10వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
ఇంటింటి పరిచర్యలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం
1 ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అయ్యేందుకు అర్హుడని పెద్దలు నిర్ణయించినప్పుడు, ఆయన సంఘంతో కలిసి బహిరంగ ప్రకటనా పనిలో భాగం వహించడం ప్రారంభించవచ్చు. (యెహోవా చిత్తాన్ని చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలో 78-81 పేజీలు చూడండి.) ఇంటింటా ప్రకటించడమనే లక్ష్యాన్ని చేరుకొనేలా మనం విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?
2 కలిసి సిద్ధపడడం: బాగా సిద్ధపడడానికి ప్రత్యామ్నాయం లేదు. మన రాజ్య పరిచర్యలో, తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో సూచించబడిన ప్రతిపాదనలను ఎక్కడ కనుగొనవచ్చో విద్యార్థికి చూపించి, వాటిలో స్థానిక క్షేత్రానికి ఉపయోగపడే సరళమైన ప్రతిపాదనను ఎంపిక చేసుకొనేందుకు ఆయనకు సహాయం చేయండి. ప్రారంభం నుండి తన పరిచర్యలో బైబిలును ఉపయోగించడానికి ఆయనను ప్రోత్సహించండి.—2 తిమో. 4:2.
3 క్రొత్త ప్రచారకునికి అభ్యాస కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థి పూర్వాభ్యాసం చేస్తున్నప్పుడు క్షేత్రంలో సాధారణంగా ఎదురయ్యే ప్రతిస్పందనలతో నేర్పుగా ఎలా వ్యవహరించాలో ఆయనకు చూపించండి. (కొలొ. 4:6) ఒక గృహస్థుడు లేవనెత్తగల ప్రతీ ప్రశ్నకు క్రైస్తవ ప్రచారకులకు జవాబు తెలిసివుండాల్సిన అవసరం లేదని ఆయనకు నమ్మకం కలిగించండి. సాధారణంగా అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఆ విషయం మీద పరిశోధన చేసి దాని గురించి ఎక్కువగా చర్చించేందుకు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడం మంచిది.—సామె. 15:28.
4 కలిసి ప్రకటించడం: విద్యార్థి మొదటిసారిగా ఇంటింటి పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు మీరిద్దరూ కలిసి సిద్ధపడిన ప్రతిపాదనను మీరు నిర్వహిస్తున్నప్పుడు ఆయనను గమనించనివ్వండి. ఆ తర్వాత ఆయనను మాట్లాడనివ్వండి. కొన్ని సందర్భాలలో క్రొత్త ప్రచారకుడు ప్రతిపాదనలో ఒక లేఖనాన్ని చదివి దాన్ని వ్యాఖ్యానించడం లాంటి చిన్న భాగాల్లో మాత్రమే భాగం వహించడం మంచిది కావచ్చు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోండి. (ఫిలి. 4:5) మీరు ఆయనకు ప్రకటనా పనిలోని వివిధ అంశాల్లో క్రమంగా శిక్షణ ఇస్తున్నప్పుడు ఆయనను తరచూ మెచ్చుకోండి.
5 ఒక క్రొత్త ప్రచారకుడు పరిచర్యలో భాగం వహించడానికి సాధ్యమైతే ప్రతీవారం భాగం వహించడానికి ఒక క్రమమైన పట్టికను ఏర్పరచుకోవడానికి సహాయం చేయడం ప్రాముఖ్యం. (ఫిలి. 3:16) మీరిద్దరూ కలిసి క్షేత్ర సేవలో పనిచేయడానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోండి, ఉత్సాహంగల ఇతరులతో కూడా కలిసి పనిచేయడానికి ఆయనను ప్రోత్సహించండి. వారి మాదిరి, సహవాసం ఆయన తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, ఇంటింటా ప్రకటించడంలో ఆనందించడానికి సహాయం చేస్తుంది.