4వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
సిద్ధపడేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం
1 పాఠాన్ని ముందే చదివి, జవాబులను అండర్లైన్ చేసుకుని, వాటిని తన సొంత మాటల్లో ఎలా వ్యక్తం చేయాలో ఆలోచించే విద్యార్థి సాధారణంగా త్వరితగతిన ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తాడు. కాబట్టి ఒకసారి క్రమమైన అధ్యయనం ప్రారంభమైన తర్వాత, పాఠాన్ని ఎలా సిద్ధపడాలో చూపేందుకు మీ విద్యార్థితో కలిసి ఒక పాఠాన్ని సిద్ధపడండి. చాలామంది విద్యార్థుల విషయంలో మొత్తం అధ్యాయం లేక పాఠం వారితో కలిసి సిద్ధపడడం సహాయకరంగా ఉంటుంది.
2 అండర్లైన్ చేసుకోవడం, మార్జిన్లలో వివరణలు రాసుకోవడం: ముద్రిత ప్రశ్నలకు సూటియైన జవాబులు ఎలా కనుగొనాలో వివరించండి. అధ్యయనం చేస్తున్న ప్రచురణలో కీలకమైన పదాలు లేక పదబంధాలు అండర్లైన్ చేసి ఉన్న మీ ప్రతిని విద్యార్థికి చూపించండి. మీరు సమాచారాన్ని పరిశీలిస్తుండగా, జవాబును గుర్తుతెచ్చుకోవడానికి సహాయం చేసేవాటిని మాత్రమే అండర్లైన్ చేసుకోవడం ద్వారా ఆయన మీ మాదిరిని అనుసరించడానికి ఇష్టపడవచ్చు. (లూకా 6:40) అలా చేసిన తర్వాత ఆయనను సొంత మాటల్లో జవాబివ్వమనండి. అలా చేస్తే ఆయన సమాచారాన్ని ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది.
3 అధ్యయనం కోసం విద్యార్థి సిద్ధపడడంలో, ఎత్తివ్రాయబడని లేఖనాలను శ్రద్ధగా పరిశీలించడం ప్రాముఖ్యమైన భాగం. (అపొ. 17:11) ఉల్లేఖించబడిన ప్రతీ లేఖనం పేరాలోని ఒక అంశాన్ని సమర్థిస్తుందని తెలుసుకొనేందుకు ఆయనకు సహాయం చేయండి. అధ్యయనం చేస్తున్న ప్రచురణలో క్లుప్తమైన వివరణలను తన ప్రతిలోని మార్జిన్లో ఎలా రాసుకోవాలో ఆయనకు చూపించండి. ఆయన నేర్చుకుంటున్న వాటికి బైబిలే ఆధారమనే వాస్తవాన్ని నొక్కి చెప్పండి. అధ్యయనం చేస్తున్నప్పుడు చేసే వ్యాఖ్యానాల్లో ఉల్లేఖించబడిన లేఖనాలను ఎక్కువగా ఉపయోగించమని ఆయనను ప్రోత్సహించండి.
4 సమీక్ష, పునఃసమీక్ష: విద్యార్థి అధ్యయనం చేస్తున్న సమాచారాన్ని అన్ని వివరాలను పరిశీలిస్తూ సంపూర్ణంగా సిద్ధపడడానికి ఆరంభించే ముందు, చర్చాంశాన్ని సమీక్షించడం ఆయనకు సహాయకరంగా ఉంటుంది. శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలను క్లుప్తంగా పరిశీలించడం ద్వారా ఆయన సమాచారాన్ని సమీక్షించవచ్చనే విషయాన్ని నొక్కి చెప్పండి. ఆయన సిద్ధపడడం ముగించే ముందు, పునఃసమీక్షా బాక్సు ఉన్నట్లయితే దానిని ఉపయోగిస్తూ, పాఠంలోని ముఖ్యాంశాలను పునఃసమీక్షించడానికి కొంత సమయాన్ని వెచ్చించడం జ్ఞానయుక్తంగా ఉంటుందని అని వివరించండి. అలా పునఃపరిశీలన చేయడం సమాచారాన్ని గుర్తుంచుకొనేందుకు ఆయనకు సహాయం చేస్తుంది.
5 అధ్యయనం కోసం చక్కగా సిద్ధపడడానికి విద్యార్థికి శిక్షణ ఇవ్వడం, సంఘ కూటాల్లో ఆయన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానాలు ఇచ్చేందుకు ఆయనకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా అది ఆయన వ్యక్తిగత బైబిలు అధ్యయనం ముగించి ఎంతో కాలం గడిచిన తరువాత కూడా ప్రయోజనం చేకూర్చే అధ్యయన అలవాట్లను వృద్ధి చేసుకొనేందుకు ఆయనకు సహాయం చేస్తుంది.