‘సరైన మానసిక వైఖరిగల’ వారికి సహాయం చేయండి
1. మన కాలంలో యెహోవా తనకోసం ఎవరిని సమకూరుస్తున్నాడు?
1 ప్రతీ వ్యక్తికి తన అలంకారిక హృదయంలో వేళ్లూనుకున్న స్వభావం ఉంటుంది. (మత్త. 12:35) “హృదయములో కలహమున్న” వారి గురించి బైబిలు మాట్లాడుతోంది. (కీర్త. 55:21) అయితే ‘నిత్యజీవంపట్ల సరైన మానసిక వైఖరిగల’వారు కూడా ఉన్నారు. (అపొ. 13:48, NW) మనకాలంలో, యెహోవా అలాంటి సరైన మానసిక వైఖరిగల వారిని తనకోసం సమకూరుస్తున్నాడు. (హగ్గ. 2:7) వారు యెహోవా ఆరాధకులయ్యేందుకు మనం వారికెలా సహాయం చేయవచ్చు?
2. శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞ నెరవేర్చడంలో ఏమి ఇమిడివుంది?
2 మనస్సాక్షిపూర్వకంగా పునర్దర్శించండి: శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞ నెరవేర్చడానికి, పునర్దర్శనాలు చేయడంపట్ల సరైన దృక్కోణం ఉండడం ఆవశ్యకం. (మత్త. 28:19, 20) ఆసక్తిచూపిన వారిలో మనం పట్టుదలగా ఆసక్తి పెంపొందిస్తామా? సాహిత్యాలు అంగీకరించిన లేదా సువార్తలో ఆసక్తి వ్యక్తంచేసిన వారందరిని మనం తిరిగి సందర్శిస్తామా? ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారికి సహాయంచేసేందుకు మనం గట్టిగా ప్రయత్నిస్తామా? ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి, కనబడ్డ ఆసక్తిని వృద్ధిచేయడానికి మనం ప్రయత్నించాలి.
3. పరిచర్యలో ఎవరితోనైనా సంభాషించిన తర్వాత మనమేమి చేయాలి?
3 ఆసక్తిచూపిన వ్యక్తితో మనం చేసిన సంభాషణ మదిలో ఇంకా తాజాగా ఉన్నప్పుడే, అతని పేరు చిరునామా వ్రాసుకోవడానికి కాస్త సమయం తీసుకోండి. చర్చించిన అంశాన్ని, చదివిన లేఖనాలను, అందించిన సాహిత్యాన్ని క్లుప్తంగా వ్రాసి పెట్టుకోండి. ఆ తర్వాత, సాధ్యమైనంత త్వరగా తిరిగి వెళ్ళడం మాత్రం మరచిపోకండి.
4. ఫలవంతమైన పునర్దర్శనాలు మనమెలా చేయవచ్చు?
4 పునర్దర్శనం చేయడం: మీరు పునర్దర్శించేటప్పుడు, ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా ఉంటూ గృహస్థులపట్ల నిష్కపటమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించండి. సరళంగా, లేఖనసహితంగా చర్చించండి. చర్చించడానికి ఆకర్షణీయమైన బైబిలు అంశం సిద్ధం చేసుకోండి, సందర్శన ముగింపులో తర్వాతి సందర్శనంలో జవాబివ్వగల ఓ ప్రశ్నను ప్రస్తావించండి. గృహస్థులు వ్యక్తంచేసే లేఖనరహిత దృక్కోణాలతో అనవసరంగా తలపడకపోవడం ఉత్తమం. పరస్పర అంగీకారమున్న లేఖన సత్యాలపై సంభాషణ వృద్ధిచేయడానికి కృషిచేయండి.—కొలొ. 4:6.
5. ఒక పయినీరు ఏ ప్రయత్నం చేశాడు, ఫలితాలెలా ఉన్నాయి?
5 పునర్దర్శనాలు చేయడానికి కృషి అవసరం, అయితే ఫలితాలు మాత్రం సంతృప్తికరంగా ఉంటాయి. జపానులో ఒక పయినీరు ప్రతీనెల ఎక్కువ పునర్దర్శనాలు చేయాలని గురి పెట్టుకున్నాడు. ఇంటింటి సేవలో తను కలుసుకున్న వారందరి వివరాలు వ్రాసిపెట్టుకోవడం మొదలుపెట్టి, వారంలోపే వారందరిని మళ్లీ కలిశాడు. తాను ఏమి చెప్పాలనేది ఆయన సమగ్రంగా సిద్ధపడి తన సందేశంలో పూర్తిగా నమ్మకముంచి పరిచర్యను కొనసాగించాడు. ఒక సందర్శనంలో ఆయన “నేను ఎన్నోసార్లు మిమ్మల్ని త్రోసిపుచ్చాను. మీరుచెప్పేది నేను వినడం ఇదే మొదటిసారి” అని చెప్పిన వ్యక్తితో అధ్యయనం ప్రారంభించగలిగాడు. ఆ పయినీరు ప్రేమపూర్వక పట్టుదల ఫలితాలు సాధించింది. ఆ నెలాఖరుకల్లా ఆయన పది బైబిలు అధ్యయనాలు రిపోర్టుచేశాడు.
6. మనం పునర్దర్శనాలు పట్టుదలగా ఎందుకు చేయాలి?
6 ప్రజల పరిస్థితులు నిరంతరం మారుతున్నాయి. (1 కొరిం. 7:31) ఆసక్తిగల ఒక వ్యక్తిని ఇంటి దగ్గర మళ్లీ కలుసుకోవడానికి తరచూ చాలాసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. మనస్సాక్షిపూర్వకంగా పునర్దర్శనాలు చేయడం ద్వారా సరైన మానసిక వైఖరిగల వారు నిత్యజీవ మార్గంలోకి రావడానికి మనం సహాయం చేయగలుగుతాము.—మత్త. 7:13, 14.