవరితో పనిచేయాలో కూటానికి ముందుగా మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు మీ సొంత ఏర్పాట్లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే, ప్రతీసారి సన్నిహిత స్నేహితులతో పనిచేసే బదులు ఇతర ప్రచారకులతో పనిచేయడం ద్వారా ‘మీ హృదయాలను విశాలపరచుకోవడానికి’ ప్రయత్నించండి. (2 కొరిం. 6:11-13) ఒకసారి కూటం ముగిసిన తర్వాత ఏర్పాట్లను మార్చకండి, త్వరగా క్షేత్రానికి వెళ్ళండి.
5. క్షేత్రసేవా కూటాల ఉద్దేశమేమిటి?
5 ఇతర సంఘ కూటాలకున్న ఉద్దేశమే క్షేత్రసేవా కూటాలకు కూడా ఉంది. ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పడానికి’ అవి ఏర్పాటు చేయబడ్డాయి. (హెబ్రీ. 10:24, 25) ఈ కూటాల నుండి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే, ‘సత్కార్యమనే’ మన పరిచర్యను కొనసాగించడానికి సహాయం లభిస్తుంది.