యెహోవా మహిమను ప్రకటించండి
1 కీర్తనకర్త ఇలా ప్రకటించాడు: “సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి. . . . అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.” యెహోవా మన కోసం ఏమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేయనున్నాడు అనే విషయాలను మనం ధ్యానిస్తే ఆయన మహిమను ప్రకటించడానికి మన హృదయాలు మనల్ని ప్రేరేపిస్తాయి!—కీర్త. 96:1, 3.
2 మన పరిచర్యలో: దేవుని నామాన్ని ధరించి, దానిని భూవ్యాప్తంగా బహిరంగంగా స్తుతించే ఆధిక్యత యెహోవాసాక్షులకు ఉంది. (మలా. 1:11) దురహంకారంతో తమ బైబిలు అనువాదాల నుండి దేవుని నామాన్ని తొలగించే క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులకు ఇదెంత వ్యత్యాసమో కదా! దేవుని నామాన్ని ప్రకటించే పని అత్యవసరం, ఎందుకంటే ప్రజలు రానున్న మహాశ్రమలనుండి రక్షించబడాలంటే వారు విశ్వాసంతో ఆ నామాన్నిబట్టి ప్రార్థించాలి. (రోమా. 10:13-15) అంతేకాక విశ్వశాంతితోపాటు భూనివాసుల మధ్య శాంతి నెలకొనడం దేవుని నామం పరిశుద్ధపరచబడడంపైనే ఆధారపడివుంది. అవును, దేవుని కార్యాలన్నీ ఆయన నామంతో ముడిపడి ఉన్నాయి.
3 “యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు.” అయితే ప్రజలు ‘యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించాలంటే’ వారు ఆయన గురించిన సత్యాన్ని తెలుసుకోవాలి. (కీర్త. 96:4, 8) అయితే కొందరు దేవుని ఉనికిని అంగీకరించరు. (కీర్త. 14:1) మరికొందరు ఆయన శక్తిహీనుడని ఆయనను అవమానిస్తారు లేక ఆయనకు మానవ వ్యవహారాల్లో ఆసక్తి లేదని వాదిస్తారు. మన సృష్టికర్త గురించిన, ఆయన సంకల్పాల గురించిన, ఆయన ప్రియమైన వ్యక్తిత్వాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవడానికి మనం యథార్థ హృదయులకు సహాయం చేస్తున్నప్పుడు మనం యెహోవాను మహిమపరుస్తాం.
4 మన ప్రవర్తన ద్వారా: యెహోవా నీతియుక్త ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం ఆయనను మహిమపరుస్తుంది. మన మంచి ప్రవర్తన గమనించబడకపోదు. (1 పేతు. 2:12) ఉదాహరణకు, మనం కనిపించే తీరు పరిశుభ్రంగా, చక్కగా ఉన్నట్లయితే ఇతరులు మంచి వ్యాఖ్యానాలు చేయడానికి ప్రోత్సహించబడవచ్చు, తద్వారా దేవుని వాక్యంలోని సూత్రాలకు అనుగుణంగా జీవించడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడే అవకాశం మనకు లభిస్తుంది. (1 తిమో. 2:9, 10) ఇతరులు ‘మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచినప్పుడు’ మనం ఎంత ఆనందిస్తామో కదా!—మత్త. 5:16.
5 మన మాటల ద్వారా క్రియల ద్వారా మనం ప్రతీరోజు మన మహోన్నతుడైన దేవుణ్ణి మహిమపరచుదాం, అలా చేయడం ద్వారా ఆనందంతో ఇవ్వబడిన ఈ పిలుపుకు ప్రతిస్పందిస్తాం: “యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.”—కీర్త. 96:2.