సహనంతో ఉండడానికి ప్రకటనా పని మనకు సహాయం చేస్తుంది
1 “మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో” పరుగెత్తాలని దేవుని వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (హెబ్రీ. 12:1) ఒక పరుగు పందెంలో పరుగెత్తే వ్యక్తికి దానిని విజయవంతంగా ముగించడానికి ఎలాగైతే సహనం అవసరమో, అలాగే మనకు కూడా నిత్యజీవమనే బహుమానం సంపాదించుకోవడానికి సహనం అవసరం. (హెబ్రీ. 10:36) అంతం వరకు సహించేందుకు క్రైస్తవ పరిచర్య మనకు ఎలా సహాయం చేయగలదు?—మత్త. 24:13.
2 మనం ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం: మనం బైబిలులోని నీతియుక్తమైన నూతనలోకానికి సంబంధించిన అద్భుతమైన వాగ్దానం గురించి ప్రకటించడం మన నిరీక్షణను తేజోవంతంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది. (1 థెస్స. 5:8) మనం క్రమంగా క్షేత్ర పరిచర్యలో భాగం వహించినప్పుడు బైబిలు నుండి మనం నేర్చుకున్న సత్యాలను తెలియజేసేందుకు మనకు అవకాశం లభిస్తుంది. మన విశ్వాసాన్ని సమర్థించుకొనే అవకాశం మనకు లభిస్తుంది, తత్ఫలితంగా మనం ఆధ్యాత్మికంగా బలపడేందుకు సహాయం పొందుతాం.
3 మనం ఇతరులకు సమర్థవంతంగా బోధించాలంటే మనం స్వయంగా బైబిలు సత్యాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం పరిశోధన చేయాలి, సమాచారాన్ని ధ్యానించాలి. మనం హృదయపూర్వకంగా కృషి చేస్తే మన జ్ఞానం అధికమవుతుంది, మన విశ్వాసం బలపడుతుంది, ఆధ్యాత్మికంగా మనం పునరుత్తేజితులమవుతాం. (సామె. 2:3-5) కాబట్టి మనం ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు, మనల్ని మనం బలపరచుకుంటాం.—1 తిమో. 4:15, 16.
4 అపవాదికి, దయ్యాలకు వ్యతిరేకంగా, స్థిరంగా నిలబడేందుకు మనకు అవసరమయ్యే ‘దేవుడిచ్చు సర్వాంగకవచములో,’ పరిచర్యలో ఉత్సాహంగా భాగం వహించడం ప్రాముఖ్యమైన భాగంగా ఉంది. (ఎఫె. 6:10-13, 15) మనం పరిచర్యలో నిమగ్నమై ఉండడం ప్రోత్సాహకరమైన విషయాల మీద మన మనస్సు కేంద్రీకరించడానికి, సాతాను లోకం ద్వారా కలుషితమవకుండా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. (కొలొ. 3:2) మనం యెహోవా మార్గాలను ఇతరులకు బోధిస్తున్నప్పుడు, పవిత్రమైన ప్రవర్తనను కాపాడుకోవాల్సిన అవసరం మనకూ ఉందని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయబడతాం.—1 పేతు. 2:12.
5 దేవుని నుండి శక్తిని పొందడం: చివరిగా, మనం ప్రకటనా పనిలో భాగం వహించడం మనం యెహోవా మీద ఆధారపడాలని మనకు బోధిస్తుంది. (2 కొరిం. 4:1, 7) అది ఎంతటి గొప్ప ఆశీర్వాదమో కదా! మనం అలాంటి నమ్మకాన్ని వృద్ధి చేసుకోవడం మనం మన పరిచర్యను పూర్తి చేయడానికే కాక, జీవితంలో మనకు ఎదురవగల ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కూడా మనల్ని సంసిద్ధులను చేస్తుంది. (ఫిలి. 4:11-13) అవును, యెహోవా మీద పూర్తిగా ఆధారపడడం సహించడానికి కీలకం. (కీర్త. 55:22) సహించేందుకు ప్రకటనా పని మనకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది.