గంభీరంగా ఆలోచింపజేసే వీడియో
“ఈ వీడియో నిజంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది!”
“అది నా హృదయాన్ని స్పర్శించింది!”
“నేనెంతో భావావేశానికి లోనయ్యాను!”
1 యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియో చూసినప్పుడు మీరూ అలాగే భావించారా? కొన్ని సంవత్సరాల క్రితం ఒక యౌవన సహోదరుడు తానెంచుకున్న స్నేహితులవల్ల జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నాడు. వాళ్ళు సత్యంపట్ల ఆయనకున్న ఆసక్తిని పాడుచేశారు, దానితో ఆయన యెహోవాతో తనకున్న సంబంధాన్ని కోల్పోయాడు. అప్పుడే నిజమైన స్నేహితులు అనే వీడియో విడుదలైంది. ఆయనిలా వ్రాశాడు: “నేను ఆ వీడియోను చూసినప్పుడల్లా నా కళ్లు చెమర్చేవి. సరైన సమయానికి సహాయం చేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను.” ఆ వీడియో ఆయన తన జీవనశైలిని మార్చుకొని సరైన స్నేహితులను సంపాదించుకొనేలా పురికొల్పింది. ఆయనింకా ఇలా వ్రాశాడు: “ఈ వీడియో ప్రకాశకులకు, ప్రస్తుతం యౌవనులను ఏవి ప్రభావితం చేస్తున్నాయో బాగా తెలుసు.” తల్లిదండ్రులారా, యౌవనులారా, ఈసారి కుటుంబ అధ్యయనంలో భాగంగా ఈ వీడియోను ఇంకోసారి ఎందుకు చూడకూడదు? ప్రతీ భాగం తర్వాత వీడియోను ఆపుజేసి, ఈ క్రింది పేరాల్లోని ప్రశ్నలను ధైర్యంగా, నిజాయితీగా కలిసి చర్చించండి.
2 ఉపోద్ఘాతం: నిజమైన స్నేహితుడు ఎవరు?—సామె. 18:24.
3 స్నేహానికి ఎదురయ్యే అడ్డంకులు: మీరు ఒంటరివారనే భావనను ఎలా అధిగమించవచ్చు? (ఫిలి. 2:4) మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మీరెందుకు సుముఖంగా ఉండాలి, అలా మెరుగుపరచుకోవడానికి మీకెవరు సహాయం చేయగలరు? ఎక్కువమంది స్నేహితులను సంపాదించుకొనే అవకాశాలు మీకెలా లభిస్తాయి, మీరు వారిని ఎక్కడ కనుగొనవచ్చు?—2 కొరిం. 6:13.
4 దేవునితో స్నేహం: యెహోవాతో మీరెలా సన్నిహిత సంబంధాన్ని వృద్ధిచేసుకోగలరు, అలా వృద్ధిచేసుకునే ప్రయత్నం ఎందుకు వృథా కాదు? (కీర్త. 34:8) దేవునితో మీ స్నేహాన్ని ఎవరు అత్యంత మెరుగైన రీతిలో బలపర్చగలరు?
5 అనుచిత స్నేహితులు: అనుచిత స్నేహితులు ఎవరు? (1 కొరిం. 15:33) అనుచిత స్నేహితులు ఒక వ్యక్తిని ఏ విధంగా ఆధ్యాత్మిక నాశనానికి నడిపించగలరు? దీనా గురించిన బైబిలు వృత్తాంతం మీకేమి బోధిస్తుంది?—ఆది. 34:1, 2, 7, 19.
6 ప్రస్తుతకాల నాటకం: తారాను ఒంటరితనం ఏ విధంగా ప్రభావితం చేసింది? లోకంలోని యౌవనస్థులతో తాను చేస్తున్న సహవాసాన్ని ఆమె ఎలా సమర్థించుకుంది? వారు ఆమెను ఎలాంటి ప్రమాదాలకు గురిచేశారు? ఆమె చిక్కుకున్న ప్రమాదాన్ని తల్లిదండ్రులు ఎందుకు గుర్తించలేకపోయారు, అయితే వారు తమ దృక్పథాన్ని మార్చుకొని ఆమె తిరిగి ఆధ్యాత్మికంగా కోలుకునేలా ఎలా సహాయం చేశారు? ఒక పయినీరు సహోదరి తారాకు నిజమైన స్నేహితురాలని ఎలా నిరూపించుకుంది? క్రైస్తవులు సామెతలు 13:20, యిర్మీయా 17:9లోని సలహాను ఎందుకు లక్ష్యపెట్టాలి? తారా ఏ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది?
7 ముగింపు: ఈ వీడియో నుండి మీరెలాంటి పాఠాలు నేర్చుకున్నారు? ఇతరులకు సహాయం చేయడానికి మీరు వాటినెలా ఉపయోగించవచ్చు?—కీర్త. 71:17.