మీ సహాయం అవసరం
1 “మీరు మా అందరికోసం చేసే వాటన్నింటికీ కృతజ్ఞతలు. మీ పని మాకు నిజంగా ప్రయోజనకరమైనది.” ఈ వ్యాఖ్యానం క్రైస్తవ పెద్దలు, పరిచర్య సేవకుల విషయంలో మనకున్న కృతజ్ఞతా భావాలను చక్కగా వ్యక్తం చేస్తోంది. దేవుని సంస్థ విస్తరిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగావున్న దాదాపు 1,00,000 సంఘాలలో పరిణతిచెందిన పురుషులు ఎప్పటికీ అవసరమే. మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరులైతే, మీ సహాయం అవసరం.
2 ‘ముందుకు రావడం’: అదనపు సేవాధిక్యతల కోసం మీరు ఎలా ముందుకు రావచ్చు? (1 తిమో. 3:1, NW) ప్రాథమికంగా మీ జీవితంలోని అన్ని రంగాల్లో మంచి మాదిరిని ఉంచడం ద్వారా మీరు ముందుకు రావచ్చు. (1 తిమో. 4:12; తీతు 2:6-8; 1 పేతు. 5:3) ప్రకటనా పనిలో పూర్తిగా భాగంవహించండి, ఇతరులు కూడా అలా భాగంవహించడానికి సహాయం చేయండి. (2 తిమో. 4:5) తోటి విశ్వాసుల సంక్షేమం గురించి యథార్థమైన ఆసక్తి చూపించండి. (రోమా. 12:13) దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, “బోధనా కళ”ను వృద్ధి చేసుకోండి. (తీతు 1:9, NW; 1 తిమో. 4:13) పెద్దలు మీకు అప్పగించిన నియామకాలను శ్రద్ధతో నిర్వర్తించండి. (1 తిమో. 3:10) మీరు కుటుంబ శిరస్సయితే, ‘యింటివారిని బాగుగా ఏలాలి.’—1 తిమో. 3:4, 5, 12
3 నియుక్త స్థానంలో ఉన్నవారు చేసే సేవలో కష్టపడి పనిచేయడం ఇమిడివుంది, దానికి స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం. (1 తిమో. 5:17) మీరు ముందుకు రావడానికి కృషి చేస్తున్నప్పుడు, ఇతరులకు సేవచేయడంపై మీ దృష్టి కేంద్రీకరించండి. (మత్త. 20:25-28; యోహా. 13:3-5, 12-17) తిమోతి వైఖరిని ధ్యానించండి, ఆయన వైఖరిని అనుకరించడానికి ప్రయత్నించండి. (ఫిలి. 2:20-22) ఆయన మంచి ప్రవర్తన ఆయనను సిఫారసు చేసినట్లుగానే, మీ మంచి ప్రవర్తన మిమ్మల్ని సిఫారసు చేయనివ్వండి. (అపొ. 16:1, 2) అదనపు ఆధిక్యతలను చేపట్టేందుకు మీరు ఆధ్యాత్మిక లక్షణాలను వృద్ధి చేసుకొని, మీ అభివృద్ధికోసం ఇతరులు ఇచ్చే ఏ సలహానైనా అన్వయించుకుంటుండగా, ‘మీ అభివృద్ధి అందరికి తేటగా కనబడుతుంది.’—1 తిమో. 4:15.
4 తల్లిదండ్రులారా, సహాయం చేసేలా చిన్నపిల్లలకు శిక్షణ ఇవ్వండి: పిల్లలు చిన్న వయస్సునుండే సహాయం చేయడం నేర్చుకోవచ్చు. కూటాల్లో అవధానం నిలిపేందుకు, ప్రకటనా పని చేయడానికి, రాజ్య మందిరంలోనూ, పాఠశాలలోనూ వారి ప్రవర్తన మాదిరికరంగా ఉండేందుకు వారికి శిక్షణ ఇవ్వండి. రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడానికి తోడ్పడడం, వయస్సు పైబడినవారికి సహాయం చేయడం లాంటి పనులలో భాగంవహించి ఇతరులకు సేవ చేయడంలో ఎలా సంతోషాన్ని పొందాలో వారికి బోధించండి. ఇవ్వడంవల్ల వచ్చే సంతోషాన్ని వారిని అనుభవించనివ్వండి. (అపొ. 20:35) వారు భవిష్యత్తులో పయినీర్లుగా, పరిచర్య సేవకులుగా, పెద్దలుగా తయారయ్యేందుకు అలాంటి శిక్షణ సహాయం చేయగలదు.