సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమం సంఘమంతటి ప్రయోజనం కోసం సిద్ధం చేయబడింది. సంఘపు ఇతర కూటాల్లోనూ, సమావేశాల్లోనూ విలువైన సమాచారం అందించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో ఏదైనా ఒక భాగాన్ని నిర్వహించడానికి మీరు నియమించబడ్డారంటే, మీకు బరువైన బాధ్యతే అప్పజెప్పబడిందన్నమాట. తన బోధన గురించి జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవ పైవిచారణకర్తయైన తిమోతికి అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (1 తిమో. 4:16) క్రైస్తవ కూటాలకు హాజరైనవారు, తమకు దేవునితోవున్న సంబంధంతో ముడిపడివుండే విషయాల్లో ఉపదేశం పొందేందుకు తమ విలువైన సమయాన్ని కేటాయించుకుని మరీ వచ్చారు. కొందరైతే అలా హాజరయ్యేందుకు ఎంతో కృషి చేయవలసి వచ్చింది. అలాంటి ఉపదేశాన్నివ్వడం నిజంగా ఎంత ఘనమైన ఆధిక్యత! మీరు దానిని యుక్తమైన రీతిలో ఎలా నిర్వహించగలరు?
బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు
మన పాఠశాలలోని ఈ అంశం, ఆయా వారాల కోసం నియమించబడిన బైబిలు పఠన భాగంపై ఆధారపడి ఉంటుంది. ఆ భాగంలోని సమాచారం నేడు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నొక్కిచెప్పాలి. నెహెమ్యా 8:8లో నివేదించబడినట్లు, యాజకుడైన ఎజ్రా లేవీయులతోపాటు దేవుని వాక్యాన్ని బహిరంగంగా చదివి విశదీకరించి “దానికి అర్థము చెప్పి” ప్రజలకు అవగాహన కలిగించాడు. మీరు బైబిలు ఉన్నతాంశాలను అందిస్తున్నప్పుడు అలా చేసే అవకాశం మీకు కూడా ఉంది.
మీరు అలాంటి నియామకానికి ఎలా సిద్ధపడాలి? సాధ్యమైతే, నియమించబడిన బైబిలు భాగాన్ని ఒక వారం ముందు గానీ అంత కన్నా ముందే గానీ చదవండి. తర్వాత, మీ సంఘాన్ని గురించీ సంఘ అవసరాల గురించీ ఆలోచించండి. వాటి గురించి ప్రార్థించండి. దేవుని వాక్యంలో ఉన్న ఏ ఉపదేశం, ఏ ఉదాహరణలు, ఏ సూత్రాలు ఆ అవసరాలను తీర్చుతాయి?
పరిశోధన చాలా ముఖ్యం. సీడీ-రామ్‌లోని వాచ్‌టవర్ లైబ్రరీ గానీ వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ (వాచ్ టవర్ ప్రచురణల సూచిక) గానీ మీకు అర్థమయ్యే భాషలో ఉన్నాయా? ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ లేకపోతే, కావలికోటలో సంవత్సరాంతంలో ఇచ్చే విషయ సూచికను మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీరు ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్న వచనాలపై ప్రచురించబడిన సమాచారాన్ని పరిశోధించేటప్పుడు, వాటి నేపథ్యాన్ని మరెక్కువగా తెలిపే అనేక విషయాలైనా ప్రవచనాల నెరవేర్పును గురించిన వివరణలైనా కొన్ని వచనాలైనా యెహోవా గురించి వెల్లడిచేసే అంశాలపై విశ్లేషణలైనా సూత్రాలను గురించిన చర్చలైనా మీకు కనిపించవచ్చు. మరీ ఎక్కువ అంశాలను చర్చించడానికి ప్రయత్నించకండి. కేవలం కొన్ని వచనాలనే ఎంపిక చేసుకొని వాటి మీదే శ్రద్ధ పెట్టండి. కొన్ని వచనాలనే తీసుకుని వాటినే సరిగ్గా చర్చించడం మంచిది.
మీ నియామకంలో, ఈ వారపు బైబిలు పఠన భాగం నుండి ఎలా ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించడం కూడా ఉండవచ్చు. తమ వ్యక్తిగత, కుటుంబ అధ్యయనాల్లోగానీ పరిచర్యలోగానీ తమ జీవిత విధానంలోగానీ తమకు ప్రయోజనాన్ని చేకూర్చగల ఏ విషయాన్ని వారు తెలుసుకున్నారు? యెహోవా, ప్రజలతోనూ జనాంగాలతోనూ వ్యవహరించిన విధానంలో ఏ గుణాలు వెల్లడయ్యాయి? తమ విశ్వాసాన్ని బలపరిచి, యెహోవా పట్ల తమకున్న కృతజ్ఞతను పెంచిన ఏ విషయాలను ప్రేక్షకులు నేర్చుకున్నారు? లోతైన సంక్లిష్టమైన విషయాలనే ఎక్కువగా చర్చించవద్దు. ఎంపిక చేసుకున్న అంశాల భావాన్నీ ఆచరణాత్మక విలువనూ నొక్కిచెప్పండి.
ఉపదేశ ప్రసంగం
ఇది ప్రచురిత సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కావలికోట, లేదా తేజరిల్లు!లోని ఒక ఆర్టికల్ మీద గానీ బహుశా ఒక పుస్తకములోని ఒక భాగం మీద గానీ ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో, కేటాయించబడిన సమయానికి సరిపడే సమాచారం కన్నా ఎక్కువ సమాచారమే ఉంటుంది. మీరు ఈ నియామకాన్ని ఎలా నిర్వహించాలి? మీరు, సమాచారాన్ని చర్చించే వ్యక్తిగా మాత్రమే కాక ఒక బోధకుడిగా దాన్ని నిర్వహించాలి. పైవిచారణకర్త, తప్పకుండా ‘బోధించదగినవాడై ఉండాలి.’—1 తిమో.3:2,3.
మీ సిద్ధపాటును నియమించబడిన సమాచారాన్ని అధ్యయనం చేయడంతో ప్రారంభించండి. లేఖనాలను తెరిచి చూడండి. ధ్యానించండి. మీ ప్రసంగ తేదీకి చాలా ముందే అలా చేయడానికి బాగా కృషి చేయండి. ఈ ప్రసంగానికి ఆధారమైన ప్రచురిత సమాచారాన్ని ముందుగా చదువుకొని రావాలని సహోదరులు ప్రోత్సహించబడ్డారన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోండి. కేవలం దానినే మళ్ళీ చెప్పడమో సంగ్రహ రూపంలో చెప్పడమో కాదు గానీ, దానిని ఆచరణలో పెట్టడమెలాగో చూపించడమే మీ నియామకం. సంఘానికి నిజంగా ప్రయోజనం చేకూరే విధంగా సమాచారంలోని సముచితమైన భాగాలను ఉపయోగించుకోండి.
ప్రతి బిడ్డకూ తనదైన వ్యక్తిత్వం ఉన్నట్లుగానే, ఒక్కో సంఘానికి భిన్నమైన లక్షణాలు ఉంటాయి. సమర్థవంతంగా బోధించే తండ్రి, తన బిడ్డకు నీతి సూత్రాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం మాత్రమే చేయడు, వాటిని బిడ్డతో తర్కిస్తాడు. బిడ్డ వ్యక్తిత్వాన్నీ బిడ్డ పోరాడుతున్న సమస్యలనూ పరిగణలోకి తీసుకుంటాడు. అదే విధంగా, సంఘంలోని బోధకులు, ప్రేక్షకుల అవసరాలు ఏమిటో గ్రహించి వాటికి శ్రద్ధనివ్వడానికి కృషి చేస్తారు. వివేచనగల బోధకుడు, ప్రేక్షకుల్లో ఎవరినైనా కలతపరిచే ఉదాహరణలను ఉపయోగించకుండా జాగ్రత్తపడతాడు. సంఘంలోని వారు యెహోవా మార్గంలో నడవడం వల్ల ఇప్పటికే పొందుతున్న ప్రయోజనాలను పేర్కొంటాడు, వారు తమకు ఎదురవుతున్న సమస్యలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడేలా లేఖనాల్లోవున్న ఉపదేశాన్ని నొక్కిచెబుతాడు.
మంచి బోధన ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తుంది. ఆ విధంగా బోధించేందుకు వాస్తవాలను పేర్కొనడమే కాక, అవి తెలిపే విషయాల గురించిన అవగాహనను పెంచడం కూడా అవసరం. అలా చేసేందుకు ఎవరికైతే ఉపదేశిస్తున్నారో వారిపై హృదయపూర్వక శ్రద్ధ ఉండాలి. ఆధ్యాత్మిక కాపరులకు తమ మంద గురించి తెలిసివుండాలి. వాళ్ళలో అనేకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రేమపూర్వకంగా మనస్సులో పెట్టుకుంటే, గ్రహింపునూ సానుభూతినీ తదనుభూతినీ కనబరుస్తూ ప్రోత్సాహకరంగా మాట్లాడగలుగుతారు.
ఒక ప్రసంగానికి నిర్దిష్టమైన స్పష్టమైన లక్ష్యం తప్పకుండా ఉండాలని ప్రతిభావంతులైన బోధకులకు తెలుసు. కీలకమైన విషయాలు ప్రత్యేకంగా గుర్తించబడేలా వాటిని జ్ఞాపకముంచుకోగలిగేలా సమాచారం అందించబడాలి. తమ జీవితాలపై ప్రభావం చూపగల ఆచరణాత్మకమైన తలంపులను ప్రేక్షకులు గుర్తుంచుకోగలగాలి.
సేవా కూటం
మన రాజ్య పరిచర్యలోని ఒక ఆర్టికల్ ఆధారంగా మీరు ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు, మీకు ఎదురయ్యే సవాలు కాస్త భిన్నంగా ఉండవచ్చు. మీరు చేయవలసింది అందులో ఇవ్వబడిన సమాచారాన్ని ప్రేక్షకులకు పూర్తిగా తెలియజేయడమనీ ఎక్కువ సముచితమైనది ఏదో ఎంపిక చేసుకోవడం కాదనీ మీరు గ్రహిస్తారు. అందులో ఇవ్వబడిన ఉపదేశాలకు ఆధారమైన లేఖనాలను ఆధారం చేసుకొని తమలో తాము తర్కించుకోవడానికి ప్రేక్షకులకు సహాయపడండి. (తీతు 1:9) సమయ పరిమితి మూలంగా అదనపు సమాచారాన్నందించే అవకాశం చాలా మట్టుకు ఉండదు.
మరొకవైపు, మీరు అందించడానికి నియమించబడిన సమాచారానికి సంబంధించి మన రాజ్య పరిచర్యలో ఆర్టికల్ ఏమీ ఉండకపోవచ్చు. కావలికోట ఆర్టికల్ ఏదైనా సూచించబడివుండవచ్చు, లేదా ఆ నియామకంలో క్లుప్తమైన సూచనలు ఉండవచ్చు. సంఘ అవసరాలను పరిగణలోకి తీసుకుంటూ, మీకు నియమించబడిన సమాచారాన్ని అందించడమన్నది ఒక బోధకుడిగా మీకే వదిలివేయబడుతుంది. మీరు క్లుప్తమైన సూటియైన ఉపమానాన్ని ఉపయోగించవలసి ఉండవచ్చు, లేదా తగిన అనుభవాన్ని చెప్పవలసిన అవసరం ఉండవచ్చు. మీ నియామకం కేవలం ఆ విషయంపై మాట్లాడడం మాత్రమే కాదనీ, దేవుని వాక్యం నిర్దేశిస్తున్న పనిని పూర్తి చేయడానికి, అందులో ఆనందాన్ని పొందడానికి సంఘానికి సహాయం చేసే విధంగా నిర్వహించడమనీ జ్ఞాపకముంచుకోండి.—అపొ. 20:20,21.
మీరు మీ నియామకానికి సిద్ధపడుతుండగా, సంఘ సభ్యుల పరిస్థితుల గురించి ఆలోచించండి. వారు అప్పటికే చేస్తున్న దానికి వారిని ప్రశంసించండి. నియమించబడిన సమాచారంలో ఇవ్వబడిన సూచనలను వాళ్ళు ఆచరిస్తే పరిచర్యలో వారి సాఫల్యత, వారి ఆనందం ఎలా అధికం కావచ్చు?
మీ నియామక నిర్వహణలో ప్రదర్శన గానీ ఇంటర్వ్యూ గానీ అవసరమా? అలాగైతే, దాని గురించి ముందుగా ఆలోచించుకొని కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ ఏర్పాట్లు చేయమని ఎవరినైనా కోరాలనిపించవచ్చు, కానీ అలా చేయడం వల్ల ఎల్లప్పుడూ అంత మంచి ఫలితాలు రావు. సాధ్యమైతే, ఆ కూటానికి ముందు రోజు ప్రదర్శనలను గానీ ఇంటర్వ్యూను గానీ రిహార్సల్ చేయండి. మీ నియామకంలోని ఈ అంశం మీరు ఇచ్చే ఉపదేశాన్ని మరింత విలువైనదిగా చేసేలా నిర్వహించబడేటట్లు చూడండి.
సమావేశాలు
చక్కని ఆధ్యాత్మిక గుణాలను పెంపొందించుకున్న, ప్రతిభావంతులైన బహిరంగ ప్రసంగీకులూ బోధకులూ అయిన సహోదరులను సమావేశ కార్యక్రమంలో భాగం వహించమని కొన్నాళ్ళ తర్వాత కోరవచ్చు. సమావేశాలు దైవపరిపాలనా విద్యను నేర్పే ప్రత్యేక సందర్భాలన్నది నిజం. ఆ సందర్భాలకు ఇవ్వబడిన నియామకం వ్రాతప్రతి (మాన్యుస్క్రిప్ట్) ప్రసంగం కావచ్చు, సంక్షిప్త ప్రతి ఆధారంగా ఇచ్చే ప్రసంగం కావచ్చు, ఆధునిక దిన అన్వయింపుతో కూడిన బైబిలు నాటకానికి నిర్దేశాలు కావచ్చు, లేక నిర్దేశాలతో కూడిన కేవలం ఒక్క పేరానే కావచ్చు. అలాంటి కార్యక్రమంలో సేవచేసే ఆధిక్యత మీకు లభించినట్లయితే, మీకివ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మీరు దాని విలువను గ్రహించగలిగేంత వరకూ అధ్యయనం చేయండి.
వ్రాతప్రతి ప్రసంగం ఇవ్వడానికి నియమించబడినవారు అందులో ఉన్న ప్రతి పదాన్నీ ఉన్నది ఉన్నట్లు చదవాలి. వారు పదాలను గానీ వాక్య నిర్మాణాన్ని గానీ క్రమాన్ని గానీ మార్చరు. ముఖ్యమైన అంశాలు ఏవో, అవి ఎలా విపులీకరించబడ్డాయో స్పష్టంగా గ్రహించేందుకు దాన్ని అధ్యయనం చేస్తారు. సరైన భావం వచ్చేలా పదాలను నొక్కి పలుకుతూ, ఉత్సాహంగానూ స్నేహభావంతోనూ భావోపేతంగానూ మనస్ఫూర్తిగానూ నమ్మకంతోనూ చదవగలిగేంత వరకు, ఎక్కువ మంది ప్రేక్షకులకు తగినట్లు బిగ్గరగా దృఢంగా చదవగలిగేంత వరకూ పైకి చదువుతూ అభ్యసిస్తారు.
సంక్షిప్త ప్రతికి పూర్తి పొందికగా ఉండేలా సమాచారాన్ని విపులీకరించుకోవలసిన బాధ్యత ఆ ప్రసంగానికి నియమించబడిన సహోదరులకు ఉంది. ప్రసంగీకుడు సంక్షిప్త ప్రతి నుండి చదివే బదులు లేదా దాని ఆధారంగా వ్రాతప్రతిని సిద్ధం చేసుకునే బదులు పదే పదే నోట్సు చూడకుండా హృదయంలో నుండి మాట్లాడాలి. సంక్షిప్త ప్రతిలో ఇవ్వబడిన ప్రతి ముఖ్యాంశాన్ని స్పష్టంగా వివరించేందుకు, దానికి కేటాయించబడిన సమయాన్ని పాటించడం ముఖ్యం. ప్రసంగీకుడు ముఖ్యాంశాల క్రింద ఇవ్వబడిన ఆలోచనలను లేఖనాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. సంక్షిప్త ప్రతిలో ఉన్నవి విడిచిపెట్టి తనకు నచ్చిన అదనపు అంశాలను చర్చించకూడదు. ఉపదేశానికి ఆధారం నిశ్చయంగా దేవుని వాక్యమే. క్రైస్తవ పెద్దల బాధ్యత “వాక్యమును ప్రకటించ[డం].” (2 తిమో. 4:1,2) కాబట్టి ప్రసంగీకుడు, సంక్షిప్త ప్రతిలోని లేఖనాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వాటిపై తర్కించాలి, వాటిని అన్వయించాలి.
వాయిదా వేయకండి
ప్రసంగించడానికి అనేక అవకాశాలున్న సంఘంలో మీరు సేవ చేస్తున్నారా? మీకు నియమించబడే ప్రసంగాలకన్నింటికీ మీరు ఎలా న్యాయం చేకూర్చగలరు? మీకు నియమించబడిన భాగాలను చివరి నిమిషంలో సిద్ధపడే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడండి.
సంఘాలకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా ప్రసంగమిచ్చేందుకు, కావలసినంత ముందుగా దాని గురించి ఆలోచించడం అవసరం. కాబట్టి, మీకు నియామకం అందిన ప్రతిసారీ సాధ్యమైనంత త్వరగా దానిని చదివే అలవాటు చేసుకోండి. మీరు అలా చదవడం వల్ల, మీరు ఇతర పనుల్లో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించుకోవడం సాధ్యమవుతుంది. ఆ సమాచారాన్ని ఎంత చక్కగా అన్వయించవచ్చో గ్రహించేందుకు తోడ్పడగల వ్యాఖ్యానాలను, మీరు ప్రసంగించడానికి ముందటి రోజుల్లోగానీ వారాల్లోగానీ మీరు వినవచ్చు. ఆ సమాచారం ఎంత సమయోచితమో వెల్లడి చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీకు నియామకం అందిన వెంటనే దానిని చదవడానికీ ఆలోచించడానికీ సమయం పడుతుంది, కానీ దానికి సమయం వెచ్చించడం తగినదే. మీరు చివరికి సంక్షిప్త ప్రతిని విపులీకరించేందుకు కూర్చున్నప్పుడు, మీరు ముందుగా ఆలోచించినందువల్ల మంచి ఫలితాన్ని చూస్తారు. ఈ విధంగా నియామకాలకు సిద్ధపడడం వల్ల ఎంతో ఒత్తిడి తగ్గుతుంది, ఆచరణాత్మకమైన విధంగానూ సంఘంలోని వారి హృదయాలను చేరుకునే విధంగానూ సమాచారాన్ని అందించడానికి వీలవుతుంది.
యెహోవా తన ప్రజలకు విద్య నేర్పే కార్యక్రమంలో మీకు ఇవ్వబడిన నియామకమనే వరాన్ని మీరు ఎంత విలువైనదిగా ఎంచితే, మీరు ఆయనను అంత ఘనపరుస్తారు, ఆయనను ప్రేమించేవారికి మీరు ఒక ఆశీర్వాదంగా ఉంటారు.—యెష. 54:13; రోమా. 12:6-8.