“జ్యోతులవలె” ప్రకాశిస్తున్నారు
1 ఆధ్యాత్మికంగాను, నైతికంగాను అంధకారంలోవున్న ప్రస్తుత విధానంలో ప్రపంచవ్యాప్తంగా 234 దేశాల్లో సత్య దేవుడైన యెహోవాను ఆరాధించే 60 లక్షలమంది “జ్యోతులవలె” ప్రకాశిస్తున్నారు. (ఫిలి. 2:14-16) అది మనం ప్రత్యేకంగా కనబడేలా చేస్తోంది. అయితే యెహోవా నుండి వచ్చే విలువైన సత్యపు వెలుగును మనమెలా ప్రతిఫలింపజేస్తాము?—2 కొరిం. 3:18.
2 మన చర్యలు: ప్రజలు మన ప్రవర్తననువెంటనే గమనిస్తారు. (1 పేతు. 2:12) ఒక స్త్రీ, తనతోపాటు పనిచేసే యెహోవాసాక్షి ప్రేమపూర్వకంగా, సహాయకరంగా ఉంటాడని, అసభ్యకరమైన భాషను ఉపయోగించడని, అశ్లీలమైన హాస్యోక్తులకు నవ్వడని గమనించింది. ఇతరులు ఆ సాక్షి సమక్షంలో అసభ్యకరమైన భాషను ఉపయోగించి ఆయనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పటికీ సరైనదాని విషయంలో స్థిరంగా ఉన్నాడు. అది ఆ స్త్రీని ఎలా ప్రభావితం చేసింది? ఆమె ఇలా గుర్తు చేసుకుంటోంది: “ఆయన ప్రవర్తన వల్ల నేను ఎంతగా ప్రభావితురాలినయ్యానంటే, నేను బైబిలు గురించి ప్రశ్నలు అడగడం ప్రారంభించాను. అలా నేను దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించి ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాను. యెహోవాసాక్షుల నమ్మకాలను పరిశీలించడానికి నన్ను పురికొల్పింది ఆయన ప్రవర్తనే” అని ఆమె చెబుతోంది.
3 అధికారంలో ఉన్నవారి పట్ల మన వైఖరి, లోకసంబంధమైన ఆచారాల పట్ల మన దృక్కోణం, ఆరోగ్యకరమైన మన మాటలు, బైబిలు ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండే ప్రజలుగా యెహోవాసాక్షులు ప్రత్యేకంగా కనబడేలా చేస్తాయి. అలాంటి సత్క్రియలు యెహోవాకు ఘనతను తెచ్చి, ఇతరులను ఆయన ఆరాధన వైపుకు ఆకర్షిస్తాయి.
4 మన మాటలు: మన మంచి ప్రవర్తనను చూసే ప్రజలతో మనం మన నమ్మకాల గురించి మాట్లాడకపోతే, మనం ఎందుకు ఇతరుల నుండి భిన్నంగా ఉన్నామో వారు తెలుసుకోలేరు. మీ తోటి ఉద్యోగులకు లేదా విద్యార్థులకు మీరు ఒక యెహోవాసాక్షి అని తెలుసా? మీరు సాధారణంగా ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు సాక్ష్యమివ్వడానికి అవకాశాల కోసం వెదకుతారా? సముచితమైన ప్రతీ సందర్భంలోనూ ‘మనుష్యుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయాలని’ మీరు తీర్మానించుకున్నారా?—మత్త. 5:14-16.
5 వెలుగు ప్రకాశకులుగా మనకివ్వబడిన పనిని నెరవేర్చడానికి స్వయంత్యాగ స్ఫూర్తి ఉండాలి. పూర్ణ హృదయంతో సేవ చేయాలన్న మన దృక్పథం, ప్రాణాలను కాపాడే ప్రకటనా పనిలో శిష్యులను చేసే పనిలో సాధ్యమైనంత ఎక్కువగా భాగం వహించేందుకు వీలుగా అంత ప్రాముఖ్యం కాని విషయాలను విడిచిపెట్టడానికి మనలను కదిలిస్తుంది.—2 కొరిం. 12:15.
6 మన చర్యల ద్వారా, మాటల ద్వారా మనం జ్యోతులవలె ప్రకాశించడంలో కొనసాగుదాం. మనమలా చేస్తే, యెహోవాకు ఘనతనివ్వడంలో మనతోపాటు కలవడానికి ఇతరులు ప్రేరేపించబడవచ్చు.