యెహోవా అపేక్షించేవాటిని మనం చేయగలం
1. కొన్నిసార్లు మనం ఎలాంటి భావాలతో పోరాడవలసిరావచ్చు, దానికి కారణమేమిటి?
1 యెహోవా నియమాలకు, సూత్రాలకు విధేయంగా ఉండడమే నేటి జీవితానికి శ్రేష్ఠమైన విధానం. అది మన నిత్య భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవడానికి దోహదపడుతుంది. (కీర్త. 19:7-11; 1 తిమో. 6:18) అయితే సాతాను లోకం మనపై చాలా ఒత్తిడి తెస్తుంది. మన అపరిపూర్ణ శరీరం కూడా ఆ సవాలును జటిలం చేస్తుంది. లేఖనాధారమైన మన బాధ్యతలను నెరవేర్చడంలో కొన్నిసార్లు మనం నిస్సత్తువతో అణగారిపోయినట్లు భావిస్తాం. (కీర్త. 40:12; 55:1-8) చివరకు మనం యెహోవా మననుండి అపేక్షిస్తున్నవన్నీ చేయగలమా అని కూడా సందేహించవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం మన ఆధ్యాత్మిక సమతుల్యతను కాపాడుకోవడానికి ఏమి సహాయం చేయగలదు?
2. మననుంచి ఆశించేదాని విషయంలో యెహోవా ఎలా సమంజసంగా ఉన్నాడు?
2 యెహోవా ఆజ్ఞలు భారమైనవి కావు: యెహోవా అసమంజసంగా మనం భరించలేనివాటిని ఎన్నడూ మోపడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అవి మన మంచి కొరకే. (ద్వితీ. 10:12, 13; 1 యోహా. 5:3) ఆయన మన బలహీనతలను పరిగణలోకి తీసుకుంటాడు, “మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్త. 103:13, 14) మనం ఆయనను సేవించడానికి చేసే మంచి ప్రయత్నాలను ఆయన కరుణతో అంగీకరిస్తాడు, ఆ ప్రయత్నాలు మన పరిస్థితుల కారణంగా పరిమితమైనవైనా సరే ఆయన అంగీకరిస్తాడు. (లేవీ. 5:7, 11; మార్కు 14:8) ఆయన మన భారములను తనమీద మోపుమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనం విశ్వసనీయంగా ఉండడాన్ని సాధ్యం చేస్తానని కూడా ఆయన మనకు హామీ ఇస్తున్నాడు.—కీర్త. 55:22; 1 కొరిం. 10:13.
3. సహించడానికి యెహోవా మనల్ని ఎలా బలపరుస్తాడు?
3 సహనం అవసరం: తమ యథార్థతను కాపాడుకున్న ఏలియా, యిర్మీయా, పౌలు వంటివారి బైబిలు వృత్తాంతాలు మనకు సహనం అవసరమని చూపిస్తున్నాయి. (హెబ్రీ. 10:36) వారు శ్రమలకు, నిరుత్సాహానికి గురైన సమయాల్లో యెహోవా వారికి ఆసరాగా నిలిచాడు. (1 రాజు. 19:14-18; యిర్మీ. 20:7-11; 2 కొరిం. 1:8-11) ఆధునిక కాలాల్లోని మన సహోదరుల విశ్వసనీయత ద్వారా మనం పురికొల్పబడ్డాం. (1 పేతు. 5:9) అలాంటి మాదిర్లను ధ్యానించడం స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు మనకు సహాయపడగలదు.
4. దేవుని వాగ్దానాలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
4 దేవుని వాగ్దానాలపై ఉన్న నిరీక్షణ “ఆత్మకు లంగరు” వంటిది. (హెబ్రీ. 6:19) ఆ నిరీక్షణ తమ ఇల్లు వదిలి ‘వాగ్దత్తదేశములో పరవాసులుగా ఉండాలి’ అని యెహోవా కోరినదాన్ని అంగీకరించేందుకు అబ్రాహాము, శారాలను పురికొల్పింది. ఆ నిరీక్షణే నిర్భయంగా సత్యారాధన కోసం నిలబడేలా మోషేను బలపరచింది. ఆ నిరీక్షణే హింసాకొయ్యను సహించడానికి యేసుకు బలమిచ్చింది. (హెబ్రీ. 11:8-10, 13, 24-26; 12:1-3) నీతియుక్తమైన నూతనలోకపు దేవుని వాగ్దానమును మన హృదయాల్లో సజీవంగా ఉంచుకోవడం కూడా స్థిరంగా ఉండేందుకు మనకు దోహదపడుతుంది.—2 పేతు. 3:11-13.
5. గతంలో మనం చేసిన విశ్వసనీయ క్రియలను జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ప్రోత్సాహకరంగా ఉండగలదు?
5 గతంలో మనం విశ్వసనీయంగా, స్వయం త్యాగపూర్వకంగా, ధైర్యంగా చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకోవడం కూడా మన సేవలో మనల్ని బలపరచగలదు. (హెబ్రీ. 10:32-34) గతంలో మనం యెహోవా అడిగిన దాన్ని చేసినప్పుడు అంటే పూర్ణాత్మ భక్తిని ప్రదర్శించినప్పుడు మనం పొందిన సంతోషాన్ని అది జ్ఞాపకం చేస్తుంది.—మత్త. 22:37.