12వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
బైబిలు అధ్యయనాలను ప్రారంభించి వాటిని నిర్వహించడానికి విద్యార్థులకు సహాయం చేయడం
1 మన బైబిలు విద్యార్థులు క్షేత్రసేవలో భాగం వహించడం ప్రారంభించినప్పుడు, సొంతగా బైబిలు అధ్యయనాలను ప్రారంభించి వాటిని నిర్వహించాలనే ఆలోచన వారిని భయపెట్టవచ్చు. మన పరిచర్యలోని ప్రాముఖ్యమైన ఈ భాగంపట్ల వారు సానుకూల వైఖరిని వృద్ధి చేసుకోవడానికి మనం వారికి ఎలా సహాయం చేయవచ్చు?—మత్త. 24:14; 28:19, 20.
2 ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా అర్హుడైన తర్వాత, బహుశా ఆయన అప్పటికే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి పూర్తి ప్రయోజనం పొందుతుండవచ్చు. విద్యార్థి నియామకాలను సిద్ధపడడంలో, వాటిని అందించడంలో ఆయన పొందే శిక్షణ, “సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను” ఉండడానికి అవసరమైన బోధనా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తుంది.—2 తిమో. 2:15.
3 మీ మాదిరి ద్వారా బోధించండి: యేసు తన శిష్యులకు, స్పష్టమైన ఉపదేశం ఇవ్వడం ద్వారానే కాక మంచి మాదిరిని ఉంచడం ద్వారా కూడా శిక్షణనిచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.” (లూకా 6:40) పరిచర్యలో మంచి మాదిరిగా ఉండడం ద్వారా మీరు యేసును అనుకరించడం చాలా ప్రాముఖ్యం. మీ విద్యార్థి పరిచర్యలో మీ మాదిరిని గమనిస్తున్నప్పుడు, పునర్దర్శనాలు చేయడంలోని ఉద్దేశం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికే అని ఆయన గ్రహిస్తాడు.
4 మనం గృహస్థునికి అధ్యయనాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు సాధారణంగా అధ్యయన ఏర్పాటును విపులంగా చెప్పాల్సిన అవసరంలేదని విద్యార్థికి వివరించండి. సాధారణంగా అధ్యయనం చేసే ప్రచురణ నుండి ఒకటి లేక రెండు పేరాలను ఉపయోగిస్తూ కేవలం అధ్యయనాన్ని ప్రదర్శించడం మంచిది. అలా ప్రదర్శించడానికి ప్రయోజనకరమైన సూచనలను ఈ సంచికలోని 8వ పేజీలో, మన రాజ్య పరిచర్య జనవరి 2002లోని 6వ పేజీలో చూడవచ్చు.
5 సముచితమైనప్పుడు, విద్యార్థి మీతో గానీ మరొక అనుభవజ్ఞుడైన ప్రచారకునితో గానీ ఇతర బైబిలు అధ్యయనాలకు వెళ్లమని చెప్పండి. ఆయన ఒక పేరా మీద గానీ కీలకమైన ఒక లేఖనం మీద గానీ వ్యాఖ్యానించవచ్చు. ఆ విధంగా విద్యార్థి గమనించడం ద్వారా ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం గురించి ఎక్కువగా నేర్చుకుంటాడు. (సామె. 27:17; 2 తిమో. 2:2) ఆయనను మెచ్చుకోండి, ఆయన ఎలా అభివృద్ధి చెందవచ్చో చర్చించండి.
6 దేవుని వాక్య బోధకులయ్యేందుకు క్రొత్త ప్రచారకులకు శిక్షణనివ్వడం, వారు సొంతగా అధ్యయనాలను ప్రారంభించి, వాటిని నిర్వహించే “సత్కార్యమునకు” వారిని సంసిద్ధులను చేస్తుంది. (2 తిమో. 3:16) “ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” అనే ఆహ్వానాన్నివ్వడానికి వారితో కలిసి పని చేయడం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా!—ప్రక. 22:17.