మనం నేర్చుకున్నవి అన్వయించుకునేందుకు సహాయం చేసే పాఠశాల
1 మనం 2006వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టికలో ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు లేఖనాధార బోధలను మన పవిత్ర సేవకు, దైనందిన జీవితానికి అన్వయించుకోవడం ద్వారా వాటినుండి ప్రయోజనం పొందడానికి మనం కృషి చేస్తాం. మనం నేర్చుకునే విషయాలను ఆచరణలో పెట్టాలని తీర్మానించుకుంటాం.—యోహా. 13:17; ఫిలి. 4:9.
2 వ్యాఖ్యానాలు ఇవ్వడం: ఈ సంవత్సరపు పట్టికలోని, బైబిలు ముఖ్యాంశాలలో ప్రేక్షకులు భాగంవహించడానికి ఒక నిమిషం అదనంగా కేటాయించబడింది. దానర్థం ముఖ్యాంశాల కోసం నియమించబడిన సహోదరుడు తన భాగాన్ని ఆరు నిమిషాలకు బదులు ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలని గుర్తుంచుకోవాలి. తమ సీట్లలో నుండి వ్యాఖ్యానించేవారు తాము వ్యాఖ్యానించడానికి తీసుకునే సమయం విషయంలో శ్రద్ధవహించాలి. వ్యాఖ్యానం గురించి ముందుగానే జాగ్రత్తగా ఆలోచిస్తే వారు 30 సెకెన్లలో లేక అంతకన్నా తక్కువ సమయంలో సహాయకరమైన సమాచారాన్ని చెప్పవచ్చు. దానివల్ల ప్రేక్షకులు భాగంవహించడానికి కేటాయించబడిన ఆ ఐదు నిమిషాల్లో దాదాపు పదిమంది అర్థవంతమైన వ్యాఖ్యానాలు చేయడానికి వీలవుతుంది.
3 బోధించే ప్రసంగాలు: బైబిలు ముఖ్యాంశాలు, ఉపదేశ ప్రసంగం మన పరిచర్యకు, మన దైనందిన జీవితాల్లోని ఇతర అంశాలకు అన్వయిస్తాయి. కాబట్టి ఆ ప్రసంగాలు ఇచ్చేవారు దానిలోని సమాచారానికున్న ప్రాముఖ్యత మీద దృష్టినిలపాలి. ఒక ప్రసంగీకుడు తన శ్రోతల్లో చర్య తీసుకోవాలనే అభిలాష పుట్టించడం మాత్రమే సరిపోదు. ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్దిష్టంగా చెప్పాలి, ఆ చర్యను ఎలా తీసుకోవచ్చో వివరించడమే కాక అలాంటి చర్య తీసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరించాలి. ఆయన ఇలా చెప్పవచ్చు, “ఈ వచనం మనకు ఈ విధమైన నిర్దేశాన్నిస్తోంది,” లేక “ఈ వచనాలను పరిచర్యలో మనమిలా ఉపయోగించవచ్చు.” స్థానిక పరిస్థితుల గురించి తెలిసిన పెద్దలు, పరిచర్య సేవకులు ప్రసంగంలోని సమాచారాన్ని జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో వివరిస్తున్నప్పుడు ఆ అన్వయింపును సాధ్యమైనంతవరకు నిర్దిష్టంగా చెప్పడానికి ప్రయత్నించాలి.
4 ప్రసంగంలోని సమాచారాన్ని జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో వివరించడానికి బైబిలు ఉదాహరణలను ప్రస్తావించడం ఫలవంతంగా ఉండవచ్చు. లేఖనాధారంగల ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత ప్రసంగీకుడు ఇలా చెప్పవచ్చు, “మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండవచ్చు.” ఆయన బైబిలు ఉదాహరణల అన్వయింపును వివరిస్తున్నప్పుడు, ఆ అన్వయింపు సందర్భానికీ, బైబిలుకూ, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన సమాచారానికీ అనుగుణంగా ఉండాలి.—మత్త. 24:45.
5 తెలివిని, అవగాహనను విజయవంతంగా ఉపయోగించే సామర్థ్యమే జ్ఞానం. “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.” (సామె. 4:7) దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మనం అధ్యయనం చేస్తూ ఆచరణయోగ్యమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు, దానిని ఇతరులతో పంచుకునే మన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచుకుంటాం.