మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు?
1. చాలామంది యౌవన క్రైస్తవులకు ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలున్నాయి?
1 యెహోవాపట్ల మీకున్న ప్రేమ, “రాజ్యమును మొదట వెదకుడి” అని యేసు క్రైస్తవులందరికీ చెప్పిన మాటలు యౌవన క్రైస్తవులుగా మీ జీవిత లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాయనడంలో సందేహంలేదు. (మత్త. 6:33) పయినీరు సేవచేయడం ద్వారా మీ పరిచర్యను విస్తృతపరచుకోవడం లేదా రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేయడం మీ లక్ష్యం కావచ్చు. రాజ్యమందిర నిర్మాణపనిలో స్వచ్ఛందంగా సేవ చేయాలని, బ్రాంచీలో సేవ చేయాలని, లేదా మిషనరీగా సేవచేయాలని కొంతమంది అనుకుంటుండవచ్చు. అవి నిజంగా ఎంత సంతృప్తికరమైన, ప్రశంసించదగ్గ లక్ష్యాలోకదా!
2. మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి మీకు ఏవి సహాయం చేయగలవు?
2 మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడానికి ఒక సహాయకం వాటిని వ్రాసిపెట్టుకోవడమే. కావలికోట జూలై 15, 2004 ఇలా చెబుతోంది: “ఒక అస్పష్టమైన తలంపును [మీరు] పదాల్లో వ్యక్తం చేసినప్పుడు స్పష్టంగా తయారై ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. [మీరు] లక్ష్యాలను, వాటిని చేరుకోవడానికి వేసుకునే ప్రణాళికలను వ్రాసిపెట్టుకోవాలని కోరుకోవచ్చు.” అంతేగాక, స్పల్పకాల లక్ష్యాలు పెట్టుకోవడం మీ అభివృద్ధిని అంచనా వేసుకోవడానికి దీర్ఘకాలిక లక్ష్యం కోసం కృషి చేస్తున్నప్పుడు దానిపై దృష్టి కేంద్రీకరించడానికి సహాయం చేస్తుంది.
3. బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులయ్యేందుకు ఒక వ్యక్తికి సహాయం చేసే కొన్ని స్వల్పకాల లక్ష్యాలు ఏవి?
3 స్వల్పకాల లక్ష్యాలు: మీరు ఇంకా బాప్తిస్మం తీసుకోనట్లయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరేమి చేయాలో ఆలోచించండి. మీరు ప్రాథమిక బైబిలు బోధలను బాగా అర్థం చేసుకోవాల్సి ఉండవచ్చు. అలాంటప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్నంతటినీ లోతుగా అధ్యయనం చేసి, ఉదాహరించబడ్డ లేఖనాలన్నీ తెరిచి చూసే లక్ష్యం పెట్టుకోండి. (1 తిమో. 4:15) బెతెల్ సభ్యులకు, గిలియడ్ విద్యార్థులకు ఆదికాండము నుండి ప్రకటన వరకు తప్పనిసరిగా పూర్తి బైబిలు చదవాల్సిన అవసరత ఉన్నట్లుగానే మీరు కూడా పూర్తి బైబిలు చదివే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత, క్రమంగా ప్రతీరోజు బైబిలు చదివే కార్యక్రమాన్ని పాటించండి. (కీర్త. 1:2, 3) అది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగా దోహదపడుతుందో ఊహించండి! బైబిలు చదువుతున్న, అధ్యయనం చేస్తున్న ప్రతీసారి హృదయపూర్వక ప్రార్థనతో ప్రారంభించి ముగించండి, మీరు నేర్చుకున్నవాటిని అన్వయించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి.—యాకో. 1:25.
4. బెతెల్ సేవ లేదా మిషనరీ సేవచేయాలనే దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న క్రైస్తవుడు ఎలాంటి స్వల్పకాల లక్ష్యాలను పెట్టుకోవచ్చు?
4 మీరు ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నట్లయితే, ఇంకా ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోవచ్చు? ప్రకటనాపనిలో మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఉదాహరణకు, క్షేత్రపరిచర్యలో దేవుని వాక్యాన్ని మరింత నైపుణ్యవంతంగా ఉపయోగించడాన్ని మీ లక్ష్యంగా చేసుకోగలరా? (2 తిమో. 2:15) మీ పరిచర్యను ఎలా విస్తృతపరచుకోవచ్చు? మీ వయసుకు, పరిస్థితులకు తగ్గట్టు నిర్దిష్టమైన స్వల్పకాల లక్ష్యాలు పెట్టుకోండి, మీరు పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి అవి సహాయం చేస్తాయి.
5. బెతెల్లో సేవ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వల్పకాల లక్ష్యాలను పెట్టుకోవడం ఒక సహోదరుడికి ఎలా సహాయం చేసింది?
5 విజయవంతమైన కథ: టోనీ 19 ఏండ్ల వయసులో యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, బెతెల్ సేవ చేయాలనే కోరిక ఆయనలో కలిగింది. అయితే, ఆయన జీవన విధానం బాధ్యతారహితంగా ఉంది, అప్పటికి ఆయనింకా దేవునికి సమర్పించుకోలేదు. టోనీ తన జీవితాన్ని యెహోవా మార్గాలకు అనుగుణంగా మార్చుకోవాలని నిర్ణయించుకుని, బాప్తిస్మానికి అర్హత సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత, సహాయ పయినీరు, ఆ తర్వాత క్రమ పయినీరు సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకొని, వాటిని ఎప్పుడు ప్రారంభించాలనుకుంటున్నాడో తన క్యాలెండరులో వ్రాసిపెట్టుకున్నాడు. కొంతకాలం పయినీరు సేవ చేసిన తర్వాత బెతెల్లో సేవచేయడానికి ఆహ్వానించబడినప్పుడు, ఆయనెంత ఆనందించివుంటాడో ఊహించండి!
6. మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి మీకేది సహాయం చేయవచ్చు?
6 రాజ్యాన్ని మొదట వెదుకుతున్నప్పుడు మీరు కూడా మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవచ్చు. ‘మీ పనుల’ లేదా మీ లక్ష్యాల గురించి యెహోవాకు ప్రార్థించండి, వాటిని సాధించడానికి తీవ్రంగా కృషి చేయండి.—సామె. 16:3; 21:5.