నిష్పక్షపాతంగా ప్రకటించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తిని చూపించండి
1 ఆకాశమధ్యములో ఒక దూత ఎగురుతూ నిత్యసువార్తను “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” ప్రకటిస్తుండడాన్ని అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూశాడు. (ప్రక. 14:6) నిష్పక్షపాతంగా ప్రకటించడంద్వారా మనం ఆ దూత మాదిరిని అనుసరిస్తున్నామా? తెలిసోతెలియకో మనలో పక్షపాత వైఖరి ఉండవచ్చు. మనం కలుసుకునే ప్రజలపట్ల మనకుండే దృక్పథం, సువార్త చెప్పేవిధానాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు మనం నిజమైన ప్రేమపూర్వక శ్రద్ధను చూపించాలి.
2 మీ క్షేత్రం గురించి ఆలోచించండి: మీ క్షేత్రంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారా? లేదా వేరే భాషలు మాట్లాడే ప్రజలు మాత్రమే స్థిరపడ్డ ప్రాంతాలు ఉన్నాయా? వారిని పలకరించేందుకు చొరవ తీసుకోండి, వారిని మరింత బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారికి ఎలాంటి అవసరాలు, చింతలు, ఇష్టాయిష్టాలు, భయాందోళనలు, అపోహలు ఉన్నాయి? మీ రాజ్యసందేశాన్ని వాటికనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. (1 కొరిం. 9:19-23) అపొస్తలుడైన పౌలులా, మన క్షేత్రంలో ఉన్న ప్రతీఒక్కరితోపాటు మన ప్రాంతానికి చెందనివారికీ, భిన్న సంస్కృతిగలవారికీ, వేరే భాష మాట్లాడేవారికీ లేదా సంపన్నులకు సువార్త ప్రకటించడాన్ని మన బాధ్యతగా ఎంచాలి.—రోమా. 1:14.
3 అయితే, వేరే భాష మాట్లాడే వ్యక్తికి మీరెలా సాక్ష్యమివ్వవచ్చు? అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని ఉపయోగించండి. మీ క్షేత్రంలో అందరూ సాధారణంగా మాట్లాడే భాషల్లో కొన్ని కరపత్రాలను లేక బ్రోషుర్లను కూడా మీతోపాటు తీసుకెళ్ళవచ్చు. (మన రాజ్య పరిచర్య, జూలై 2003, 8వ పేజీలోని 2-3 పేరాలు చూడండి.) అదనంగా, కొంతమంది ప్రచారకులు వేరే భాషలో పలకరించడాన్ని, సరళమైన అందింపును నేర్చుకోవడానికి కృషిచేశారు. ఏదో కొద్దిగానైనా సరే, ఒక వ్యక్తి తమ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించడం చూస్తే ప్రజలు తరచూ ముగ్ధులవుతారు. సువార్త వినేలా అది వారిని ఆకర్షించవచ్చు.
4 యెహోవాను అనుకరించండి: విభిన్న నేపథ్యాలనుండి వచ్చినవారికి ప్రకటించడం ద్వారా, నిష్పక్షపాతియైన యెహోవా దేవుణ్ణి మనం అనుకరిస్తాం, ‘ఆయన, మనుష్యులందరూ రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.’—1 తిమో. 2:3, 4.