అంతం సమీపిస్తుండగా స్వస్థ బుద్ధిగలవారై ఉండండి
1 యెహోవా దినము “దొంగవచ్చినట్లు”—హఠాత్తుగా, ఒక్కసారిగా, నిశ్శబ్దంగా వస్తుందని దేవుని వాక్యం పదే పదే వర్ణిస్తోంది. (2 పేతు. 3:10; మత్త. 24:43; 1 థెస్స. 5:2; ప్రక. 3:3; 16:15, 16) “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి” అని యేసు చెప్పాడు. (మత్త. 24:44) అంతం సమీపిస్తుండగా మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఎలా ఉండవచ్చు? అలా మెలకువగా ఉండడానికి కీలకమైన విషయాన్ని ఈ ప్రేరేపిత ఉద్బోధ తెలియజేస్తోంది: “స్వస్థ బుద్ధిగలవారై . . . ఉండుడి.”—1 పేతు. 4:7.
2 స్వస్థ బుద్ధిగలవారై ఉండాలంటే, విషయాలను యెహోవా దృక్కోణం నుండి చూడాలి. (ఎఫె. 5:17) ఈ ప్రస్తుత విధానంలో మనల్ని మనం “పరదేశులుగా యాత్రికులుగా” పరిగణించుకోవడానికి అది సహాయపడుతుంది. (1 పేతు. 2:11) నిజంగా ప్రాముఖ్యమైనదేదో గ్రహించడానికి, ప్రాధాన్యతలను ఏర్పరచుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.—ఫిలి. 1:9-11.
3 ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకోండి: ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని సాధించడం, మనం స్వస్థ బుద్ధిగలవారమై ఉండడానికి సహాయం చేస్తాయి. మీరు ప్రస్తుతం సాధించడానికి ప్రయత్నిస్తున్న ఆధ్యాత్మిక లక్ష్యాలు మీకు ఉన్నాయా? మీరు ప్రతిరోజు బైబిలు చదవడానికి, క్రైస్తవ కూటాలన్నింటికి హాజరవడానికి, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ప్రతీ సంచికను చదవడానికి లేదా పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడానికి కృషి చేస్తున్నారా? తగిన లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తూ, మీ కృషిని ఆశీర్వదించమని యెహోవాను అడిగితే వచ్చే ప్రతిఫలాలను చూసి మీరు ఆశ్చర్యపోతుండవచ్చు.
4 యౌవనస్థులైన ఒక వివాహిత జంటను వారి ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటో చెప్పమని ఒక పెద్ద అడిగాడు. ఆ ప్రశ్న, వారు తమ జీవితాన్ని సరళం చేసుకొని భారంగా ఉన్న అప్పులను తీర్చుకుంటే తమకు పయినీరు సేవ చేసే అవకాశముంటుందని వారు గ్రహించేలా చేసింది. వారు దాన్ని తమ లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు కష్టపడి తమ అప్పులను తీర్చుకొని, తమ సమయాన్ని శక్తిని హరించివేస్తున్న అనవసరమైన కార్యకలాపాలను తగ్గించుకోవడానికి మార్గాలను కనుగొన్నారు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత వారు తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. దాని ఫలితం ఏమిటి? ఆ భర్త ఇలా చెబుతున్నాడు: “లక్ష్యాలను ఏర్పరచుకోకపోయి ఉంటే నేడు మేము ఈ స్థానంలో ఉండేవాళ్ళం కాదు. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. మా జీవితం మరింత ప్రశాంతంగా, మరింత మెరుగ్గా ఉంది. మా జీవితానికి నిజమైన అర్థం, సంకల్పం ఉన్నాయి.”
5 యెహోవా దినము కోసం ఎదురుచూస్తుండగా, మనం దేవుని చిత్తాన్ని చేయడంపై అవధానాన్ని నిలుపుతూ స్వస్థ బుద్ధిగలవారమై ఉండడం ద్వారా ఆధ్యాత్మింగా మెలకువగా ఉందుము గాక!—తీతు 2:11-13.