బోధించడానికి చక్కగా సిద్ధపడి ఉండండి
1 మనం ఒక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లయితే, విద్యార్థి యెహోవాను సేవించేలా కదిలించబడాలంటే మనం బైబిలు అధ్యయనానికి చక్కగా సిద్ధపడి వెళ్లాలి. బైబిలు సత్యాలను విలువైనవిగా ఎంచడానికి విద్యార్థికి సహాయం చేస్తే మన ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది. అలా విద్యార్థి తాను నేర్చుకున్నవి పాటించడానికి కదిలించబడతాడు. (ద్వితీ. 6:5; సామె. 4:23; 1 కొరిం. 9:26) అయితే, దీనిని మనమెలా చేయవచ్చు?
2 సిద్ధపడుతున్నప్పుడు ప్రార్థించండి: విద్యార్థి హృదయంలో సత్యం అనే విత్తనం మొలకెత్తేలా చేసేది యెహోవాయే కాబట్టి అధ్యయనానికి సిద్ధపడుతున్నప్పుడు ముఖ్యంగా విద్యార్థి కోసం, ప్రత్యేకంగా ఆయనకు అవసరమైనవాటి కోసం ప్రార్థించడం మంచిది. (1 కొరిం. 3:6; యాకో. 1:5) అలా చేస్తే, యెహోవా చిత్తాన్ని గురించిన ‘సంపూర్ణ జ్ఞానాన్ని’ విద్యార్థి హృదయంలో నాటడానికి మనమింకా ఏమి చేయాలో అర్థం చేసుకోగలుగుతాం.—కొలొ. 1:9, 10.
3 విద్యార్థి గురించి ఆలోచించండి: అర్థమయ్యేలా బోధించాలంటే, వినేవాళ్ల గురించి ఆలోచించాలని యేసుకు తెలుసు. ‘నిత్యజీవానికి వారసుడనవ్వాలంటే నేనేమి చేయాలి?’ అని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సందర్భాల్లో యేసును అడిగారు. ఆ ప్రశ్నకు యేసు రెండు సందర్భాల్లోనూ వేర్వేరు పద్ధతుల్లో జవాబిచ్చాడు. (లూకా 10:25-28; 18:18-20) సిద్ధపడుతున్నప్పుడు మన విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలేమిటో ఆలోచించాలి. ఇవ్వబడిన లేఖనాల్లో వేటిని చదివించాలి? ఎంత భాగాన్ని చర్చించగలుగుతాం? పాఠంలోని ఏ అంశాలు, అర్థం చేసుకోవడానికి లేక అంగీకరించడానికి విద్యార్థికి కష్టంగా ఉండవచ్చు? విద్యార్థి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో ముందుగానే ఊహించగలిగితే, చక్కగా జవాబివ్వడానికి సిద్ధంగా ఉంటాం.
4 చర్చించబోయే భాగాన్ని ముందే చదువుకోండి: ఒక పాఠాన్ని గతంలో ఎంతమందితో చర్చించినా, ఈ విద్యార్థితో అధ్యయనం చేయడం మొదటిసారి. కాబట్టి, మనం విద్యార్థి హృదయాన్ని చేరుకోవాలంటే, ప్రతీసారి చక్కగా సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. అంటే, మన విద్యార్థిని ఏమి చేయమని ప్రోత్సహిస్తామో అదే మనం చేయాలి. విద్యార్థి గురించి ఆలోచిస్తూ పాఠాన్ని, దానిలో ఇవ్వబడిన లేఖనాలను చదివి, ముఖ్యమైన విషయాలను మార్కు చేసుకోండి.—రోమా. 2:21, 22.
5 ప్రతీ బైబిలు విద్యార్థి ప్రగతి విషయంలో యెహోవాకు ఎంతో శ్రద్ధ ఉంది. (2 పేతు. 3:9) ప్రతీసారి బైబిలు అధ్యయనానికి సిద్ధపడేందుకు సమయం వెచ్చిస్తే, యెహోవాలాగే మనకు కూడా విద్యార్థి ప్రగతి విషయంలో నిజమైన శ్రద్ధ ఉందని చూపిస్తాం.
[అధ్యయన ప్రశ్నలు]
1. బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు తాను తెలుసుకున్న సత్యాలను విలువైనవిగా ఎంచేలా విద్యార్థికి సహాయం చేయడానికి ఎందుకు కృషి చేయాలి?
2. అధ్యయనానికి చక్కగా సిద్ధపడేందుకు ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?
3. విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయాలేమిటో ఆలోచిస్తూ ఎలా సిద్ధపడవచ్చు?
4. చక్కగా సిద్ధపడడమంటే ఏమిటి?
5. మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు?