ఇంటింటా సాక్ష్యమివ్వడం
1. ఇంటింటి పరిచర్యకు సంబంధించి ఏ ప్రశ్న ఉత్పన్నమౌతోంది, ఎందుకు?
1 “సత్యాన్ని వివిధ పద్ధతుల్లో వ్యాప్తిచేయడంలో అనుభవజ్ఞులైనవారు, ప్రస్తుత కాలంలో ‘వెయ్యేళ్ల ఆరంభం’ (ఆంగ్లం) పుస్తకం సహాయంతో సత్యాన్ని ఇంటింటా ప్రకటించడం సర్వశ్రేష్ఠమైన పద్ధతని ఒప్పుకుంటారు.” జాయన్స్ వాచ్‌టవర్ జూలై 1, 1893 సంచికలోని ఆ వ్యాఖ్యలు ఇంటింటి పరిచర్య విలువను నొక్కిచెప్పాయి. అలా ప్రకటించడం యెహోవాసాక్షుల విశిష్ట లక్షణమని భూవ్యాప్తంగావున్న ప్రజలు పరిగణిస్తున్నారు. కొన్ని దేశాల్లో ప్రజల్ని ఇంటి దగ్గర కలుసుకోవడం కష్టంగావుంది కాబట్టి, ఇంటింటికి వెళ్లడం ఇంకనూ సమర్థవంతంగా ఉందా?
2. ఇంటింటికి వెళ్ళి సాక్ష్యమివ్వడానికి ఏ లేఖనాధారముంది?
2 లేఖనాధారితమైనది, ప్రాముఖ్యమైనది: ఇంటింటా సాక్ష్యమివ్వడం లేఖనాధారితమైనది. ఇద్దరిద్దరిగా ప్రజల ఇళ్లకు వెళ్ళమని యేసు 70 మంది శిష్యులను ఉపదేశించాడు. (లూకా 10:5-7) యేసు చనిపోయిన కొద్దికాలానికే, శిష్యుల కార్యకలాపాల గురించి బైబిలు ఇలా తెలియజేస్తోంది: “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసేక్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొ. 5:42) అపొస్తలుడైన పౌలు కూడా ఉత్సాహంగా ఇంటింటికి వెళ్ళి బోధించాడు.—అపొ. 20:20.
3. ఇంటింటా సాక్ష్యమివ్వడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలేమిటి?
3 నేడు కూడా సువార్తను వ్యాప్తి చేయడంలో ఇంటింటా సాక్ష్యమివ్వడం ప్రముఖ పద్ధతిగానే కొనసాగుతోంది. అది ఒక క్రమ పద్ధతిలో సరైన మనోవైఖరిగలవారెవరో ‘విచారించడానికి’ లేదా అన్వేషించడానికి మనకు సహాయం చేస్తుంది. (మత్త. 10:11) సాధారణంగా ప్రజలు ఇళ్లలో తీరిగ్గా ఉంటారు. వారితో ముఖాముఖిగా మాట్లాడడం అంటే వారు చెప్పేది వింటూ, వారి హావభావాలను, పరిసరాలను గమనించడం వారి ఆసక్తిని, చింతలను అర్థం చేసుకునే అవకాశాన్ని మనకిస్తుంది. అది సాధారణంగా మనం మరింత ఎక్కువసేపు మాట్లాడేందుకు అవకాశమిస్తుంది.
4. ఇంటింటా సాక్ష్యమివ్వడాన్ని మనం మరింత ఫలవంతంగా ఎలా చేయవచ్చు?
4 వ్యక్తిగత సర్దుబాట్లు చేసుకోండి: అపొస్తలుడైన పౌలు ‘సువార్త కొరకు’ వ్యక్తిగత సర్దుబాట్లు చేసుకొనేందుకు సుముఖతను ప్రదర్శించాడు. (1 కొరిం. 9:23) ప్రజలు ఎక్కువగా ఇంటిదగ్గర ఉండే సమయంలో అంటే సాయంత్రాల్లో, వారాంతాల్లో, లేదా సెలవుదినాల్లో ప్రకటించేందుకు మన పట్టికలో సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఇళ్లలో లేనివారి వివరాలు వ్రాసిపెట్టుకొని, వారంలో మరోరోజు లేదా అదే రోజు వేరే సమయంలో కలవడానికి ప్రయత్నించండి.
5. ఆరోగ్యపరంగా పరిమితులు ఉన్నవారు కూడా ఇంటింటి పనిలో ఎలా పాల్గొనవచ్చు?
5 ఆరోగ్యపరంగా పరిమితులు ఉన్నవారు కూడా ఇంటింటి ప్రకటనాపనిలో పాల్గొనవచ్చు. అలాంటివారు ఎక్కువ ఇబ్బందిపడకుండా పనిచేయగలిగేలా వారు సుళువుగా వెళ్ళగలిగే ఇళ్ళకి మనతోపాటు తీసుకెళ్ళేందుకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఒక సహోదరికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండి అరగంటకు ఒకసారి మాత్రమే ఒక ఇంట్లో మాట్లాడేది. అయినప్పటికీ, ప్రకటించే గుంపుతో కలిసి వెళ్ళిన తర్వాత ఆమె ఎంతో సంతోషంగా, సంతృప్తిగా భావించింది!
6. మన పరిచర్యలో ఇంటింటా సాక్ష్యమివ్వడాన్ని ఒక క్రమమైన భాగంగా ఎందుకు చేసుకోవాలి?
6 ఇంటింటి పరిచర్యలో గొర్రెల్లాంటివారు ఇంకనూ తారసపడుతూ ఉన్నారు. ఒక ప్రచారకుడు ఒక ఇంటి తలుపు తట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఇలా అన్నాడు: “లోపలికి రండి. మీరెవరో నాకు తెలుసు. నాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపమని దేవునికి ప్రార్థిస్తున్నాను, అప్పుడే మీరు తలుపు తట్టారు. దేవుడు నా ప్రార్థన విని మిమ్మల్ని పంపించాడు.” సత్ఫలితాలు ఈ విధమైన ప్రకటనా పద్ధతిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడని రుజువునిస్తున్నాయి. (మత్త. 11:19) మీ పరిచర్యలో ఇంటింటా సాక్ష్యమివ్వడాన్ని ఒక క్రమమైన భాగంగా చేసుకోవడానికి దృఢంగా నిర్ణయించుకోండి.