ఖచ్చితమైన రిపోర్టు సేకరించబడేందుకు మీరు సహకరిస్తున్నారా?
1 బైబిల్లోని అనేక వృత్తాంతాల్లో నిర్దిష్టమైన సంఖ్యలున్నాయి, జరిగిన విషయం గురించి స్పష్టమైన చిత్రణనిచ్చేందుకు అవి దోహదపడతాయి. ఉదాహరణకు గిద్యోను కేవలం 300 మందితో మిద్యానీయులను జయించాడు. (న్యాయా. 7:7) యెహోవా దూత 1,85,000 మంది అష్షూరు సైనికులను చంపాడు. (2 రాజు. 19:35) సా.శ. 33 పెంతెకొస్తు రోజు 3,000 మంది బాప్తిస్మం పొందారు, దాని తర్వాత కొద్దికాలానికే విశ్వాసుల సంఖ్య దాదాపు 5,000కు చేరుకుంది. (అపొ. 2:41; 4:4) ప్రాచీన కాలంలోని దేవుని సేవకులు సంపూర్ణమైన, ఖచ్చితమైన వివరాలనివ్వడానికి చాలా కృషి చేశారన్నది ఈ వృత్తాంతాల నుండి స్పష్టమవుతోంది.
2 నేడు, మనం చేసే క్షేత్ర సేవా రిపోర్టులను ప్రతి నెలా ఇవ్వమని యెహోవా సంస్థ మనకు ఉపదేశిస్తోంది. మనం ఈ ఏర్పాటుకు నమ్మకంగా సహకరించడం, ప్రకటనా పనిని సమర్థంగా పర్యవేక్షించడానికి దోహదపడుతుంది. పరిచర్యలో శ్రద్ధ చూపించాల్సిన ఒక భాగాన్ని ఈ రిపోర్టులు వెల్లడి చేస్తుండవచ్చు లేదా క్షేత్రంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఎక్కువమంది సేవకుల అవసరాన్ని వెల్లడి చేస్తుండవచ్చు. పరిచర్యను విస్తరింపజేసుకునే సామర్థ్యం గలవారిని, పరిచర్యలో సహాయం అవసరమైన వారిని గుర్తించేందుకు సంఘంలోని పెద్దలకు క్షేత్ర సేవా రిపోర్టులు సహాయపడతాయి. అభివృద్ధి చెందుతున్న రాజ్య ప్రకటనా పని రిపోర్టులు మొత్తం క్రైస్తవ సౌభ్రాతృత్వానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఖచ్చితమైన రిపోర్టును ఇచ్చే విషయంలో మీరు సహకరిస్తున్నారా?
3 మీ వ్యక్తిగత బాధ్యత: మీరు పరిచర్యలో ఏమేమి చేశారో నెలాఖరున గుర్తు చేసుకోవడం కష్టంగా ఉంటోందా? అలాగైతే మీరు క్షేత్ర సేవలో చేస్తున్నది ఎప్పటికప్పుడే ఎందుకు వ్రాసి పెట్టుకోకూడదు? కొందరు క్యాలెండర్ లేదా డైరీ ఉపయోగిస్తారు. ఇతరులు క్షేత్ర సేవా రిపోర్టు ఖాళీ స్లిప్పును తమ వెంట తీసుకువెళ్తారు. నెలాఖరున మీ రిపోర్టును పుస్తక అధ్యయన పైవిచారణకర్తకు వెంటనే ఇవ్వండి. లేదా రాజ్య మందిరంలోని రిపోర్టులు వేసే బాక్సులో వెయ్యాలనుకుంటే దాంట్లో వెయ్యండి. మీరు మీ రిపోర్టును ఇవ్వడం మరచిపోతే, పుస్తక అధ్యయన పైవిచారణకర్త మీ దగ్గరకు వచ్చేంతవరకు ఎదురు చూడకుండా వెంటనే మీరు ఆయనను కలవండి. మీ పరిచర్య రిపోర్టును సమయోచితంగా ఇవ్వడం, యెహోవా ఏర్పాటు పట్ల మీకున్న గౌరవాన్ని, రిపోర్టులను సేకరించడానికి నియమించబడిన సహోదరుల పట్ల మీకున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను చూపిస్తుంది.—లూకా 16:10.
4 పుస్తక అధ్యయన పైవిచారణకర్త పాత్ర: పుస్తక అధ్యయన పైవిచారణకర్త అప్రమత్తంగా ఉండే ఒక శ్రద్ధగల కాపరిగా గుంపులోనివారు చేస్తున్న పరిచర్య కార్యకలాపాల్లో నెలంతటా శ్రద్ధ చూపిస్తాడు. (సామె. 27:23) ప్రతి ప్రచారకుడు క్రమంగా, గణనీయంగా, సంతోషంగా పాల్గొంటున్నాడో లేదో ఆయనకు తెలుస్తుంది, ఎవరైనా ఒక నెల మొత్తం పాల్గొనలేకపోతే వారికి వెంటనే సహాయాన్ని అందిస్తాడు. దానికి సాధారణంగా కావల్సింది ప్రోత్సాహకరమైన ఒక మాట, ఆచరణీయమైన ఒక సలహా, లేదా తనతో క్షేత్ర సేవకు రమ్మని ఆహ్వానించడం మాత్రమే.
5 నెలాఖరున పుస్తక అధ్యయన పైవిచారణకర్త గుంపులోని వారందరూ తమ తమ పరిచర్య రిపోర్టులను ఇచ్చే బాధ్యతను నెరవేర్చారో లేదో నిర్ధారించుకుంటాడు, అలా చేయడం వల్ల కార్యదర్శి దాని తర్వాతి నెల ఆరవ తేదీలోగా ఖచ్చితమైన సంఘ రిపోర్టును బ్రాంచి కార్యాలయానికి పంపించగలుగుతాడు. నెలాఖరు వస్తుండగా గుంపుకు ఒకసారి జ్ఞాపకం చేయడమేగాక పుస్తక అధ్యయన స్థలంలో రిపోర్టు స్లిప్పులను ఉంచితే సహాయకరంగా ఉంటుండవచ్చు. సేవా రిపోర్టు ఇవ్వడం మర్చిపోతూ ఉండేవారెవరైనా ఉంటే, ఆయన వారికి సముచితమైన రీతిలో గుర్తు చేస్తూ ప్రోత్సహించవచ్చు.
6 మన క్షేత్ర సేవా రిపోర్టులను సమయానికి ఇవ్వడం క్షేత్రంలో ఏమి సాధించబడిందో ఖచ్చితంగా వెల్లడి చేసే నివేదికను సిద్ధం చేయడానికి దోహదపడుతుంది. ప్రతి నెలా మీ రిపోర్టును సమయానికి ఇవ్వడం ద్వారా మీరు మీ పాత్రను నెరవేరుస్తారా?