రాజ్యాన్ని ప్రకటించడం—అమూల్యమైన ఒక ఆధిక్యత
1 మానవులు జీవించడానికి యెహోవా ఉదారంగా చేసిన ఏర్పాట్ల నుండి ప్రతీరోజు కోట్లాదిమంది భూనివాసులు ప్రయోజనం పొందుతున్నారు. (మత్త. 5:45) అయితే, కొంతమంది మాత్రమే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా తమ సృష్టికర్తకు కృతజ్ఞత చూపించడమనే సాటిలేని ఆధిక్యతను ఆస్వాదిస్తున్నారు. (మత్త. 24:14) ఈ అమూల్యమైన ఆధిక్యతను మీరెంత ఉన్నతంగా పరిగణిస్తున్నారు?
2 రాజ్యాన్ని ప్రకటించడం దేవుణ్ణి ఘనపరుస్తుంది, అంతేగాక నేటి అల్లకల్లోల పరిస్థితులనుబట్టి కృంగిపోయినవారికి నిరీక్షణనిస్తుంది, సమాధానాన్ని చేకూరుస్తుంది. (హెబ్రీ. 13:15) ఆ సందేశానికి ప్రతిస్పందించేవారికి అది నిత్యజీవ నిరీక్షణనిస్తుంది. (యోహా. 17:3) లోక సంబంధమైన ఏ వృత్తి అలాంటి ప్రయోజనాలను ఇస్తుంది? అపొస్తలుడైన పౌలు తాను పరిచర్యను నెరవేర్చిన విధానం ద్వారా దానిపట్ల తన కృతజ్ఞతను ప్రదర్శించాడు. ఆయన దానిని ఐశ్వర్యంగా దృష్టించాడు.—అపొ. 20:20, 21, 24; 2 కొరిం. 4:1, 7.
3 మన అమూల్యమైన ఆధిక్యతను ఎంతో ఉన్నతమైనదిగా పరిగణించడం: ప్రకటించే ఆధిక్యతపట్ల మన కృతజ్ఞతను కనబరిచే ఒక మార్గం, మన సేవా నాణ్యతను పరిశీలించుకోవడం. మన శ్రోతల హృదయాలను స్పృశించే విధంగా మాట్లాడేలా సిద్ధపడేందుకు మనం సమయం తీసుకుంటున్నామా? లేఖనాలను ఉపయోగిస్తూ, ప్రజలతో తర్కించే విషయంలో నైపుణ్యతను మనం వృద్ధి చేసుకోగలమా? మన నియమిత క్షేత్రంలో సమగ్రంగా సేవ చేస్తున్నామా? బైబిలు అధ్యయనం ఆరంభించి దానిని మనం నిర్వహించగలమా? గత కాలంలోని, ప్రస్తుత కాలంలోని విశ్వసనీయులైన క్రైస్తవుల్లాగే మనం కూడా ఈ సేవా కార్యక్రమంపట్ల సానుకూల దృక్పథంతో పురికొల్పబడడమే కాక, మనకు లభించిన ఈ ఆధిక్యతను విలువైనదిగా పరిగణిస్తాం.—మత్త. 25:14-23.
4 వృద్ధాప్యం, అనారోగ్యం, లేదా ఇతర క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పుడు, పరిచర్యలో భాగం వహించేలా మనం ఆసక్తిగా చేసే ప్రయత్నాలు నిజానికి ఎంతో విలువైనవిగా పరిగణించబడతాయని తెలుసుకోవడం ఓదార్పుకరంగా ఉంటుంది. యెహోవా దేవుని సేవలోని అలాంటి ప్రయత్నాలను, చివరకు అవి ఇతరుల దృష్టికి అంత గొప్పగా అనిపించకపోయినా, ఆయన వాటిని విలువైనవిగా ఎంచుతాడని ఆయన వాక్యం మనకు అభయమిస్తోంది.—లూకా 21:1-4.
5 రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా మనకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. 92 సంవత్సరాల ఒక సహోదరి ఇలా అన్నది: “గత 80 సంవత్సరాలుగా దేవుని సమర్పిత సేవలో గడపడాన్ని నేను గొప్ప ఆధిక్యతగా పరిగణిస్తున్నాను, అలా గడిపినందుకు నేను ఏ మాత్రం విచారించడం లేదు! నేను మళ్ళీ జీవించగలిగితే, మళ్ళీ అదే రీతిలో జీవిస్తాను, నిజంగా, ‘దేవుని కృప జీవముకంటె ఉత్తమము.’” (కీర్త. 63:3) మనం కూడా రాజ్య ప్రకటనా పనిని అంటే దేవుడిచ్చిన ఈ అమూల్యమైన ఆధిక్యతను ఎంతో ఉన్నతమైనదిగా పరిగణించుదుము గాక!