యేసు మనస్సును అలవరచుకోండి
1. యేసు ఎలాంటి మనస్సును కనబరిచాడు?
1 మనం దేవుని కుమారుణ్ణి చూడకపోయినప్పటికీ, ఆయన జీవితం గురించీ ఆయన పరిచర్య గురించీ వ్రాయబడిన గ్రంథం ద్వారా మనం ఆయన గురించి తెలుసుకున్న దాన్నిబట్టి ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నాం. (1 పేతు. 1:8) ఆయన తన తండ్రికి విధేయత చూపించి, పరలోకంలో తన ఉన్నత స్థానాన్ని వదులుకొని భూమిపైకి వచ్చాడు. ఒక మానవునిగా నిస్వార్థంగా ఇతరులకు పరిచర్య చేశాడు, చివరకు మానవాళి తరఫున తన ప్రాణాలను ఇచ్చాడు. (మత్త. 20:28) దేవుని వాక్యం మనకిలా ఉద్బోధిస్తోంది: “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.” ఆయన చూపించిన స్వయం త్యాగ స్ఫూర్తిని మనమెలా అలవరచుకోవచ్చు?—ఫిలి. 2:5-8.
2. చాలామంది క్రైస్తవులు ఎలాంటి సవాలును ఎదుర్కొంటున్నారు, దాన్ని అధిగమించేందుకు వారికి ఏమి సహాయం చేస్తుంది?
2 అలసటతో ఉన్నప్పుడు: యేసు పరిపూర్ణుడే అయినా, ఆయన కూడా అలసిపోయాడు. ఒక సందర్భంలో ఆయన ‘ప్రయాణమువలన అలసియున్నప్పటికీ’ ఒక సమరయ స్త్రీకి సమగ్రంగా సాక్ష్యమిచ్చాడు. (యోహా. 4:6) చాలామంది క్రైస్తవులు నేడు అలాంటి సవాలునే ఎదుర్కొంటున్నారు. దాదాపు వారమంతా పనిచేసి అలసిపోయి, వారాంతంలో ప్రకటనా పనిలో చురుగ్గా పాల్గొనాలంటే కష్టమవుతుంది. కానీ మనం క్రమంగా పరిచర్యలో పాల్గొన్నట్లయితే, క్రైస్తవ పరిచర్య మనల్ని ఆధ్యాత్మికంగా పునరుత్తేజపరుస్తుంది.—యోహా. 4:32-34.
3. బోధించడంలో యేసు చూపించిన సంసిద్ధతను మనం ఎలా అలవరచుకోవచ్చు?
3 మరొక సందర్భంలో, యేసు ఆయన శిష్యులు కాస్త అలసట తీర్చుకుందామని ఏకాంత ప్రదేశానికి వెళతారు. అయితే ఆ విషయం విన్న ఒక గొప్ప జనసమూహం వారిని కలుసుకునేందుకు పరిగెత్తుకొని వెళుతుంది. దానికి యేసు చిరాకుపడకుండా, “వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప[డం]” ప్రారంభించాడు. (మార్కు 6:30-34) బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి, నిర్వహించడానికి అలాంటి మనస్సే అవసరం. దానికి నిరంతర కృషి, ప్రజల పట్ల యథార్థ ప్రేమ ఉండాలి. ప్రస్తుతం మీరు బైబిలు అధ్యయనం నిర్వహించనట్లయితే, ఒక అధ్యయనం కోసం వెదికే ప్రయత్నాన్ని విరమించుకోకండి.
4. మనం క్రీస్తు మనస్సును అలవరచుకునేందుకు సహాయ పయినీరు సేవ ఎలా సహాయపడగలదు?
4 ఆధ్యాత్మిక విషయాలను మొదట పెట్టండి: మనం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మనసు నిలిపేందుకు సహాయ పయినీరు సేవ సహాయపడగలదు. ఒక యువ సహోదరి ఇలా వ్రాసింది: “నా స్నేహితురాలి వాళ్ళమ్మ తనతో కలిసి ఒక నెల సహాయ పయినీరు సేవ చేయమని తన కూతుర్ని నన్నూ ప్రోత్సహించింది. ఆమెతో కలిసి సేవ చేసినందుకు నేను ఎంతో సంతోషించాను. నేను సహోదర సహోదరీలను మరింత బాగా తెలుసుకున్నందుకు ఆనందించాను, త్వరలోనే వారు నా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. నేను యెహోవా గురించి ఇతరులతో మాట్లాడడానికీ అద్భుతమైన రాజ్య సత్యాలను వారికి నేర్పించడానికీ ఎక్కువ అవకాశాలు పొందినందుకు కూడా ఆనందించాను. ఇవన్నీ నేను యెహోవాకు, ఆయన సంస్థకు మరింత సన్నిహితమైనట్లు భావించేలా చేశాయి.”—కీర్త. 34:8.
5. మనం యేసు మనస్సును అలవరచుకునేందుకు నిరంతరం ఎందుకు కృషి చేయాలి?
5 మన అపరిపూర్ణ శరీరానికీ యెహోవాను సంతోషపెట్టాలనే మన కోరికకూ మధ్య జరిగే పోరాటాన్ని అందరమూ పోరాడాల్సిందే. (రోమా. 7:21-23) కష్టపడి పనిచేయకుండా తప్పించుకునేటువంటి ఈ లోక ధోరణికి మనం దూరంగా ఉండాలి. (మత్త. 16:22, 23) అలా ఉండడంలో మనం విజయం సాధించేందుకు యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేయగలడు. (గల. 5:16, 17) మనం దేవుని నీతియుక్తమైన నూతనలోకంలోకి రక్షింపబడడం కోసం ఎదురుచూస్తూ, రాజ్య సంబంధ విషయాలను, ఇతరుల విషయాలను మన సొంత విషయాలకంటే ముందు ఉంచడం ద్వారా యేసు మనస్సును అలవరచుకొందుము గాక.—మత్త. 6:33; రోమా. 15:1-3.