సిద్ధపాటు—సమర్థవంతంగా పునర్దర్శనాలు చేయడానికి కీలకం
1 యేసు తన శిష్యులకు, “రాజ్యమును గూర్చిన సువార్తను” సమర్థవంతంగా ప్రకటించడానికి వారిని బాగా సిద్ధంచేశాడు. (మత్త. 4:23; 9:35) ఆయన పాలస్తీనాలో ఉన్నప్పుడే శిక్షణనిచ్చాడు. అయితే, యేసు పరలోకానికి ఆరోహణమవడానికి ముందు, ‘సమస్త జనులను శిష్యులనుగా చేయడానికి’ వీలుగా క్రైస్తవ పరిచర్య విస్తృతంగా వ్యాప్తిచేయబడుతుందని ముందే తెలియజేశాడు.—మత్త. 28:19, 20.
2 ఆ పనిలో భాగంగా మనం దేవుని రాజ్య సువార్తపట్ల ఆసక్తి చూపించిన వ్యక్తులను తిరిగి కలుసుకొని, క్రీస్తు ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ గైకొనేలా వారికి బోధించాలి. అలా సమర్థవంతంగా పునర్దర్శనాలు చేయాలంటే ముందు మనం బాగా సిద్ధపడాలి.
3 ముందే సిద్ధపడండి: కొందరు ప్రచారకులు గృహస్థులను మొదటిసారి కలిసి, తిరిగి వచ్చేసేముందు ఒక ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తారు, మళ్ళీ వచ్చి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తామని మాటిస్తారు. గృహస్థులను తిరిగి కలుసుకున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి సమాధానాలు ఇవ్వడంద్వారా నేరుగా బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించవచ్చని వారు తెలుసుకున్నారు.
4 మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఒక పత్రిక వస్తుంది కాబట్టి, దానిని ఇచ్చిన తర్వాత వారిని తిరిగి కలుసుకోవడానికి మళ్ళీ కొత్త పత్రిక వచ్చేంతవరకు ఆగవలసిన అవసరం లేదు. గృహస్థుని దగ్గర అప్పటికేవున్న పత్రికలోని సమాచారాన్ని చర్చించడంద్వారా మనం అతని ఆసక్తిని అధికం చేయవచ్చు. క్షేత్రంలో ఎదురవుతున్న వ్యతిరేకత దృష్ట్యా, ప్రజల్లో మతసంబంధంగావున్న బలమైన భావాల దృష్ట్యా, మనం తిరిగి వెళ్ళేటప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండడం, అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం.
5 ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి: తిరిగి వెళ్ళేముందు, మీరు వ్రాసుకున్న ఇంటింటి పరిచర్య రికార్డులను పరిశీలించుకొని, మీ లక్ష్యమేమిటో నిశ్చయించుకోవడానికి కొన్ని నిమిషాలు వెచ్చించండి. ఉదాహరణకు, మీరు అంతకుముందు ఇచ్చిన ప్రచురణలోనుండి ఒక అంశాన్ని చర్చించండి. లేదా క్రితం కలిసినప్పుడు మీరు చర్చించిన విషయానికి సంబంధించిన అదనపు సాహిత్యాన్నివ్వండి. క్రితంసారి మీరేదైనా ప్రశ్నను లేవదీస్తే, దానికి సమాధానం ఇవ్వాలన్నదే ఖచ్చితంగా మీ లక్ష్యమైవుంటుంది. మీరు చెబుతున్న విషయాన్ని బలపర్చే ఒక లేఖనాన్ని చూపిస్తున్నప్పుడు బైబిలు నుండే నేరుగా చదవడానికి ప్రయత్నించండి.
6 మన లక్ష్యం: ఒక బైబిలు అధ్యయనం ప్రారంభించడమే మన లక్ష్యం. ఒక సహోదరుడు రెండవసారి కలిసిన వ్యక్తికి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించాడు, కానీ ఆ వ్యక్తి దానికి అంగీకరించలేదు. అయితే సహోదరుడు కొత్త పత్రికలను తీసుకువెళ్ళి ఆయనతో ఇలా చెప్పాడు, “ఇవాళ మేమిక్కడ ప్రజలకు ఒక బైబిలు ప్రశ్నకు సమాధానమిస్తున్నాం.” ఆ విషయం గురించి ఆ వ్యక్తి చెప్పినదాన్ని విన్న తర్వాత సహోదరుడు ఒక లేఖనాన్ని చదివి, బైబిలు అధ్యయనాలకు ఉపయోగించే ఒక ప్రచురణలోనుండి దానికి అన్వయించే ఒక పేరాను చదివి వినిపించాడు. అది క్రమ బైబిలు అధ్యయనానికి దారితీసింది.
7 గృహస్థులను తిరిగి కలుసుకోవడానికి సిద్ధపడేందుకు సమయాన్ని వెచ్చించడం మన శ్రమకు తగిన ఫలితాన్నిస్తుంది. మన సంతోషం అధికమవుతుంది. అంతేకాక, “సరైన మానసిక వైఖరిగల” ఒక వ్యక్తి జీవ మార్గంలోకి వచ్చేందుకు ఆయనకు సహాయం చేసే ఆధిక్యత మనకు లభించవచ్చు.—అపొ. 13:48, NW.
[అధ్యయన ప్రశ్నలు]
1. తొలి క్రైస్తవ పరిచర్య ఎలా వ్యాప్తిచెందింది?
2. ‘శిష్యులను చేయమని’ యేసు ఇచ్చిన ఆజ్ఞను గైకొనడానికి మనమేమి చేయాలి?
3. మొదటిసారి కలుసుకుంటున్నా, వారి దగ్గరకు మళ్ళీ వెళ్ళేందుకు ఎలా ఏర్పాట్లు చేసుకోవచ్చు?
4. గృహస్థులను తిరిగి కలుసుకోవడానికి మళ్ళీ కొత్త పత్రిక వచ్చేంతవరకు ఎందుకు ఆగవలసిన అవసరం లేదు?
5. ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి?
6. గృహస్థులను తిరిగి కలుసుకునేటప్పుడు మన లక్ష్యమేమిటి?
7. మీరు ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి, బాగా సిద్ధపడడం ఎలా సహాయపడింది?