రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగుతోంది
1 అమెరికాలో 1983లో జరిగిన “రాజ్య ఐక్యత” అనే జిల్లా సమావేశాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, కెనడాలోనూ రాజ్య మందిరాల నిర్మాణానికీ కొత్త నమూనాలోకి మార్చడానికీ తోడ్పడే ఒక ప్రత్యేక నిధిని స్థాపించబోతున్నట్లు ప్రకటించబడింది. అలా చిన్నగా ఆరంభమైన పనికి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో వారు అప్పుడు ఏమాత్రం ఊహించలేదు. “యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను” అని ఎంతో సముచితంగా చెబుతున్న కీర్తన 92:4లోని మాటలను వారు మరింత బాగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. తర్వాత, ఆ నిధులను ఆర్థికంగా వెనుకబడిన ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్ల్లోని సహోదరులకు సహాయపడడానికి ఉపయోగించేలా ఆ ఏర్పాటును విస్తరింపజేశారు.
2 ఇప్పుడు జరుగుతున్న పనినిబట్టి మనమందరం ఎంతో ఆనందించవచ్చు. నేడు ప్రపంచవ్యాప్తంగా రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఇండియాలో ఉన్న మనం ఆ కార్యక్రమంలో పాల్గొనే ఆధిక్యతను ఎలా పొందవచ్చు? ప్రస్తుతం స్థానిక సంఘాలు ఇచ్చే కొద్దో గొప్పో విరాళాల మీదే ఆధారపడివున్న మన దేశంలోని రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమానికి మద్దతివ్వడం ద్వారా మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. బహుశా అలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన నైపుణ్యతలు, సామర్థ్యాలుగల సహోదరులు తమ సమయాన్ని కూడా స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. మనం ఎంత ఇచ్చినా, మన సమైఖ్య ప్రయత్నాలకు యెహోవా మార్గదర్శకం, మద్దతు, ఆశీర్వాదాలు ఉండడం వల్లనే ఆ ఏర్పాటు విజయవంతమవుతుందని మనకు తెలుసు.—కీర్త. 127:1.
3 దేశవ్యాప్తంగా ఉన్న రాజ్య మందిరాల్లో, ప్రచారకులు రాజ్య మందిర నిధి కోసం విరాళాలు వేసేందుకు వీలుగా విరాళపు పెట్టె ఉంటుంది. అదనంగా అనేక సంఘాలు ప్రతినెలా తమ సంఘ నిధుల్లో నుండి కొంత సొమ్మును విరాళంగా పంపించాలని తీర్మానించుకున్నాయి. మరి కొన్ని సంఘాలు తాము జమచేసుకున్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుకోవడానికి బదులు, ఆ డబ్బును రాజ్య మందిర నిధికి పంపించాయి. తాము రాజ్య మందిరం నిర్మించే ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు, తాము పంపించిన డబ్బు నుండే కాకుండా, ప్రస్తుతం రాజ్య మందిరం కోసం సహాయం అవసరం లేని ఇతర సంఘాలు పంపించిన డబ్బు నుండి కూడా సహాయం పొందవచ్చనే నమ్మకంతో ఆ సంఘాలు అలా పంపించాయి.
4 ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది? ఈ ఏర్పాటు గురించి ప్రచారకులకు మొదటిసారి తెలిసినప్పటి నుండి, అంటే గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు రెండు కొత్త రాజ్య మందిరాలకు సరిపడేంత డబ్బు పోగుచేయబడింది. ఈ నిధి ద్వారా తగిన రాజ్య మందిరాలను నిర్మించుకొని ఇప్పటికే ప్రయోజనం పొందిన సంఘాలు కూడా, తమలాగే వేరే సంఘాలు కూడా ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో క్రమంగా ఇంకా విరాళాలను పంపించడం చూస్తుంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ప్రస్తుతం తమ సొంత రాజ్య మందిరాన్ని నిర్మించుకునే స్థితిలో లేనివారు, ప్రతీనెల విరాళాలను పంపించడం ప్రారంభించారు. అలా పంపించే విరాళాలు దేశంలో ఎక్కడో ఒకచోట నిర్మించబడే రాజ్యమందిరానికి వెంటనే ఉపయోగించబడడమేకాక, తగిన సమయం వచ్చినప్పుడు తమ సొంత ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతుగా అలాంటి విరాళాలే ఉపయోగించబడవచ్చనే ఆనందం వారికి ఉంది.
5 ఈ ఏర్పాటుపై ఇతర దేశాల్లో యెహోవా ఆశీర్వాదాలకు రుజువును, ఇప్పటివరకు నిర్మించబడిన కొన్ని రాజ్య మందిరాల చిత్రాలను చూసి మీరు అర్థంచేసుకోవచ్చు. అలాంటి నిర్మాణాలు ఆ దేశాల్లో యెహోవాసాక్షుల పనిపై ఎలాంటి ప్రభావం చూపాయో ఊహించండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాత్రుత్వం, స్థానిక సమాజంపై ప్రభావం, సంఘ కూటాల్లో హాజరయ్యేవారి సంఖ్య పెరగడం అనే మూడు విభిన్న విషయాల్లో స్పష్టమైంది. ఈ పేజీలు ఆఫ్రికాలో నిర్మించబడిన రాజ్య మందిరాలను ప్రాముఖ్యంగా చూపిస్తున్నా, మున్ముందు మన రాజ్య పరిచర్య ప్రతులు ఈ రాజ్య మందిర నిర్మాణ కార్యక్రమం మన ఇండియాలో ఎలా కొనసాగుతోందనే దానిపై దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ కార్యక్రమం నుండి మీ సంఘం ప్రయోజనం పొందుతుందా? ఈ పథకంలో మీరు సాధ్యమైనంత పూర్తిగా పాల్గొనగలిగేలా మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించును గాక.
[5వ పేజీలోని చిత్రాలు]
బింబో, బాంగుయి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
బగువ, బాంగుయి
[6వ పేజీలోని చిత్రాలు]
ఉకొన, టాంజానియా
సలాల, లైబీరియా
పెమె, టోగో
సోకోడా, టోగో
కరోయీ, జింబాబ్వే