వ్యాపార క్షేత్రంలో ప్రకటించే విధానం
1. వ్యాపార క్షేత్రంలో ప్రకటించడంలోని కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
1 ప్రజలు సాధారణంగా అతిథులను ఆహ్వానించే క్షేత్రంలో, ప్రజలు అందుబాటులో ఉండే క్షేత్రంలో ప్రకటించడం మీకు ఇష్టమా? మీరు మీ సంఘ క్షేత్రంలోనే అలా చేయవచ్చు. ఎలా? మీ క్షేత్రంలోని వ్యాపార స్థలాలను సందర్శించడం ద్వారా. షాపులకెళ్ళి సాక్ష్యమిచ్చే ప్రచారకులు తరచూ సత్ఫలితాలు సాధిస్తారు.
2. వ్యాపార క్షేత్రంలో ప్రకటించడాన్ని ఎలా వ్యవస్థీకరించవచ్చు?
2 కొన్ని సంఘాలకు నియమించబడిన క్షేత్రంలో భాగంగా వ్యాపార క్షేత్రాలు కూడా ఉంటాయి. సంఘ క్షేత్రానికి సంబంధించిన విషయాలు చూసుకునే సహోదరుడు దుకాణాలు ఎక్కువగావుండే ఈ వ్యాపార విభాగాలను సూచిస్తూ ప్రత్యేకమైన మ్యాప్ కార్డులను తయారు చేసుకోవచ్చు. ఆవాసిత క్షేత్ర మ్యాప్ కార్డుల్లో వ్యాపార క్షేత్రాలు కూడా ఉంటే, వ్యాపార క్షేత్రాలను సాధారణ క్షేత్రంలో భాగంగా సందర్శించకూడదని స్పష్టంగా ఆ కార్డులపై సూచించాలి. ఇతర క్షేత్రాల్లో ఇళ్ళను సందర్శించేటప్పుడే ఆ ప్రాంతంలోనేవున్న చిన్న చిన్న దుకాణాల్లో కూడా ప్రకటించవచ్చు. మీరు ఇంతకుముందు ఎప్పుడూ వ్యాపార క్షేత్రంలో ప్రకటించనట్లైతే, కొన్ని చిన్న షాపుల్లో ప్రకటించడం ద్వారా మొదలుపెట్టండి.
3. షాపుల్లో ప్రకటించేటప్పుడు సమర్థవంతంగా సాక్ష్యమివ్వడానికి మనకేమి సహాయం చేస్తుంది?
3 సరళమైన పద్ధతిని ఉపయోగించండి: షాపుల్లో సాక్ష్యమిచ్చేటప్పుడు మీరు రాజ్యమందిరానికి వెళ్ళేటప్పుడు ధరించేలాంటి దుస్తులు ధరించడం ప్రాముఖ్యం. షాపుల్లో ఎక్కువ రద్దీగా లేని సమయాన్ని ఎంచుకోవడం కూడా మంచిది. సాధ్యమైతే, వినియోగదారులు ఎవ్వరూ లేని సమయంలో షాపులోకి వెళ్ళండి. మేనేజర్‌తో గానీ అక్కడి పనిని పర్యవేక్షించే వ్యక్తితో గానీ మాట్లాడాలని చెప్పండి. క్లుప్తంగా సూటిగా మాట్లాడండి. మీరేమి చెప్పవచ్చు?
4-6 షాపులోని వ్యక్తికి లేదా మేనేజర్‌కు సాక్ష్యమిచ్చేటప్పుడు మనమేమి చెప్పవచ్చు?
4 షాపులోని వ్యక్తితో లేదా మేనేజర్‌తో మాట్లాడేటప్పుడు మీరు ఇలా అనవచ్చు: “వ్యాపారస్థులు ఎంతో బిజీగా ఉండడంవల్ల వాళ్ళను ఇంటి దగ్గర కలుసుకోవడం సాధ్యం కావడంలేదు, అందుకే మేము మిమ్మల్ని మీ పని స్థలంలోనే సందర్శిస్తున్నాము. మా పత్రికలు ప్రస్తుత సంఘటనలపై భూవ్యాప్తంగావున్న ప్రజల దృక్కోణాన్ని తెలియజేస్తాయి.” తర్వాత పత్రికలోనుండి ఒక క్లుప్తమైన అంశాన్ని ప్రస్తావించండి.
5 లేదా మీరు ఈ సరళమైన పద్ధతిని ప్రయత్నించవచ్చు: “ప్రజలు తరచూ తమ తప్పేమీ లేకుండానే కష్టాలు అనుభవించడానికి కారణమేమిటి అని మీరెప్పుడైనా ఆలోచించారా? కొందరు చాలా పేద కుటుంబాల్లో జన్మిస్తారు, మరికొందరు విరూపులుగా లేదా అంగవైకల్యంతో జన్మిస్తారు. ఒక వ్యక్తి పూర్వజన్మలో చెడు పనులు చేయడంవల్లనే కష్టాలు అనుభవిస్తాడని చాలామంది అనుకుంటారు. అది నిజమేనంటారా? మానవులు ఇలా కష్టాలు అనుభవించాలనే సృష్టికర్త ఉద్దేశించాడా? ఈ ప్రశ్నలకు ఒప్పింపజేసే సమాధానాలు తెలుసుకోవడానికి ఈ కరపత్రం మీకు సహాయం చేస్తుంది.” అలా చెప్పిన తర్వాత “బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?” అనే కొత్త కరపత్రాన్ని ఇవ్వండి. ఆ వ్యక్తికి బైబిలుపట్ల గౌరవం ఉన్నట్లు కనిపిస్తే, ఆ కరపత్రంలోని 5-6 పేజీల్లోవున్న సముచితమైన లేఖనాలను చూపించండి.
6 షాపు నడిపే వ్యక్తి బిజీగా ఉన్నట్లు కనిపిస్తే మీరు ఒక కరపత్రాన్ని అందించి ఇలా అనవచ్చు: “మీరు బిజీగా లేనప్పుడు నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఈ కరపత్రం గురించి మీ అభిప్రాయమేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.”
7. వ్యాపార క్షేత్రంలో చూపించబడిన ఆసక్తిని మనం ఎలా వృద్ధి చేయవచ్చు?
7 చూపించబడిన ఆసక్తిని వృద్ధిచేయడం: మీరు వ్యాపార క్షేత్రంలో బైబిలు అధ్యయనాన్ని కూడా నిర్వహించవచ్చు. ఒక ప్రత్యేక పయినీరు క్రమంగా ఒక వ్యాపారస్థునికి పత్రికలను ఇచ్చేవాడు. ఆ వ్యక్తి తాను చదువుతున్న విషయాల్లో ఆసక్తి చూపించినప్పుడు ఆ పయినీరు సహోదరుడు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ ఉపయోగించి బైబిలు అధ్యయన ఏర్పాటును ప్రదర్శించాడు. ఆ వ్యక్తి పని స్థలంలోనే అధ్యయనం ప్రారంభించబడింది. పయినీరు ఆ వ్యాపారస్థుని పరిస్థితులను మనస్సులో ఉంచుకొని ప్రతీసారి కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే తీసుకునేవాడు. మనం కూడా అదేవిధంగా వ్యాపార క్షేత్రంలో సాక్ష్యమివ్వడం ద్వారా యోగ్యులైన వారికోసం వెదుకుతూనే ఉందాము.