గమనించేవారిగా ఉండడం ద్వారా వ్యక్తిగత ఆసక్తి చూపించండి
1 ప్రజల నిర్దిష్ట అవసరాలను గుర్తించి వారికి సహాయం అందించడంలో యెహోవా దేవుణ్ణి, క్రీస్తుయేసును మించినవారు లేరు. (2 దిన. 16:9; మార్కు 6:34) మనం మన పరిచర్యలో కలుసుకునేవారి ఆసక్తిని, చింతను గుర్తించినప్పుడు మనం ప్రకటించే సువార్తను దానికి అనుగుణంగా మలచుకోగలుగుతాం.
2 గృహస్థునికి సంబంధించిన వాటిని జాగ్రత్తగా గమనించండి: యేసు గమనించే వ్యక్తిగా ఉన్నాడు. (మార్కు 12:41-43; లూకా 19:1-6) అలాగే మనం పరిచర్యలో ఒక ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, మతసంబంధమైన అలంకారాలను, వాహనాల మీద ఉన్న నినాదాలను, లేక పెరట్లో ఉన్న ఆటవస్తువులను గమనించినప్పుడు సువార్త విషయమై సమర్థవంతమైన సాక్ష్యమివ్వగల అవకాశాలను మనం సృష్టించుకోగలుగుతాం.
3 ఒక వ్యక్తి ముఖకవళికలు, ప్రవర్తన ఆయన భావాల గురించి మనకు కొంత తెలియజేయవచ్చు. (సామె. 15:13) ప్రియమైనవారి మరణం లేక ఆందోళన కలిగించే ఇతర పరిస్థితుల మూలంగా ఆయనకు ఓదార్పు అవసరం కావచ్చు. మనం ఆయన కోసం కొన్ని సముచితమైన లేఖనాలు చదివినప్పుడు ఆయన సంతోషించవచ్చు. (సామె. 16:24) గృహస్థుడు బయటికి వెళ్ళే హడావిడిలో ఉన్నాడా లేక ఏడుస్తున్న పాపను ఊరడిస్తున్నాడా? అలాగైతే మరో సమయంలో వారిని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం బావుండవచ్చు. మనం గృహస్థునిపట్ల శ్రద్ధ చూపించడం ద్వారా, అతని ‘సుఖదుఃఖాలలో పాలుపంచుకోవడం ద్వారా’ తిరిగి వెళ్ళినప్పుడు అతడు మనం చెప్పేది వినేలా మనం ప్రోత్సహించవచ్చు.—1 పేతు. 3:8.
4 మీ వ్యాఖ్యానాలను పరిస్థితికి అనుగుణంగా మలచుకోండి: అపొస్తలుడైన పౌలు, ఏథెన్సు పట్టణంలో “తెలియబడని దేవునికి” ప్రతిష్ఠించబడిన బలిపీఠాన్ని గమనించాడు. ఆయన సువార్త ప్రకటించిన విధానాన్ని అది ప్రభావితం చేసింది, ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు: “మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.” పౌలు అలా నేర్పుగా మాట్లాడడం అక్కడ హాజరైన కొంతమంది రాజ్య సందేశాన్ని పరిశీలించి, విశ్వాసులుగా తయారయ్యేలా ప్రోత్సహించింది.—అపొ. 17:23, 34.
5 అదేవిధంగా మనం గమనించేవారిగా ఉంటే, అది మనం ఒక వ్యక్తి ఆసక్తిని గుర్తించి మన ప్రతిపాదనను తదనుగుణంగా మలచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. గృహస్థుడు తన అభిప్రాయం వ్యక్తపరిచేందుకు దోహదపడే ప్రశ్నలను ఉపయోగించండి. ఆయన ఆసక్తిని పెంచడానికి ఉపయోగించగల లేఖనాల గురించి ఆలోచించండి. (సామె. 20:5) మనం గమనించేవారిగా ఉండడం, ఇతరులపట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించడం, సువార్తను నైపుణ్యంగా ప్రకటించేందుకు మనకు సహాయం చేస్తాయి.