మన బైబిలు ఆధారిత ప్రచురణలను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
1, 2. మన ప్రచురణల గురించి చాలామంది ఏమని భావిస్తున్నారు, అది ఏ ప్రశ్నను లేవనెత్తుతుంది?
1 “నేను 1965వ సంవత్సరం నుండి మీ ప్రచురణలను చదువుతున్నాను. నేను వాటిని చదువుతున్నప్పుడు బైబిలును కూడా పరిశీలిస్తాను, మీ ప్రచురణల్లో ఉన్న అంశాలన్నీ బైబిలుకు అనుగుణంగా ఉంటాయి. దేవుని గురించిన, యేసు గురించిన అసలు సత్యాన్ని తెలుసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేవాణ్ణి, మీ ప్రచురణల నుండి, బైబిలు నుండి నేను వాస్తవమైన జవాబులు కనుగొంటున్నానని నిజాయితీగా చెప్పగలను” అని ఒక వ్యక్తి యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి వ్రాశాడు. అదే ఉత్తరంలో ఆయన బైబిలు అధ్యయనాన్ని కోరాడు.
2 కృతజ్ఞతగల ఆ వ్యక్తిలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న బైబిలు అధ్యయనానికి సహాయపడే పుస్తకాలపట్ల కృతజ్ఞతతో ఉన్నారు. (మత్త. 24:45) యథార్థహృదయులు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” పొందేలా సహాయం చేయడానికి ప్రతీ సంవత్సరం అధిక సంఖ్యలో ప్రచురణలు ముద్రించబడుతున్నాయి. (1 తిమో. 2:4) మన బైబిలు ఆధారిత ప్రచురణలను మనం జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించవచ్చు?
3. మనం ప్రచురణలు వృథా కాకుండా ఎలా చూడవచ్చు?
3 వృథా చేయకండి: కాలం గడిచేకొద్దీ మన దగ్గర మనం ఉపయోగించే దానికన్నా ఎక్కువ ప్రచురణలు పోగైవుండవచ్చు. అమూల్యమైన మన ప్రచురణలు వృథాకాకుండా మనమేమి చేయవచ్చు? మనం పరిచర్యలో ఉపయోగించడానికి ప్రచురణలను తీసుకుంటున్నప్పుడు వివేచనను ఉపయోగించాలి. మనం పరిచర్యలో అందించే ప్రచురణ అధిక కాపీలు తీసుకునే బదులు కేవలం ఒకటి రెండు కాపీలను తీసుకొని వాటిని అందించిన తర్వాత మరిన్ని కాపీల కోసం తిరిగివెళ్ళవచ్చు. అలా చేయడంవల్ల మన గృహాల్లో అధిక సంఖ్యలో ప్రచురణలు పోగవకుండా ఉంటాయి. అలాగే మన దగ్గర అందించని పత్రికలు చాలా ఉంటే మనం రిక్వెస్టు చేసే పత్రికల సంఖ్యను తగ్గించడం సముచితంగా ఉంటుంది.
4. ఒక సంఘంలో ప్రచురణలు అధికంగా నిల్వ ఉంటే ఏమి చేయవచ్చు?
4 అధికంగా నిల్వ ఉన్న ప్రచురణలు: సంఘంలో ఏ ప్రచురణలైనా అధికంగా నిల్వ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ఇతర సంఘాలు ఆ ప్రచురణలను ఉపయోగించగలవేమోనని లిటరేచర్ కోఆర్డినేటర్ ఆ సంఘాలను అడిగి తెలుసుకోవచ్చు. ప్రచారకులు పాత ప్రచురణలను అవిశ్వాసులైన కుటుంబ సభ్యులకు, బైబిలు విద్యార్థులకు, మరితరులకు ఇవ్వవచ్చు. ఆ పాత ప్రచురణలను సంఘంతో క్రొత్తగా సహవసిస్తున్నవారు తమ దైవపరిపాలనా గ్రంథాలయం కోసం తీసుకోవడానికి ఇష్టపడవచ్చు.
5. మన ప్రచురణపట్ల కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?
5 యెహోవా అద్భుత సంకల్పాల గురించి యథార్థవంతులైన ప్రజలు ఎక్కువ తెలుసుకోవడానికి సహాయం చేయాలనే మన సాహిత్య సంకల్పం నెరవేరాలని మనం కోరుకుంటాం. యేసు జనసమూహానికి అద్భుతమైన రీతిలో ఆహారం ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని వృథాచేయనట్లే, అందించబడుతున్న అమూల్యమైన బైబిలు ఆధారిత ప్రచురణను చక్కని రీతిలో ఉపయోగించాలన్నదే మన లక్ష్యంగా ఉండాలి. (యోహా. 6:11-13) మన ప్రచురణలు మన షెల్ఫ్ల్లో లేక మన బ్యాగుల్లోనే ఉన్నట్లయితే దానిలోని ప్రాణరక్షణ సందేశం నీతిని కోరే ప్రజల హృదయాలను స్పృశించదు. కాబట్టి పరిచర్య కోసం మనం ప్రచురణలను తీసుకుంటున్నప్పుడు మనం సహేతుకంగా వ్యవహరించి వాటిని ఇతరుల ప్రయోజనార్థం జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి.—ఫిలి. 4:5.