క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
1. క్రొత్త సేవా సంవత్సరంలో మనమెలాంటి లక్ష్యం గురించి ఆలోచించవచ్చు?
1 మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే లక్ష్యాలను పెట్టుకోవాలి. క్రొత్త సేవా సంవత్సరంలో మీరెలాంటి లక్ష్యాలను పెట్టుకున్నారు? ఓ చక్కని లక్ష్యమేమిటంటే సహాయ పయినీరు సేవను ఒక నెల లేదా అంతకన్నా ఎక్కువ నెలలు చేయడం. ఇది ఆనందించదగ్గ సేవ కాబట్టి సాధారణంగా ముందుగానే ప్రణాళిక వేసుకోవడం అవసరం, దాని గురించి ఆలోచించడానికి ఇదే మంచి సమయం. సహాయ పయినీరు సేవను లక్ష్యంగా పెట్టుకోవడం గురించి ఎందుకు ఆలోచించాలి?
2. సహాయ పయినీరు సేవ చేసేందుకు మనకెలాంటి కారణాలు ఉన్నాయి?
2 సహాయ పయినీరు సేవ చేసేందుకు కారణాలు: పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ద్వారా మన పరలోకపు తండ్రిని “ఇంకా సంపూర్ణంగా” సంతోషపర్చేందుకు ఈ సహాయ పయినీరు సేవ మనకు సహాయం చేస్తుంది. (1 థెస్స. 4:1, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవా మనకు చేసినదానినంతటినీ ఆలోచించినప్పుడు, మనమాయన గురించి ఇతరులకు చెప్పేలా మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుంది. (కీర్త. 34:1, 2) పరిచర్యలో మరింత ఎక్కువగా చేసేందుకు మనం చేసే త్యాగాలను యెహోవా గమనించి, వాటిని విలువైనవిగా ఎంచుతాడు. (హెబ్రీ. 6:10) మనం కష్టపడి పనిచేయడం ద్వారా యెహోవాను సంతోషపెడుతున్నామని తెలుసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది.—1 దిన. 29:9.
3, 4. సహాయ పయినీరు సేవద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?
3 సాధారణంగా, మీరు ఏ పనినైనా ఎక్కువగా చేసినప్పుడు అది మరింత సులభమైనదిగా, ఆనందించదగినదిగా ఉంటుంది. పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ఇంటింటి పరిచర్యలో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మాట్లాడేందుకు తోడ్పడుతుంది. సంభాషణను ప్రారంభించడంలో, బైబిలును ఉపయోగించడంలో మీరు మరింత నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. మీ నమ్మకం గురించి మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే, అంత ఎక్కువగా అది బలపడుతుంది. ఒక్క బైబిలు అధ్యయనాన్ని కూడా నిర్వహించని చాలామంది, సహాయ పయినీరు సేవ చేస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించగలిగారు.
4 ఆధ్యాత్మిక ఉదాసీనత నుండి బయటపడేందుకు అవసరమైన బలాన్ని కూడా సహాయ పయినీరు సేవ ఇవ్వగలదు. ఒకప్పుడు క్రమ పయినీరుగా ఉన్న ఒక సహోదరుడు ఎక్కువ సమయాన్ని తన ఉద్యోగానికే కేటాయిస్తున్నానని గ్రహించి, ఒక నెల సహాయ పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయనిలా చెప్పాడు: “ఆ ఒక్క నెల ఆధ్యాత్మికంగా నన్నెంత బలపర్చిందో నేనే నమ్మలేకపోతున్నాను! సహాయ పయినీరు సేవను క్రమంగా కొనసాగించే ఏర్పాట్లు చేసుకున్నాను, నేను మరోసారి క్రమ పయినీరు అయ్యేందుకు అది నడిపించింది.”
5. న్యూనతా భావాలను మనమెలా అధిగమించవచ్చు?
5 ఆటంకాలను అధిగమించండి: బోధకులకు ఉండాల్సిన నైపుణ్యాలు తమలో లేవని కొందరు సహాయ పయినీరు సేవకు దరఖాస్తు చేయడానికి వెనకంజవేస్తారు. మీరలా వెనకంజవేసేందుకు అదే కారణమైతే, యెహోవా యిర్మీయాకు సహాయం చేసినట్టే మీకూ సహాయం చేయగలడు. (యిర్మీ. 1:6-10) మోషే ‘నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడైనప్పటికీ’ తన చిత్తాన్ని నెరవేర్చేందుకు యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడు. (నిర్గ. 4:10-12) మీలో సామర్థ్యంలేదని మీకనిపిస్తే ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించండి.
6. ఆరోగ్య సమస్యలున్నా లేదా బిజీగా ఉన్నా సహాయ పయినీరు సేవ చేయడం ఎలా సాధ్యమవగలదు?
6 ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల లేదా బిజీగా ఉన్నందువల్ల మీరు సహాయ పయినీరు సేవకు దరఖాస్తు చేయడానికి వెనకంజవేస్తున్నారా? మీకు అనారోగ్యంగా ఉంటే, మీకు అనుకూలమైన రీతిలో సేవచేయడం ద్వారా మీరు సహాయ పయినీరు సేవ చేయవచ్చు. మీరు బిజీగా ఉన్నట్లైతే, మీకు అంతగా ముఖ్యంకాని పనులను తర్వాతి నెలకు వాయిదా వేసుకోవచ్చు. పూర్తికాల ఉద్యోగం చేస్తున్న కొందరు ఒకటి, రెండు రోజులు సెలవు పెట్టడంద్వారా, సహాయ పయినీరు సేవ చేసేలా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు.—కొలొ. 4:5.
7. సహాయ పయినీరు సేవ గురించి ప్రార్థించడం ఎందుకు సహాయకరం?
7 దాన్నెలా చేయాలి: సహాయ పయినీరు సేవ చేయాలనే మీ అభిలాష గురించి ప్రార్థించండి. మీ పరిచర్యను విస్తృతపరుచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాను అడగండి. (రోమా. 12:11, 12) మీ సమయ పట్టికలో సర్దుబాట్లు చేసుకోవడానికి సంబంధించి జ్ఞానయుక్తమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఆయన మీకు సహాయం చేయగలడు. (యాకో. 1:5) మీకలాంటి అభిలాష లేకపోతే, ప్రకటనాపనిలో ఆనందాన్ని కనుగొనేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి.—లూకా 10:1, 17.
8. సామెతలు 15:22 అన్వయించుకోవడం సహాయ పయినీరు సేవ చేయడానికి ఎలా సహాయపడగలదు?
8 సహాయ పయినీరు సేవ లక్ష్యాన్ని గురించి కుటుంబంగా చర్చించండి. (సామె. 15:22) కుటుంబంలోని ఇతరుల మద్దతుతో బహుశా కుటుంబ సభ్యుల్లో ఒకరు సహాయ పయినీరు సేవను చేయవచ్చు. పయినీరు సేవ చేయాలనే మీ అభిలాష గురించి సంఘంలోని ఇతరులతో, ప్రత్యేకంగా మీలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్న వారితో మాట్లాడండి. ఇది సహాయ పయినీరు సేవ చేసేందుకు మరింత ఉత్సాహాన్ని కలిగించవచ్చు.
9. సహాయ పయినీరు సేవ చేసేందుకు మీరు ఏ నెలలను ఎంపిక చేసుకోవచ్చు?
9 మీరు క్రొత్త సేవా సంవత్సరంలో పరిచర్య కోసం వేసుకున్న సమయ పట్టికను సమీక్షిస్తుండగా మీరెప్పుడు సహాయ పయినీరు సేవ చేయగలరని మీకనిపిస్తుంది? మీరు పూర్తికాల ఉద్యోగం చేస్తున్నవారైనా లేదా స్కూలుకు వెళ్తున్నవారైనా సెలవున్న నెలలో లేదా ఐదు శని, ఆదివారాలు ఉన్న నెలల్లో సేవ చేయాలని మీరు కోరుకోవచ్చు. ఉదాహరణకు, సెప్టెంబరు, డిసెంబరు, మార్చి, ఆగస్టు నెలల్లో ఐదు శని, ఆది వారాలున్నాయి. మే నెలలో ఐదు శనివారాలు, జూన్ నెలలో ఐదు ఆదివారాలు ఉన్నాయి. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లైతే, సాధారణంగా మంచి వాతావరణమున్న నెలలో పయినీరు సేవ చేయడం గురించి ఆలోచించండి. ప్రయాణ పైవిచారణకర్త మీ సంఘాన్ని సందర్శించే నెలలో పయినీరు సేవ చేయడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఆయన సందర్శనా వారంలో క్రమ పయినీర్ల కోసం నిర్వహించబడే కూటంలో మొదటి అర్థభాగానికి హాజరయ్యే అవకాశం మీకు దొరుకుతుంది. వచ్చే సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ మార్చి 22న జరుగుతుంది కాబట్టి, మార్చి, ఏప్రిల్, మే నెలలు సహాయ పయినీరు సేవ చేయడానికి అనువుగా ఉంటాయి. మీరు సహాయ పయినీరు సేవ చేయాలనుకునే నెలను లేదా నెలలను ఎంపిక చేసుకున్న తర్వాత, గంటలు పూర్తి చేసేందుకు తోడ్పడే పట్టికను వేసుకోవడం ప్రారంభించండి.
10. సహాయ పయినీరు సేవను చేయలేకపోతే మనమేమి చేయవచ్చు?
10 రాబోయే సేవా సంవత్సరంలో సహాయ పయినీరు సేవ చేయలేరని మీకనిపించినా, మీరు పయినీరు స్ఫూర్తిని కాపాడుకుంటూ ఉండవచ్చు. సేవలో మీ సంపూర్ణ ప్రయత్నం విషయంలో యెహోవా సంతోషిస్తాడనే నమ్మకంతో పరిచర్యలో మీరు చేయగలిగినంత చేస్తూనే ఉండండి. (గల. 6:4) సహాయ పయినీరు సేవ చేయగలిగేవారికి మద్దతునిస్తూ, ప్రోత్సహించండి. పయినీరు సేవ చేసేవారితో వారంలో అదనంగా ఒకరోజు పరిచర్యలో పాల్గొనేందుకు బహుశా మీ సమయపట్టికలో సర్దుబాట్లు చేసుకోవచ్చు.
11. అత్యవసర భావాన్ని మనమెందుకు కలిగివుండాలి?
11 యెహోవా ప్రజలకు అత్యవసర భావముంది. సువార్త ప్రకటించే పనిని పూర్తిచేయాల్సిన బాధ్యత వారికుంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, సమయం కొద్దిగానే మిగిలివుంది. (1 కొరిం. 7:29-31) దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమ, పరిచర్యలో మనం చేయగలిగినంత చేసేందుకు మనలను పురికొల్పుతాయి. కృషితో, మంచి ప్రణాళికతో, క్రొత్త సేవా సంవత్సరంలో కనీసం ఒక్క నెలైనా మనం సహాయ పయినీరు సేవ చేయగలుగుతాం. నిజానికది ఒక చక్కని లక్ష్యం!